
మోపాల్ మండలం నర్సింగ్ పల్లి గ్రామంలోని ఇందూరు తిరుమల ఆలయంలో శ్రీనివాసుని కల్యాణ ఉత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు భాగంగా మంగళవారం దేవదేవుల ఉత్సవమూర్తులను మేళ తాళాలు డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపు నిర్వహించి ఆలయ ఆవరణలో అందంగా ముస్తాబు చేసిన మండపంలో కొలువు తీర్చారు. అనంతరం వేద పండితులు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని సంప్రదాయ రీతిలో నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కళ్యాణంలో పాల్గొని శ్రీనివాసునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి కల్యాణంలో పాల్గొంటే కన్యాదాన ఫలం వస్తుందని దేవనాథ జీయర్ స్వామి వారు అన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఉదయం యజ్ఞ కార్యక్రమం ముగిసిన తరువాత స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో పరిసరాలు భక్తులతో నిండిపోయింది. ఈ కార్యక్రమాల్లో దేవనాథ జీయరు స్వామి, ఆచార్య గంగోత్రి రామానుజదాస్ స్వామి, ప్రముఖ నిర్మాత శిరీష్, సినీ హీరో ఆశిష్, నర్సింహారెడ్డి, విజయసింహ రెడ్డి, నరాల సుధాకర్, రవీందర్ యాదవ్, నర్సారెడ్డి, యాజ్ఞాచార్యులు శిఖామణి, శ్రీకర్ కుమారాచార్యులు, రోహిత్ కుమారాచార్యులు తదితరులు పాల్గొన్నారు.