కస్తూర్బాలో కండ్ల కలక

 Kandla Kalaka in Kasturba– వైద్య శిబిరం ఏర్పాటు
– పాఠశాలల్లో వేగంగా ప్రబలుతున్న వ్యాధి
నవతెలంగాణ -సంస్థాన్‌ నారాయణపురం
నల్లగొండ జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలో కండ్ల కలక కలకలం రేేపుతోంది. నారాయణపురం, సర్వేలు, శేరిగూడెం, గుజ్జ జనగాం తదితర గ్రామాల్లో ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు కండ్ల కలకతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయం, ఆదర్శ పాఠశాల, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలతో పాటు సర్వేల గ్రామంలోని బాలుర వసతి గృహం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కండ్ల కలక ప్రబలింది. మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలో మొత్తం 200 మంది విద్యార్థినులు ఉండగా.. 15 మందికి కండ్ల కలక వచ్చిందని ప్రిన్సిపాల్‌ శివరంజని తెలిపారు. ఇందులో ఐదుగురికి తీవ్ర ఇబ్బంది ఉన్నందున ఇండ్లకు పంపించినట్టు చెప్పారు. బుధవారం పీహెచ్‌సీ డాక్టర్‌ జ్యోత్స్న ఆధ్వర్యంలో సిబ్బంది వైద్య సేవలు అందించారు. కండ్ల కలకలు వచ్చినవారు మిగతా విద్యార్థులకు దూరంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడూ చేతులను సబ్బుతో కడుక్కోవాలని, కండ్ల అద్దాలు పెట్టుకుంటే మంచిదని సూచించారు. అదేవిధంగా మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వైద్య క్యాంపులు నిర్వహించి మందులు అందజేస్తామని డాక్టర్‌ జ్యోత్స్న తెలిపారు.