‘కల్తీ’ సర్వాంతర్యామి

'Kalti' is universalబతకటానికి తిండి తింటాం మనం. కానీ, తింటే బతకలేమని తెలుస్తోంది నేడు. ఇందుగలదు.. అందు లేదన్న సందేహం వలదు.. అన్న చందంగా నేడు ఆహార పదార్థాల్లో కల్తీ, నకిలీలతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది. బ్రాండెడ్‌లను పోలిన విధంగా నకిలీలను తయారు చేస్తున్నారు. కల్తీ వస్తువులతో చేసిన ఆహారాన్ని అంటగడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో ఆహార కల్తీ తీవ్రమైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్‌ బృందం, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇటీవల దాదాపు 500ల చోట్ల తనిఖీలు చేయగా, 90శాతం కేంద్రాల్లో కల్తీలు బయటపడటమే అందుకు నిదర్శనం. దాంతో భాగ్యనగరవాసులు బయట తినాలంటే వణికిపోతున్నారు. వరుసగా దాడులు చేస్తున్నప్పటికీ కొందరు యజమానులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరి స్తోన్నారు. కుళ్లిన మాంసం, కూరగాయలను వంటలకు ఉపయోగిస్తూ ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. ఆహార కల్తీని, నకిలీల తయారీని అరికట్టాల్సిన ఆహార ప్రమాణాల పరిరక్షణ శాఖలో సిబ్బంది కొరత కూడా కల్తీ కేటుగాళ్లకు కలిసివస్తోంది. యాజమాన్యాలతో కుమ్మక్కయిన కొందరు అధికారులు ప్రయోగశాల నివేదికలను తొక్కిపెడుతున్నారనే విమర్శలొ స్తున్నాయి.
హైదరాబాద్‌లోనే దాదాపు 70 వేలకు పైగా ఆహార విక్రయ కేంద్రాలుంటాయని అంచనా. ఇవి కాకుండా చిరుతిళ్లు అమ్మే తోపుడు బండ్లు, ఫుడ్‌ట్రక్‌లు మరో 20 వేల వరకు ఉంటాయని సమాచారం. అధికారికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆహార భద్రతాధికారులు (ఎఫ్‌ఎస్‌వో)ఈ ఏడాదిలో ఇప్పటివరకు జారీ చేసిన లైసెన్సులు 16,274 మాత్రమే కావడం గమనార్హం. దాదాపు కోటిన్నర జనాభా, సుమారు 90 వేల ఆహార విక్రయ కేంద్రాలున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉన్నది కేవలం 21 మంది ఎఫ్‌ఎస్‌వోలు మాత్రమే. క్రమపద్ధతిలో హోటళ్ల తనిఖీ చేపడితే అన్నింటినీ తనిఖీ చేయడానికి వీరికి ఏండ్లు పట్టవచ్చు. రాష్ట్ర ఆహార పరిరక్షణ విభాగంలో మొత్తం 62 సర్కిళ్ల పరిధిలో లక్షల సంఖ్యలో ఉన్న ఆహార కేంద్రాల తనిఖీకి ఉన్న అధికారుల సంఖ్య 76 మాత్రమే కావడం గమనార్హం.
‘కల్తీకి కాదేదీ అనర్హం’ అన్నట్టు ప్రస్తుతం మన నిత్యావసర వస్తువులన్నీ ‘కల్తీ’మయమే. పండ్లు, పాలు, నూనెలు, కూరగాయలు ఇలా చెబుతూ పోతే సమస్త ఆహార ఉత్పత్తుల్లో కల్తీ కాని పదార్థాలు వేళ్లమీద లెక్కబెట్టే అన్ని కూడా లేవు. ఏది కొనాలో, ఏది తినాలో, ఏది మంచిదో, ఏది చెడ్డదో నిర్ధారించుకోలేని స్థితికి నెట్టివేయబడ్డాం. నిత్యం బిర్యానీలోనో.. కూరల్లోనో.. కప్పలు, బల్లులు, బొద్దింకలు వచ్చాయంటూ జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కల్తీ మాయాబజారులో డబ్బులిచ్చి మరీ రోగాలను కొని తెచ్చుకుంటున్నాము. అనారోగ్యాలతో దవాఖానాల పాలైతే అక్కడిచ్చే మందులను కూడా అనుమానించక తప్పని ప్రపంచంలో బతుకుతున్నాం. వీటిపై చర్యలు తీసుకుని ప్రజారోగ్యానికి భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలకు ఇది కనీస సమస్యగా కూడా కనపడకపోవడం వైచిత్రి.
తూతూ మంత్రంగా ఏడాదికి ఒకసారి తనిఖీలు చేస్తే ఫలితం శూన్యం. పైపెచ్చు కల్తీ నిరోధక వ్యవస్థ బలహీనత, సిబ్బంది కొరతను గమనించి, ఇది ‘మూడు పువ్వులు ముప్ఫయి ఆరు కాయలు’గా వర్థిల్లుతున్నది. కల్తీ ఆహార పదార్థాలపై పర్యవేక్షణ చేసేందుకు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల ఉద్యోగాలను నింపాలని హైకోర్టు ఆదేశించి ఏండ్లు గడుస్తుంటే…కొత్తగా పదిహేడు మంది ఫుడ్‌ సేఫ్టీ అధికారులను ఈ ప్రభుత్వం నియమించింది. ప్రతి ఐదువందల మంది జనాభాకు ఒక ఫుడ్‌ సేఫ్టీ అధికారిని నియమిస్తామని సర్కార్‌ ప్రకటించడం సంతోషమే. కానీ, అది ఆచరణ రూపం దాల్చకపోతే మాత్రం మార్పేమి ఉండదు.
అసలు కల్తీ మాఫీయాను అడ్డుకోవడానికి ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులేమిటి? ప్రజల ప్రాణాలను హరిస్తున్న ఈ మాఫియాపై చర్యలకెందుకు ఉపక్రమించడం లేదు. ప్రజల ప్రాణాలకంటే ముఖ్యమైన ప్రయోజనాలు పాలకులకేమైనా ఉన్నాయా? అన్న అనేక సందేహాలు కలుగుతున్నాయి. గతంలో వినియోగదారుల ఫోరమ్‌ వంటివి కల్తీ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చట్టాల కొరడా ఝుళిపించేవి. నేడా వ్యవస్థను ఎందుకు నిర్వీర్యమైంది? ‘కల్తీ’ సర్వాంతర్యామి అయి అన్ని వ్యవస్థలను కలుషితం చేస్తోంది. ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని పెకిలించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ, రాజకీయాలు అంతకంటే కల్తీగా మారిపోయాయి. చెప్పేదొకటి చేసేదొకటిగా, బయటకొకటి, లోనొకటిగా మా రింది. సేవ అనేది మారి స్వాహా మొదలైంది. ఈ కల్తీల నుండి సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యతను విస్మరిస్తే ఈ ప్రభుత్వాలను కదిలించాల్సింది చైతన్యవంతమైన ప్రజలే.