చికాగో నగరంలో జరిగిన డెమోక్రటిక్ పార్టీ సమావేశం తన అధ్యక్ష అభ్యర్థిగా కమలాదేవి హారిస్‌ను ప్రకటించింది. తనకు ఎదురులేదని విర్రవీగుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు ఆమె చుక్కలు చూపిస్తున్నది.దీంతో ముదిమది తప్పినట్లుగా 79 ఏండ్ల ట్రంప్ 59 సంవత్సరాల కమలతో పోల్చితే తానే అందంగా ఉంటానంటూ దిగజారుడు ప్రచారానికి పూనుకున్నాడు. పిరికి వారే అలాంటి ప్రచారం చేస్తారంటూ ఆమె తిప్పికొట్టింది. ప్రచారంలో తొలుత అభ్యర్థిగా ఉన్న జోబైడెన్ తడబడటం, పొంతన లేుండా మాట్లాడటం వంటి పరిణామాల పూర్వరంగంలో కమల రంగంలోకి వచ్చింది. నవంబరు ఐదవ తేదీన జరిగే ఎన్నికలకు ముందు సెప్టెంబరు పదవ తేదీన, తరువాత జరిగే చర్చల్లో ఆమెను ఎదుర్కొనేందుకు మాజీ ఎంపీ తులసీ గబ్బార్డ్ సాయం తీసుకోవాలని ట్రంప్ నిర్ణయించాడు. పార్టీలకు వేసే ఓట్లను బట్టిగాక ఎలక్టరల్ కాలేజీలో తెచ్చుకొనే ఓట్లే అధ్యక్ష పదవిలో కూర్చునే వారిని నిర్ణయిస్తాయి. అలాంటి ఓట్లు 538 కాగా, గెలవాలంటే 270 కావాలి. ఆగస్టు నెల 18వ తేదీన ఉన్న పరిస్థితిని బట్టి కమలా హారిస్ 225, డోనాల్డ్ ట్రంప్ 219 ఓట్లతో పోటీ పడుతున్నట్లు ఒక సర్వే వెల్లడించింది. మరికొన్ని కూడా అదే విధమైన వివరాలను ఇస్తున్నాయి.ఎన్నికల నాటికి ఈ అంకెలన్నీ మారిపోతుంటాయి. రెండు పార్టీలకు సాంప్రదాయంగా బలమైన కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఎటూ మొగ్గని చోట పలుకుబడి పెంచుకొనేందుకు అభ్యర్థులు పోటీ పడతారు. ఈ క్రమంలో ప్రచారంలో ఎన్నో అవాస్తవాలు, దిగజా రుడు పదవిన్యాసాలు, వినిపిస్తాయి, కనిపిస్తాయి. అమెరికాలో ట్రంపు నోరు ఎంతో కంపును వెదజల్లుతోంది. ఏం మాట్లాడతాడో తెలియదు.గతంలో బైడెన్ ఒక దొంగ,మోసగాడు, అబద్దాల కోరు, చరిత్రలో చెత్త అధ్యక్షుడు అంటూ నోరుపారవేసుకున్న పెద్ద మనిషి ఇప్పుడు కమలా హారిస్ మీద కూడా అదే మాదిరి దాడి చేస్తున్నాడు. ఆమె కూడా దొంగ, అబద్దాల కోరు, ఆమె నిజంగా నల్లజాతీయురాలు కాదు కానీ ఇప్పుడు అలా చెప్పుకుంటున్నది. ఆమె తన పేరును కూడా సరిగా ఉచ్చరించలేదు, ఆమె అసమర్దురాలు, చిత్తకార్తె కుక్క అని మాట్లాడాడు.ఆమె సభలకు జనం రావటం లేదు, కృత్రిమ మేథ ద్వారా పెద్ద ఎత్తున జనం ఉన్నట్లు చిత్రిస్తున్నారు అన్నాడు. అమెరికా ఎన్నికల్లో పోటీ పడుతున్న రెండు ప్రధాన పార్టీలూ వర్గరీత్యా బహుళజాతి గుత్త సంస్థలు, ఆయుధతయారీదార్లకు అనుకూలమైనవే. ఎవరి హయాంలో ఎక్కడ చిచ్చుపెట్టినా అధికార మార్పిడితో నిమిత్తం లేకుండా ఎవరు గెలిచినా దాన్ని ఆరకుండా చూడటంలో దొందూ దొందే. అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించటంలో రెండు పార్టీలూ విఫలమయ్యాయి. ఈ కారణంగానే పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే భావన అక్కడ రోజు రోజుకూ పెరుగుతోంది. కొన్ని సామాజిక సమస్యల్లోనే రెండు పార్టీల మధ్య తేడాలు ఉన్నాయి. అక్కడి వామపక్ష శక్తులు, ఉదారవాదులు ఏ రాక్షసుడితో తక్కువ ముప్పు అని చూసి చిన్న రాక్షసుడిగా ఉండే డెమోక్రటిక్ పార్టీకి మద్దతు ఇస్తుంటారు.
కీలకమైన రాష్ట్రాలలో కమలాహారిస్‌ది పైచేయిగా కనిపించటంతో ట్రంప్ రెచ్చిపోతున్నాడు.పెన్సిల్వేనియా రాష్ట్రంలో జరిగిన సభల్లో మాట్లాడుతూ సలహాదారులు రాసి ఇచ్చిన ప్రసంగాన్ని పక్కన పెట్టి కమలాహారిస్ కమ్యూనిస్టు, ఫాసిస్టు అజెండా లను పాటిస్తున్నారని ఆరోపించాడు. ట్రంప్ ప్రసంగం విసుగు పుట్టించి సభికులు మధ్యలోనే లేచిపోతుండటంతో కమలా హారిస్ మీద వ్యక్తిగత దూషణలతో ఆకర్షించేందుకు చూశాడు. జో బైడెన్ పాలనలో ధరలు పెరిగాయని, కుటుంబాల మీద పెరిగిన భారాన్ని ”కమలా హారిస్ ద్రవ్యోల్బణ పన్ను” అని, కామ్రేడ్ కమల ముందు రోజు చేసిన ప్రసంగంలో ఒక కమ్యూనిస్టు మాదిరి మాట్లాడారని, సోషలిస్టు వ్యవస్థలో మాదిరి ధరల నియంత్రణ కోరుతున్నారని, అంటే సరకుల కొరత, ఆకలి, ధరల పెరుగుదల అని ఆరోపించాడు.ఆమెను బైడెన్ ద్వేషిస్తాడు, అతగాడి మీద కుట్ర చేసి ఆమె అభ్యర్థిగా నిలిచారన్నాడు. మీరు ఎప్పుడైనా ఆమె నవ్వటాన్ని చూశారా ? ఒక పిచ్చిదానిలా నవ్వుతుంది అంటూ నోరుపారవేసుకున్నాడు. ఇంకా అనేక అవాస్తవాలను ప్రస్తావించాడు.పెన్సిల్వేనియా గవర్నర్‌గా ఉన్న జోష్ షాపిరోను ఉపాధ్యక్ష పదవికి ఎందుకు అభ్యర్థిగా ఎంచుకోలేదో తెలుసా అని ప్రశ్నిస్తూ అతను ఒక యూదుడు గనుక, యూదులెవరైనా కమల లేదా డెమోక్రాట్లకు ఓటు వేస్తే వారి బుర్రలను ఆసుపత్రిలో పరీక్ష చేయించాలని రెచ్చగొట్టాడు.పోటీ నుంచి తప్పుకున్న జోబైడెన్ గురించి ఎక్కువగా మాట్లాడవద్దని వారిస్తున్నా ట్రంప్ ఆగలేదు.నేను అతన్ని దెబ్బతీశాను గనుక, ఇప్పుడు ఆమెను కూడా అదే చేయకపోవటం అన్యాయం అంటూ కేకలతో వీరంగం వేశాడు.కమల వయసులో ఉండగా ఆమెతో సహజీవనం చేసిన కాలిఫర్నియా అసెంబ్లీ మాజీ స్పీకర్ విలీ బ్రౌన్ ఆమె గురించి భయంకరమైన అంశాలు చెప్పాడంటూ వ్యక్తిగత అంశాలను ప్రస్తావించాడు. ముగ్గుర్ని వివాహాలు చేసుకొన్న డోనాల్డ్ ట్రంప్ ఎలాంటి తిరుగుబోతో కేేసులను ఎలా ఎదుర్కొన్నాడో అందరికీ తెలిసిందే, అలాంటి వ్యక్తి ప్రత్యర్థుల మీద దాడి చేస్తున్నాడు. ప్రతికూల ప్రచారం చేసేందుకు పూనుకున్న ట్రంప్ చివరికి బ్రిటన్ చరిత్రలో తనను తాను గొప్పగా ఊహించుకొని పరిపాలనకే అర్హత లేని పిచ్చి రాజుగా ప్రఖ్యాతి గాంచిన మూడవ జార్జి మాదిరి ఉన్నాడని కొందరు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. ఆ రాజు రెచ్చిపోకుండా పక్కనున్నవారు అదుపుచేయటంలో జయప్రదమయ్యారని, కానీ ట్రంప్ అనుచరులు ప్రయత్నించి విఫలమైనట్లు వ్యాఖ్యానించారు. ప్రత్యర్ధులను ఇరుకున పెట్టబోయి తానే ఇరుక్కునట్లు పేర్కొంటున్నారు.
ఎన్నికల్లో ఒకవేళ ఓడిపోతే ఓటమిని అంగీకరించకుండా ఉండేందుకు ఇప్పటినుంచే పూర్వరంగాన్ని సిద్ధం చేసుకుంటు న్నాడని డెమోక్రటిక్ సోషలిస్టు నేత బెర్నీ శాండర్స్ తాజాగా ట్రంప్ గురించి ఓటర్లను హెచ్చరించాడు.మిచిగన్ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున కమలా హారిస్ ఆమె ఉపాధ్యక్ష అభ్యర్థి,మినెసోటా గవర్నర్ వాల్జ్‌కు వేలాది మంది స్వాగతం పలికారు. మీడియా దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. అదంతా కృత్రిమ సృష్టి అని వర్ణించిన ట్రంప్ వెర్రి వాడిలా కనిపించవచ్చు గాని బుద్ధి హీనుడు కాదని, తెలివిగా ఓటమిని తిరస్కరించేందుకు పధకం వేస్తున్నాడని శాండర్స్ అన్నాడు.ప్రజాస్వామ్యాన్ని తక్కువచేయటం ఫాసిజం తప్ప మరొకటి కాదని అందుకే ట్రంప్‌ను ఓడించేందుకు చేయాల్సిందంతా చేయాలని శాండర్స్ అన్నాడు. గత ఎన్నికలలో ఓడిన తరువాత ఓటమిని అంగీకరించని ట్రంప్ 2021జనవరి ఆరవ తేదీన అమెరికా అధికార కేంద్రంపైకి తన అనుచరులను ఉసిగొల్పిన సంగతి తెలిసిందే.ఇప్పటికీ ఆ కేసుల విచారణ కొనసాగుతున్నది. కమల-వాల్జ్ రంగంలోకి దిగటంతో అంతకు ముందు బైడెన్ మీద ఉన్న వ్యతిరేకత, హత్యాప్రయత్నంతో వచ్చిన ఆధిక్యత ఆవిరైపోతుండటంతో గతాన్ని పునరావృతం కావించేందుకు పూనుకున్నాడని అనేక మంది భావిస్తున్నారు.గత ఎన్నికను వమ్ము చేసేందుకు చూసిన దేశమంతటా ఉన్న గాంగులో 35 మంది ఇప్పటికీ ప్రభుత్వంలో వివిధ బాధ్యతల్లో ఉన్నారు, వారు తిరిగి రెచ్చిపోవచ్చు.అయితే గత అనుభవాలను గమనంలో ఉంచుకొని సరికొత్త పద్ధతుల్లో వారు ప్రవర్ించవచ్చని కూడా హెచ్చరికలు వెలువడ్డాయి.
జో బైడెన్‌తో జరిపిన తొలి సంవాదం సందర్భంగా ట్రంప్ ఇతరుల సాయం తీసుకున్నాడు. మారిన పరిస్థితుల్లో కమలా హారిస్‌తో ఎన్నికల సంవాదానికి డోనాల్డ్ ట్రంప్‌కు మాజీ మిలిటరీ అధికారిణి, డెమోక్రటిక్ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యురాలు, తరువాత రిపబ్లికన్ పార్టీకి ఫిరాయించిన తులసీ గబ్బార్డ్ సాయం కావాల్సి వచ్చింది. డెమోక్రటిక్ పార్టీలో ఉండగా కమలా హారిస్ మంచి చెడ్డలు, ఆమె రాజకీయ, ఇతర అంశాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి తులసి. 2020లో అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం కమలాహారిస్‌తో పాటు పార్టీలో పోటీ పడింది. 2022లో ఆమె రిపబ్లికన్ పార్టీలో చేరింది. అందుకే ట్రంప్ ఆమెను ఎంచుకున్నాడు. తులసి తిరోగమన భావాలు ట్రంప్‌కు ప్రతిరూపంగా ఉంటాయి. అమెరికా ఎన్నికల్లో పోటీకి దిగిన వారు ఎంత సీనియర్లు అయినా ఓటర్లను ఆకర్షించేందుకు అనుసరించాల్సిన అంశాలు, చర్చ సందర్భంగా ప్రదర్శించాల్సి హావభావాలు తదితర అంశాలన్నింటి మీద ఆయా రంగాలలో నిపుణులుగా పేరుపొందిన వ్యక్తులు, సంస్థల ప్రతినిధుల వద్ద శిక్షణ తీసుకుంటారు. కమలా హారిస్ కూడా నాలుగుదశాబ్దాల క్రితం తాను చదివిన వాషింగ్టన్‌లోని హౌవార్డ్ విశ్వవిద్యాలయంలో శిక్షణా తరగతులకు హాజరైంది.డోనాల్డ్ ట్రంప్ గతం, అతను ఎలాంటి వాడు, బలం, బలహీనతలు తదితర అంశాలపై అవగాహన పెంచుకొనేందుకే ఈ కసరత్తు.
తులసీ గబ్బార్డ్‌ను ఎంచుకోవటంలో తనకూ కమలతో సమానమైన మహిళ తులసి మద్దతు ఉందని చెప్పుకొనేందుకు, అమెరికాలో స్థిరపడిన హిందువుల ఓట్ల వేట కూడా ఇమిడి ఉంది. కమలా హారిస్ భారతీయ మూలాలు ఉన్న ఆఫ్రికన్. ఆమె తల్లి శ్యామలా గోపాలన్, భారతీయురాలు. తండ్రి డోనాల్డ్ జె హారిస్ జమైకా నుంచి అమెరికా వచ్చాడు. వారి సంతానమే కమలా హారిస్. సోదరి పేరు మాయా హారిస్. తలిదండ్రులు విడిపోవటంతో తల్లిదగ్గరే పెరిగారు, ఆఫ్రికన్లే వారిని ఆదరించారు.అదే వాతావరణంలో ఎదిగారు.తులసీ గబ్బార్డ్ తల్లి కరోల్ అమెరికా ఇండియానా రాష్ట్ర పౌరురాలు కాగా తండ్రి మైక్ గబ్బార్డ్ ఐరోపా మూలాలున్న వలస కుటుంబానికి చెందిన వ్యక్తి. అమెరికాకు చెందినప్పటికీ దానిలో విలీనం కాని దక్షిణ పసిఫిక్ సముద్రంలోని సమోవా దీవుల్లో జన్మించాడు. వారు హవాయి చేరిన తరువాత కరోల్ హిందూమతం పట్ల ఆకర్షితురాలు కావటమే గాన తన ఐదుగురు బిడ్డలకు హిందువుల పేర్లు పెట్టింది. వారిలో తులసి ఒకరు.ఆమె తాను చైతన్య వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పుకుంటుంది.డెమోక్రటిక్ పార్టీలో ఉన్నపుడు 2020 ఎన్నికల్లో పార్టీలో కమలతో పోటీపడి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. అయితే కమల కంటే తులసికి తక్కువ ఓట్లు వచ్చాయి. తరువాత ఇద్దరూ పోటీ నుంచి తప్పుకొన్నారు. జో బైడెన్ తన ఉపాధ్యక్ష అభ్యర్ధిగా కమలను ఎంచుకోవటంతో సహించలేక తరువాత తులసీ పార్టీ ఫిరాయించారు.మన దేశంలో ఉన్నట్లే అమెరికాలో కూడా జ్యోతిష్కులకు కొదవ లేదు.ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచేదీ, ఓడేదీ జోశ్యాలు మొదలయ్యాయి. డోనాల్డ్ ట్రంప్‌కు పరిస్థితి నల్లేరు మీద బండిలా లేకపోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడని ఆమీ ట్రిప్ అనే జ్యోతిష్కురాలు ఇండియా టుడేతో చెప్పింది.జో బైడెన్ బరినుంచి తప్పుకుంటాడని తాను సరిగానే చెప్పానని ఆమె చెప్పుకుంది. మీడియా సర్వేలు ఇప్పటి వరకు ఇచ్చిన విశ్లేషణల ప్రకారం కమలా హారిస్ ముందంజలో ఉన్నారు.
– ఎం కోటేశ్వరరావు, 8331013288