సైబర్ నేరాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి: కమ్మర్ పల్లి ఎస్ఐ రాజశేఖర్

నవతెలంగాణ కమ్మర్ పల్లి: మండల కేంద్రంలోని స్థానిక కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ లో బుధవారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్నినిర్వహించారు. ఎస్ఐ రాజశేఖర్ కార్యక్రమానికి హాజరైన ప్రజలకు సైబర్ రక్షణ, జాతీయ భద్రత అనే అంశంపై అవగాహన కల్పించారు. ప్రతి నెల మొదటి బుధవారం రోజున ఈ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానిత వ్యక్తులు ఫోన్ చేస్తే బ్యాంకు వివరాలు గానీ, ఓటిపి నంబర్లు గాని చెప్పొద్దని సూచించారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించకపోతే ఆర్థికంగా నష్టపోయేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. అనుమానిత నంబర్ల నుండి ఫోన్లు వస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అప్రమత్తంగా ఉంటే సైబర్ మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకోకుండా తప్పించుకోవచ్చు అన్నారు.