కేంద్ర బడ్జెట్లో కామారెడ్డి జిల్లాకు అధిక నిధులు కేటాయించాలి: సీపీఐ(ఎం) జిల్లా కమిటీ

నవతెలంగాణ –  కామారెడ్డి 
ఫిబ్రవరి 1 నుండి జరుగుతున్న కేంద్ర బడ్జెట్ సమావేశాలలో వెనుకబడిన కామారెడ్డి జిల్లాను నిర్లక్ష్యం చేయకూడదని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కామారెడ్డి జిల్లాకు ఎలాంటి సహకారం చేయలేదని అయినా జిల్లా ప్రజలు పెద్ద మనసుతో బిజెపికి ఒక ఎమ్మెల్యే సీటు గెలిపించి ఇచ్చారని, ఇప్పుడైనా కామారెడ్డి జిల్లాను జిల్లాలోని ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం జిల్లాకు అవసరమైన వసతుల సౌకర్యం కొరకు బడ్జెట్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా కామారెడ్డి టు హైదరాబాద్ వెళ్లే రైలు ప్రయాణికులకు సింగిల్ ఇవే ఉండడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయని మన్మాడ్ టు సికింద్రాబాద్ వరకు డబుల్ లైన్ కొరకు నిధులు కేటాయించాలని, వెనుకబడ్డ బాన్సువాడ, జుక్కల్ ప్రాంతంలో సరైన రవాణా సౌకర్యం లేక జిల్లా కేంద్రానికి ఇబ్బంది అవుతున్నందున కామారెడ్డి బాన్సువాడ జుక్కల్ మీదుగా వరకు కొత్త రైల్వే లైన్ మంజూరు చేయాలని దానికి నిధులు కేటాయించాలని, కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో, పాత రాజంపేట రైల్వే గేట్ ఈ రెండు రైల్వే గేట్ల వద్ద ప్రజలు గంటల తరబడి నిలబడాల్సి వస్తుందని రెండు రైల్వే గేట్ ల వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిలు మంజూరు చేసి నిధులు కేటాయించాలన్నారు. టాక్స్ పేర్ల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించి మధ్యతరగతి ప్రజల మీద ఒత్తిడిని తగ్గించాలని, ఇన్కమ్ టాక్స్ లిమిట్స్ ని 15 లక్షలకు పెంచాలని హోమ్ లోన్స్ పై ఎగ్జామ్స్ అయిదు లక్షల వరకు ఇవ్వాలని వీటితోపాటు కేంద్ర బిజెపి ప్రభుత్వం నిరుద్యోగులకు యువతకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగ హామీని నిలబెట్టుకునే దాంట్లో భాగంగా ఉప్పల్వాయి వద్దగల గోదాముల దగ్గర వ్యాగన్ వర్క్ షాప్ ను మంజూరు చేసి దానికి నిధులు కేటాయించాలన్నారు. దీని ద్వారా జిల్లాలోని యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అని తెలియజేశారు. ఈ మొత్తం బాధ్యత బిజెపి జిల్లా పార్టీ బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ పత్రిక సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్, మోతి రామ్ నాయక్, కొత్త నరసింహులు, ముదాం అరున్ కుమార్, సురేష్ గొండా తదితరులు పాల్గొన్నారు.