కమనీయం కాశ్మీరం

Kamaniyam Kashmirభారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు పెట్టనిగోడల్లాంటివని చిన్నప్పుడు చదువుకున్నాను. పెద్దయ్యాక మనుచరిత్రలో పెద్దన ‘అట జనిగాంచె భూమిసురుడంబరచుంచి శిరస్సరఝరీ పటలము హోర్ముహోర్లుట దభంగ తరంగ’మనే పద్యం హిమాలయాల్లో ప్రవహించే జలతరంగ ధ్వనిని స్ఫురింపజేయడం చదివాను. ఆకాశాన్ని అంటే హిమాలయ పర్వత పంక్తుల్ని చూడడానికి ‘లెట్స్‌ ఎక్స్‌ప్లోర్‌ ట్రిప్స్‌’ అనే ట్రావెల్‌ ఏజెన్సీని సంప్రదించాను.
హైదరాబాద్‌ నుండి ఢిల్లీ, అక్కడ ‘లే ఓవర్‌’ తర్వాత శ్రీనగర్‌కు రాను పోను టిక్కెట్లు బుక్‌ అయినాయి. 27 జులై ఉదయం నేను, నా శ్రీమతి కిరణ్మయి, ఆమె అక్క శ్రీదేవి మా కాశ్మీర్‌ యాత్ర కోసం శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నాం. అప్పటికి వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా హైదరాబాద్‌ వర్షంలో తడిసిపోతున్నది. విమానాశ్రయం మబ్బులు కమ్మిన ఆకాశం కారణంగా మసక వెలుతురులో వుంది. విమానం ఎక్కాక కిటికీ అద్దాల మీద నీటి చుక్కలు పడుతూనే వున్నాయి. ఉదయం 9.30 గంటలకు బయలుదేరిన విమానం నీళ్లు నిండి వున్న మబ్బుల్ని దాటి పోవడంతో సూర్య కిరణాలు కనిపించాయి. చాలా రోజుల తర్వాత ఎండ కనిపించడం సంతోషం కలిగించింది. 12 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో దిగి బయట ఉచిత బస్సులో టర్మినల్‌ 1కి చేరుకున్నాం. శ్రీనగర్‌ ‘కనెక్టింగ్‌’ విమానం 2.50 నిమిషాలకు ఉండడంతో మేం వెళ్లాస్సిన గేటు దగ్గర నిరీక్షిస్తున్న సమయంలో ట్రావెల్‌ ఏజన్సీ వారు ఏర్పాటు చేసిన కారు డ్రైవర్‌కు ఫోన్‌ చేశాను. డ్రైవర్‌ రమీజ్‌ ఫోన్‌ ఎత్తగానే ‘అస్సలాం వలైకుం’ చెప్పాను. అతను ‘వలైకుం సలాం’ అని ప్రతిస్పందించాడు. మేం ఢిల్లీలో వున్నామని, శ్రీనగర్‌కు 4.30కి చేరుకుంటామని చెప్పాను. ‘బందే కిత్‌నేహై’ అన్నాడు. మొదట్లో అర్ధం కాలేదు ఉచ్ఛారణ, కానీ ఎంతమంది అని అర్ధం అయ్యాక ముగ్గురం అన్నాను. విమానాశ్రయానికి వచ్చి వుంటానని అన్నాడు. ఉచ్ఛారణలో కొంత తేడా వున్నా మాటలో సౌమ్యత ఉందనిపించింది. సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు శ్రీనగర్‌ షేక్‌ ఉల్‌ అలామ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నాం. ఏర్‌ పోర్ట్‌ నుంచి బయటకు వచ్చిన మమ్మల్ని స్నేహ పూర్వకంగా నవ్వుతూ పలకరించాడు. 27 సంవత్సరాల వయసు వున్న డ్రైవర్‌ రమీజ్‌. కారు మాకు రూం బుక్‌ అయి వున్న ‘పామ్‌ స్ప్రింగ్‌’ హోటల్‌కు బయలుదేరింది. సాయంత్రం అవుతుండడంతో రోడ్లమీద ట్రాఫిక్‌ అంతగా లేదు. అరగంటలో హోటల్‌ కు చేరుకున్నాం. కారు ఆగగానే ఇరవై ఏళ్ల కుర్రాడు అప్జల్‌ పరుగెత్తుకు వచ్చాడు. ‘ఆప్‌ అందర్‌ జాయియే సాబ్‌, మై లగేజ్‌ రూం మే లావుంగా’ అన్నాడు. మేనేజర్‌ సాదరంగా మమ్మల్ని ఆహ్వానించాడు. బుకింగ్‌ ఆర్డర్‌ ఐ.డి. చూపించబోతే ముందు కాసేపు కూచోండి అన్నాడు. ప్రయాణ బడలికతో వున్న మాకు వెయిటర్‌ కాశ్మీర్‌ల ప్రత్యేక టీ కహవా అందించాడు. ఫార్మాలిటీస్‌ పూర్తి చేసి గదిలోకి వెళ్లాం.
ఆ రాత్రి హోటల్‌ లో డిన్నర్‌ చాలా బాగుంది. రెండు రకాల బిర్యానీతో పాటు ఒక పక్కన కాశ్మీరీ ప్రత్యేక వంటకమైన చికెన్‌ యాక్నీ వుంది. రకరకాల కూరగాయలు, నిమ్మకాయ కలిగిన ఊరగాయ, అప్పడాలు, సేమ్యా సాయసం కూడా వుండడం విశేషం. అక్కడి చీఫ్‌ చెఫ్‌ ఇమ్రాన్‌ను మేం రాగానే ఇచ్చిన కహవా గురించి అడిగాను. ‘కహవా’ అంటే కాశ్మీరీ భాషలో పదకొండు అని, కహవా పదకొండు దినుసులతో చేసే ప్రత్యేకమైన టీ అని, అది చెయ్యడానికి గ్రీన్‌ టీ ఆకుల్ని డ్రై ఫ్రూట్స్‌ ముఖ్యంగా బాదంని వాడతామని చెప్పాడు.
సోనే మార్గ్‌ – జీరో పాయింట్‌ : 28 జులై ఉదయం ఎనిమిదిన్నరకు సోనే మార్గ్‌ గోల్డెన్‌ పాథ్‌ కు బయలుదేరాం. శ్రీనగర్‌ కు సోనే మార్గ్‌ 80 కి.మీ. దూరంలో వుంది. మేం బయలుదేరిన అరగంటకు పెద్ద వర్షం. మరో అరగంటకు ఎండ. ఇలా ఎంతో తమాషాగా వున్న వాతావరణంలో సోనేమార్గ్‌ చేరాం. అమర్‌నాథ్‌కు వెళ్లే యాత్రికుల కోసం అరకిటోమీటర్‌కు ఒక సైనికుడు ట్రాఫిక్‌ నియంత్రణలో మగమై వున్నారు. సోనే మార్గ్‌ నుంచి లడక్‌ కు హైవే వుంది. మేం సోనేమార్గ్‌ దాకా ఆటలాడుకుంటున్న మబ్బుల్ని దూరంగా విస్తరించి వున్న కొండల్ని చూస్తూ వెళ్లాం.
సోనేమార్గ్‌లో మేం ప్రధానంగా చూడవలసిన స్థలం ‘జీరోపాయింట్‌’. జీరోపాయింట్‌ తర్వాత పౌర రవాణా లేదు. ఆ తర్వాత చైనా సరిహద్దు వుంది. మేం వచ్చిన కారులో జీరో పాయింట్‌కు వెళ్లడానికి అనుమతి లేకపోవడం వల్ల ఒక ప్రైవేటు జీపులో బయలుదేరాం. సాధారణంగా ఉష్ణోగ్రత జీరో డిగ్రీలుగా వుండడం వల్ల ఆ ప్రదేశాన్ని జీరో పాయింట్‌ అంటారని, అక్కడికి వెళ్లడానికి ‘జోజిల్లా పాస్‌’, ‘తజివాస్‌ గ్లేసియరు’ దాటి వెళ్లాలని డ్రైవర్‌ ముజఫర్‌ చెప్పాడు. ఇరుకైన దారిలో కిందికి చూస్తే కళ్లు తిరిగే లోయలు, ఒక్కోసారి హిమాలయాల పక్కనుంచి వెళ్లడం, ఒక్కోసారి దూరంగా మనతో పాటే ప్రయాణం చేస్తున్నట్టు కనిపించే వరుస పర్వతాలు, పచ్చని చెట్లు కప్పుకుని కొన్ని గోధుమ, బూడిద రంగులో కొన్ని కనబడడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ఆ కొండలు పైనున్న ఆకాశాన్ని తాకుతుండడం, మేఘాలు వాటిని తాకుతూ కదులుతుండడం మరెక్కడా చూడమేమో! దారి పక్కన కనబడే ‘బాల్టల్‌’ లోయలో అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లడానికి యాత్రీకులు నిరీక్షిస్తూ వుండే గుడారాలు అనేక సంఖ్యలో కనిపిస్తాయి. కొన్ని చోట్ల కొండలమీది నుంచి కిందికి దూకి పడే జలధారలు, కొండల మధ్య గడ్డకట్టిన నీటి ప్రవాహాలు చూస్తూ వెళ్తుంటే గంభీరంగా ధ్వనిస్తూ ఉదృతంగా ప్రవహించే సింధునది కనిపించింది. నీటి నురగలు స్వచ్ఛమైన పాలధారల్లా అగుపించాయి. జీరోపాయింగ్‌ రెండు కొండల మధ్య నుంచి కింది వరకు పర్చుకున్న గడ్డకట్టిన మంచు ప్రదేశం. పైకి వెళ్లడానికి ప్రత్యేకమైన బూట్లు దొరుకుతాయి. స్నోబైక్‌, స్లెడ్జ్‌ రైడింగ్‌ వంటివి వున్నాయి. గడ్డగట్టిన మంచు మీద కొంత దూరం నడిచి ఫొటోలు దిగాం. చిన్న గుడారాల దుకాణాలు ఉన్నాయి. ఒక టీ గుడారంలో కహవా టీ అమ్ముతున్న పర్వేజ్‌ తో మాట్లాడాను. సోనేమార్గ్‌లో తల్లిదండ్రులు ఉంటారని, తనూ, తమ్ముడూ రాత్రి వేళ కూడా అదే గుడారంలో వుండి టూరిస్టులకు టీ అమ్ముతూ జీవనం సాగిస్తున్నామని చెప్పాడు. తిరిగి వచ్చేప్పుడు డ్రైవర్‌ ముజఫర్‌ మమ్మల్ని ఓ చోట దింపి ఫొటోలు తీశాడు. సోనేమార్గ్‌ నుంచి 35 కి.మీ. దూరం వున్న జీరోపాయింట్‌ ప్రయాణం అతని సంభాషణలో సరదాగా గడిచింది. ఆ రాత్రి మా హోటల్‌ ‘స్ట్రింగ్‌ పామ్‌’లో కాశ్మీరి ప్రత్యేక మాంసాహారం రోగన్‌ గోష్‌ అందించారు.
పహెల్‌గాం – మినీ స్విట్జర్లాండ్‌ : జులై 29 ఉదయం హోటల్‌ రూం ఖాళీ చేసి పహల్‌గాం బయలుదేరాం. శ్రీనగర్‌ నుంచి 90 కి.మీ. దూరంలో వుండే పహల్‌గాం నుంచి 16 కి.మీ.దూరంలో వుండే ‘చందన్‌వారి’ నుండి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం అవుతుంది. రోడ్డుకు రెండు పక్కలా విస్తరించి వున్న కుంకుమపువ్వు క్షేత్రాలు దూరదూరాలకు విస్తరించి వున్న పచ్చని చెట్లూ, నేలని కప్పిన పచ్చిన తివాచీలు చూస్తూ ప్రయాణించాం. కొన్ని మైళ్ల తరువాత దారికి రెండుపక్కలా వరుసగా ఆపిల్‌ పండ్ల తోటలు వున్నాయి. హైదరాబాద్‌లో తోపుడు బండ్ల మీద కనిపించే ఆపిల్‌ పండ్లు చెట్లకొమ్మల మీద వేలాడుతూ కనువిందు చేశాయి. ఒక తోటలో చెట్ల నుంచి కిందికి అందుతున్న ఆపిళ్లని స్పర్శిస్తూ ఆపిల్‌ జ్యూస్‌ తాగాం. తోట యజమాని ముష్తాక్‌ ఆపిల్‌తో తయారయ్యే పచ్చళ్లు, జామ్‌లు రుచి చూపించాడు. కాశ్మీర్‌లో అనంత్‌నాగ్‌ జిల్లాలోని పహెల్గాంకు 5 కి.మీ. దూరంలో బైసారన్‌ లోయ వుంది. ఇక్కడ ప్రకృతి మంచు కప్పిన వృక్షాలు స్విట్జర్లాండ్‌ అందాలను తలపింపజేస్తాయని ఈ లోయకు ఆ పేరు. అయితే మా ప్రయాణం చలికాలంలో కాదు కనుక మంచు సోయగాలను చూడలేకపోయాం. బేతాబ్‌ వ్యాలీ, చందన్‌వారీ, శేష్‌నాగ్‌ ఇక్కడ చూడవలసిన స్థలాలు. పహల్‌గాంలో మా హోటల్‌ ‘స్పారో’కు చేరడానికి ముందు లిడ్డర్‌ నదిని చూస్తూ చాలా సేపు గడిపాం. పారదర్శకంగా కనిపిస్తున్న నది నీళ్ల పక్కన చెట్ల కింద విశ్రాంతి తీసుకున్నాం. పహల్‌ గాంలో ‘స్పారో’ హోటల్‌లో ఆ రాత్రి గడిపాం.
గుల్‌మార్గ్‌ : జులై 30 ఉదయం పహల్‌గాం ‘స్పారో’ హోటల్నుంచి గుల్‌మార్గ్‌ బయలుదేరాం. గుల్‌మార్డ్‌ పహల్‌గాం నుంచి 140 కి.మీ. దూరంలో వుంది. మూడు గంటల ప్రయాణం. సముద్ర మట్టానికి 8500 అడుగుల ఎత్తులో వున్న గుల్‌మార్గ్‌ ఘాట్‌రోడ్‌ ఇరువైపులా వేల సంఖ్యలో వివిధ రంగుల పూలను గాలికి ఉయ్యాలలూపుతున్న పూలతోటలు కనిపించాయి. గుల్‌మార్గ్‌ (పూలబాట) అనే పేరు ఇందువల్లేనన్నమాట అనుకున్నాం. గుల్‌మార్గ్‌ దారిలో కనపడే లోయను నంగాప్రభాత్‌ అంటారు. అక్కడ వున్న పర్వతం ఎత్తు 26,660 అడుగులు. అది హిమాలయ పర్వత శిఖరాల్లో ఎత్తైన వాటిలో ఒకటి. గుల్‌మార్గ్‌ ఎత్తు సముద్ర మట్టానికి 8500 అడుగులు. అక్కడి చల్లదనం కారణంగా కొందరికి ఆక్యూట్‌ మౌంటెన్‌ సిక్‌నెన్‌ వచ్చే అవకాశం వుందని విని కొంచెం భయపడ్డ మాట వాస్తవం.
మేం గుల్‌మార్గ్‌లోని ‘షాన్‌’ హోటల్‌కు చేరడానికి ముందే టూరిస్టుల రద్దీ ఎక్కువగా వుండే టూరిస్ట్‌ స్పాట్‌లు చూశాం. అక్కడ స్ట్రాబెర్రీ లోయ, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద గోల్ఫ్‌ మైదానం, గోండోలా (కేబుల్‌కార్‌), స్టేషన్‌, చిల్డ్రన్స్‌ పార్క్‌ వున్నాయి. మేం బుక్‌ చేసిన గోండోలా ప్రయాణానికి ఇంకా టైం వుండడంతో ‘షాన్‌’ హోటల్‌కు వెళ్లి చేరాం. చుట్టూ పచ్చిక మైదానాల మధ్య ఒంటరిగా వున్న పాతకాలపు హోటల్‌ అది. విపరీతంగా వీచే గాలి, మబ్బులు కమ్మిన ఆకాశం కారణంగా మేం వణికిపోయాం. హోటల్‌ లోపలికి వెళ్తుంటే ఫ్రిజ్జులోకి వెళ్తున్నట్టనిపించింది. హోటల్‌ మేనేజర్‌ సలహా ప్రకారం ఒక గైడ్‌ను వెంట పెట్టుకుని కేబుల్‌ కారు దగ్గరికి బయలుదేరాం. గైడు సరాసరి మమ్మల్ని కాబిన్‌లో క్యూలో నిబడే అవసరం లేకుండా తీసుకువెళ్లాడు. కేబుర్‌కారు రెండవ ఫేజు అయితే 14000 అడుగుల ఎత్తున్న అఫర్‌వత్‌ పర్వత శిఖరం దాకా వెళ్లి వస్తుంది. కానీ మేం 12000 అడుగుల ఎత్తు వరకే మొదటిఫేజ్‌కు వెళ్లాం. వెళ్లడం, తిరిగి రావడం 20 నిమిషాలు పట్టింది. ఒక్కొక్కరికి 750 రూపాయల టిక్కెట్టు. అయినా ఆ అనుభవం గొప్పది. చలికాలం అయితే నేలమీద పది అడుగుల ఎత్తు వరకు మంచు పేరుకొని వుంటుందట. మాకు చెట్ల పొదలు, వానాకాలంలో పశువుల్ని మేపుకోవడానికి వచ్చే ట్రైబల్స్‌ కట్టుకున్న మట్టి ఇళ్లు రంగురంగుల అలంకారాలతో అగ్గిపెట్టెల్లా కనబడ్డాయి. హోటల్‌కి తిరిగి వచ్చేటప్పటికి చీకటి పడ్డది. గదిలో చలి భరించలేకుండా వున్నామని చెప్పడంతో హోటల్‌ వాళ్లు రూంలో హీటర్‌ను, బ్లోవర్‌ను ఏర్పాటు చేశారు. డైనింగ్‌ హాల్‌కు రాలేమని చెప్పడంతో చెఫ్‌ నయీమ్‌ నలుగురు వెయిటర్లతో గదిలోకే వచ్చి డిన్నర్‌ ఏర్పాటు చేశాడు.
దాల్‌ సరస్సు : గుల్‌మార్గ్‌ నుంచి జులై 31వ తేదీ ఉదయం ప్రసిద్ధమైన దాల్‌ సరస్సుకు బయలుదేరాం. గుల్‌మార్గ్‌ నుంచి తిరిగి శ్రీనగర్‌కు 65 కి.మీ. ప్రయాణం. ఆ రోజు మొహరం కావడం వల్ల శ్రీనగర్‌ చౌరస్తాలన్నీ నల్లదుస్తులు వేసుకున్న జనంతో కిక్కిరిసిపోయి వున్నాయి. దారి పొడవునా షర్బత్‌లు, వాటర్‌బాటిళ్లు అందిస్తున్నారు. ఈ కారణంగా కొన్ని చోట్ల రోడ్లు మూతపడడంతో వెనక్కి తిరగాల్సి వచ్చింది. ఈ కారణంగా ఆలస్యం అయి మూడు గంటలకు దాల్‌ సరస్సు చేరాం. దాల్‌ సరస్సు ఒడ్డున వున్న ప్రహరీ గోడ పక్కన కారు దిగి మమ్మల్ని తీసుకుపోవడానికి వచ్చిన శికారా ఎదురుగా కనిపిస్తున్న హౌస్‌ బోట్‌లను అక్కడక్కడ ఎదురువస్తున్న శికారాలను, మంద్రంగా సంగీతం వినిపిస్తున్న సరస్సు నీటినీ చూస్తూ మాకు బుక్కయిన హౌస్‌బోట్‌ ‘అంబాసిడర్‌’ కి వెళ్లాం. నగిషీలు చెక్కిన పాత కాలపు కప్‌బోర్డ్‌లు, పాత కాలపు డైనింగ్‌ టేబుల్‌, కుర్చీలు, నడిచేదారి మొత్తం కార్పెట్‌ పరిచి వున్న ఆ ‘యాంటిక్‌ పడవ’ లో మా గదికి చేరుకున్నాం. నాలుగున్నర గంటలకు బోట్‌హౌస్‌ ముందు వరండాలో కుర్చీల్లో కుర్చుని ఎదురుగ్గా వున్న ‘మూన్‌మూన్‌’ హౌస్‌బోట్‌ని, వరుసగా ఆటోస్టాండ్‌లో నిలబడే ఆటోల్లా వరుసగా నిలబడి వున్న శికారాలను చూస్తూ కూర్చున్నాం. బోటు యజమాని ‘హసన్‌భారు’ తో నాకు పింక్‌ టీ కావాలన్నాను. పది నిముషాల్లో టీ వచ్చింది. ఉప్పు, బేకింగ్‌షోడా వేసి గ్రీన్‌టీ ఆకులతో తయారు చేసిన పింక్‌టీ రుచి చాలా బాగుంది. మాకు ఒక గంట ఫ్రీ శికారా రైడింగ్‌ వుంది. ఐదు గంటలకు శికారా వచ్చింది. మేం శికారాలో కూచుని దాల్‌ సరస్సు అందాన్ని ఆస్వాదించాం. మా ఎదురుగా, పక్కల నుంచి వివిధ రకాల వస్తువులు అమ్ముతున్న శికారాలు కదుల్తున్నాయి. పడవల్లో కూల్‌డ్రింక్స్‌, కుల్ఫీ, కహవా టీ, హుక్కా పెట్టుకు తిరుగుతున్నారు. నీటిలో ఇళ్లు, బట్టల కొట్లు చూస్తూంటే ఫ్రాన్స్‌లోని వెనిస్‌ నీటి వీధులుంటాయన్న సంగతి గుర్తుకువచ్చింది. స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లిన వాళ్లు పడవలు నడుపుకుంటూ ఇళ్లకు వెళ్తుండడం చూశాం. ఒకచోట దట్టంగా వున్న తామరాకుల మధ్య విరిసిన తామరపూలు చూశాం. దాల్‌ సరస్సుని ‘ఫ్లవర్స్‌ లేక్‌’ అని కూడా అంటారు. జీలం నదీ జలాలతో ఏర్పడ్డ దాల్‌ సరస్సు పొడవు 22 కి.మీ. సగటు లోతు 5 లేక 6 అడుగులు వున్నా మధ్య భాగంలో ఎక్కువ లోతు వుంటుందని కాశ్మీరులోని రెండవ అతి పెద్ద మంచినీటి సరస్సులో చేపలు విరివిగా వుంటాయి కానీ మొసళ్లు లేవని చెప్పాడు శికారా నడిపే వ్యక్తి. క్రీ.శ. 1800 ల నాటి నుంచి దాల్‌ సరస్సులో హౌస్‌బోట్లు వుండేవని, ఒకప్పుడు 2000 వరకు ఉండేవని, ఇప్పుడు 600 వరకు వుండొచ్చని తెలుసుకున్నాం. రాత్రి భోజనం తర్వాత బయట కూర్చున్నాం. ఎదురుగా వున్న హౌస్‌ బోట్‌లో నుంచి ఇద్దరు కుర్రవాళ్లు నీటిలోకి దూకి ఈదుతున్న చప్పుడు కాసేపు వినిపించింది. ఆ తర్వాత నీటిలో తమను తాము చూసుకుంటూ మురిసిపోతున్న విద్యుద్దీపాలు కనువిందు చేశాయి. నీటిమీద గాలి సంతకం చేస్తున్న చప్పుడు తప్ప మరే శబ్దమూ లేదు. అంత ప్రశాంతమైన, అందమైన చోటు మళ్లీ ఎప్పుడైనా చూస్తామా అనిపిస్తుంది.
శ్రీనగర్‌ మొగల్‌ ఉద్యానవనాలు : ఆగస్టు 1న శికారాలో దాల్‌ సరస్సు ఒడ్డున ఉన్న రోడ్డు దగ్గరికి చేరుకున్నాం. ఆ రోజు రమీజ్‌కు ఆరోగ్యం బాగాలేకపోవడంతో వరుసకు తమ్ముడైన సాహిల్‌ను మా దగ్గరికి పంపాడు. క్రీ.పూ. 200 సంవత్సరంలో మౌర్యులు నిర్మించిన అత్యంత ప్రాచీన శివాలయం 1000 అడుగుల ఎత్తైన కొండమీద వుంది. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు ఆ దేవాలయాన్ని సందర్శించారని, అప్పట్నుంచి ఆ కొండను శంకరాచార్య హిల్‌ అని, ఆలయాన్ని శంకరాచార్య దేవాలయమని అంటారని తెల్సింది. అయితే ఆ రోజే మా తిరుగు ప్రయాణం వుండడం వల్ల అక్కడికి వెళ్లలేకపోయాం. హజరత్‌ బల్‌లో ఉద్యోగంచేస్తున్న సాహిల్‌ మాటతీరు, ప్రవర్తన మమ్మల్ని ఎంతో ఆకట్టుకుంది. మమ్మల్ని మొట్టమొదట చష్మషాహీ ఉద్యానవనానికి తీసుకువెళ్లాడు. ఈ ఉద్యానవనం జహంగీరు చక్రవర్తి తన కొడుకు దారా కోసం నిర్మించాడు. క్రీ.పూ. 1632లో నిర్మించిన ఈ ఉద్యానవనంలో స్వచ్ఛమైన నీటి ఫౌంటెన్‌ వుంది. బయట ఎండ, లోపల చల్లని గాలి. చెట్లు, పచ్చిక తివాచీ చూస్తూ వుండిపోయాం. సాహిల్‌ ఫోన్‌ చేస్తే తప్ప బయటికి రావాలనిపించలేదు. కాశ్మీర్‌ లోయలో మరొక పద్దె మొగల్‌ ఉద్యానవనం నిషత్‌బాగ్‌. 1633లో జహంగీర్‌ పత్ని నూర్జహాన్‌ సోదరుడు ఆసిఫ్‌ఖాన్‌ దీనిని నిర్మించాడు. ఎరుపు, పసుపు రంగుల్లో మెరిసే ఆకులు వున్న ఎత్తయిన చినార్‌ వృక్షం జమ్మూకాశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతాల జాతీయ వృక్షం. అత్యంత విశాలమైన మరో ఉద్యానవనం షాలిమార్‌ గార్డెన్స్‌. పాలరాతితో నిర్మించిన హౌస్‌లలోకి నీటి దారలు విరజిమ్మే 410 ఫౌంటెన్లు వున్నాయట. మేం వెళ్లిన సమయంలో పునర్నిర్మాణ పనులు జరుగుతుండడంతో కొంతమేరకు మాత్రమే చూడగలిగాం. శ్రీనగర్‌లో తప్పక చూసి తీరవలసిన మొగల్‌ గార్డెన్స్‌ను సందర్శించి విమానాశ్రయానికి బయలుదేరాం. శ్రీనగర్‌ నుండి ఢిల్లీ, ఢిల్లీ నుండి హైదరాబాద్‌ చేరుకునేటప్పటికి రాత్రి 12 దాటింది.
మా యాత్ర ఇంత సాఫీగా జరుగుతుందని అక్కడి మనుషులు ఇంత ఆత్మీయంగా వుంటారని మేం అనుకోలేదు. పహల్‌గాం స్పారో హోటల్లో నా శ్రీమతి మరచిపోయిన కళ్లజోడును హోటల్‌వారు శ్రీనగర్‌లో వున్న మాకు అందజేయటం ఆశ్చర్యం కలిగించే విషయం. కాశ్మీర్‌లో వివిధ ప్రాంతాల్లో తిరిగినప్పుడు కొత్తచోటికి వచ్చినట్లు అనిపించలేదు. మగవాళ్లంతా మామూలు దుస్తుల్లో వున్నారు. ముస్లిం సంస్కృతిని ప్రతిబింబించే షేర్వానీలు కనిపించలేదు. గడ్డాలు పెంచుకున్న వాళ్లకంటే నీట్‌గా షేవ్‌ చేసుకున్నవాళ్లే ఎక్కువగా కనిపించారు. పాన్‌షాపులు, గుట్కా ఉపయోగించే డ్రైవర్లూ కనిపించలేదు. శ్రీనగర్‌లో ఒకటి రెండు వైన్‌ఫాపులు వున్నాయన్నారు కానీ కాశ్మీర్లో మరెక్కడా లేవు. రమీజ్‌ అఫ్జల్‌, ఇమ్రాన్‌, ముజఫర్‌, ముష్తాక్‌, జాన్‌భారు, నయీమ్‌ హసన్‌ భారు, సాహిల్‌… ఇలా నేను కలిసిన వ్యక్తులంతా ఎంతో ఫ్రెండ్లీగా వున్నారు. వీరంతా నా మనసులో చెరిగిపోని ముద్ర వేశారు.
ఒకప్పుడు రాత్రుళ్లు తీవ్రవాదులు గన్‌లతో గ్రనేడ్‌లతో తిరిగేవారని, ప్రతిరోజూ ఏదో ఒక చోట గొడవ జరగడం, రాళ్లు విసరడం వంటివి జరుగుతుండేవని, ఇప్పుడు ప్రశాంతంగా వుందని, మళ్లీ మునుపటిలా టూరిజం అభివృద్ధి చెందుతున్నదని, కాశ్మీర్‌ యువకులు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చెయ్యాలని ఆశిస్తున్నారని, కాశ్మీర్‌కు వేలాది సంఖ్యలో సందర్శకులు వస్తారని భావిస్తున్నానని మాకు ‘ఖుదాహఫీజ్‌’ చెప్పాడు సాహిల్‌.
కాశ్మీర్‌ యాత్రలో అద్భుతమైన అనుభూతులను అమూల్యమైన జ్ఞాపకాలను, ఎన్నటికీ మరచిపోలేని సుందరదృశ్యాలను మనసుల్లో భద్రపరచుకుని వచ్చాం.

– చింతపట్ల సుదర్శన్‌
9299809212