వెండితెరపై కాళోజీ జీవితం

తెలంగాణకు చెందిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణ రావు జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. జైనీ క్రియేషన్స్‌ పతాకంపై విజయలక్ష్మీ జైనీ నిర్మాణంలో దర్శకుడు ప్రభాకర్‌ జైనీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో కాళోజీగా మూలవిరాట్‌, ఆయన భార్యగా పద్మ, కొడుకుగా రాజ్‌కుమార్‌, కోడలుగా స్వప్న తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని సెన్సార్‌కు వెళ్ళబోతున్న సందర్భంగా ఇందులోని పాటలను మీడియాకు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో దర్శకుడు మాట్లాడుతూ, ‘మా సినిమాలోని గొప్ప ఔన్నత్యాన్ని గుర్తించి నిర్మాత రామసత్యనారాయణ రిలీజ్‌ చేస్తామని చెప్పడం మాకు కొండత దైర్యాన్ని ఇచ్చింది. కాళోజీ జీవితం ఒక అనంత ప్రయాణం. అందుకే, కాళోజీ ఔన్నత్యాన్ని, కాళోజీ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే కొన్ని సన్నివేశాలను మాత్రమే ఉదాహరణగా తీసుకుని…ఆయా సంఘటనలను సష్టించుకుని, స్క్రీన్‌ ప్లే రాసుకున్నాను. ఇది రెగ్యులర్‌ సినిమా కాదు… ఒక జీవితం! ఈ సినిమాను కాళోజీ జీవించిన, ఆయన తిరిగిన ప్రదేశాల్లో చిత్రీకరణ చేశాం’ అని తెలిపారు. ‘పాటల మాదిరిగానే సినిమా కూడా బిగ్‌ హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలకు థియేటర్స్‌ ఇప్పించే బాధ్యతని తీసుకున్నాను’ అని నిర్మాత టి.రామసత్యనారాయణ అన్నారు.