నోటి దురుసు సెలబ్రిటీగా పేరు మోసిన నటి కంగనా రనౌత్ ఇందిరాగాంధీ పాత్రలో నటించి, దర్శకురాలిగా ఉన్న ‘ఎమర్జన్సీ’ సినిమా బీజేపీకి తలనొప్పిగా మారింది. చరిత్రను వక్రీకరించటమే గాక తమను దేశద్రోహులు, ఉగ్రవాదులుగా చిత్రీకరించారని, అది తమపై విద్వేషాన్ని రెచ్చగొట్టే అవకాశం ఉన్నందున ఆ చిత్రంపై నిషేధం విధిం చాలంటూ దేశవ్యాపితంగా సిక్కులు డిమాండ్ చేస్తున్నారు. ఖలిస్తాన్ మద్దతుదార్లు కంగనాను చంపివేస్తామంటూ బెదిరింపులకు దిగారని వార్తలు. దీంతో ఈనెల ఆరున విడుదల తేదీని ప్రకటించిన కంగనా ఇప్పుడు దానికి సెన్సార్ బోర్డు ఆమోదం తెలిపినా కొందరి ఒత్తిడి కారణంగా ధృవీకరణ పత్రం నిలిపివేశారని చెబుతున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం, ఆమె ప్రధానిగా ఉన్నపుడు 21 నెలల అత్యవసర పరిస్థితి విధింపు తదితర అంశాల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 14వ తేదీన ట్రైలర్‌ను విడుదల చేయగా 50 లక్షల మంది చూశారని, కేవలం 461 మంది మాత్రమే ఇష్టపడి నట్లు నమోదైనట్లు ‘ఇండియాటుడే’ పేర్కొన్నది. ప్రతి ఒక్క ఓటునూ లెక్కించుకుంటున్న బీజేపీ ఇప్పటికే దేశంలో ఉన్న మూడు కోట్ల మంది సిక్కులు వ్యతి రేకంగా ఉన్నారు. ఈ సినిమాతో వారు మరింత దూరమౌతారని, పక్కా వ్యతిరేకులుగా మారతారని ఆ పార్టీ భయపడు తోంది. అక్టోబరులో జరిగే హర్యా నా, కాశ్మీరు ఎన్నికలపై ప్రతికూల ప్రభావం పడు తుందని భావిస్తున్నారు. గతంలో బీజేపీ మిత్ర పక్షంగా ఉన్న అకాలీదళ్ కూడా అదే డిమాండ్ చేసింది.
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుమోసిన సంగతి తెలిసిందే. రైతుల గురించి నోరుపారవేసుకున్న ఉదంతం సమసిపోక మందే కులగణన గురించి చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని బీజేపీ చెప్పుకుంది. ఆ పార్టీలో ఇలాంటి వారికి కొదవలేదు. అవి పార్టీ కొంప ముంచుతున్నాయి. ఆగస్టు చివరి వారంలో దైనిక్ భాస్కర్ అనే పత్రికతో మాట్లాడిన కంగన 2020-21లో జరిగిన రైతు ఉద్యమం గురించి నోరు పారవేసుకున్నారు. ఆ సందర్భంగా మృతదేహాలు వేలాడాయని, మానభంగాలు జరిగాయని ఆరోపించారు. రైతు ఉద్యమం జరిగిన హర్యానాలో లోక్‌సభ ఎన్నికల్లో పదికి గాను ఐదు సీట్లు పోగొట్టుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దూరం కానుందనే భయంతో ఉంది. సరిగ్గా ఈ తరుణంలో ఆమె చేసిన వ్యాఖ్యలు హర్యానా రైతాంగాన్ని మరింతగా రెచ్చగొట్టేవే. పార్టీకి నష్టం కలిగిస్తాయని హర్యానా పార్టీ నేతలు గగ్గోలు పెట్టారు. దాంతో కేంద్ర బీజేపీ వెంటనే కంగనామాటలతో పార్టీకి సంబంధం లేదని చెప్పుకుందే, తప్ప కనీసంగా ఆమెను మందలించలేదు. బంగ్లాదేశ్‌లో మాదిరి పరిస్థితిని భారత్‌లో సృష్టించే పథకం ఉందని, రైతుల నిరసనల వెనుక చైనా, అమెరికా హస్తం ఉందని కూడా అంతకు ముందు ఆరోపించారు. పార్టీ విధానాల గురించి ప్రకటనలు చేసేందుకు కంగనా రనౌత్‌కు అధికారం లేదా అనుమతి ఇవ్వలేదని, భవిష్యత్‌లో అలాంటి ప్రకటనలు చేయకూడదని కోరినట్లు బీజేపీ ప్రకటించింది. తాను నటించిన ఎమర్జన్సీ సినిమా గురించి ప్రచారం చేసుకొనేందుకు దైనిక భాస్కర్ పత్రికతో మాట్లాడినపుడు ఈ వ్యాఖ్యలు చేశారు. అందరూ వాటిని ఎక్కడ చదవరనో లేదా మరింత ప్రచారం కోసమో సదరు పత్రిక వార్తను తన ‘ఎక్స్’ ఖాతాలో ఆగస్టు 25న పోస్టు కూడా చేశారు. లోక్‌సభ ఎన్నికల పుడు హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను బీజేపీ తరఫున గ్రామాల్లో ప్రచారానికి అక్కడి రైతులు రానివ్వని ఉదంతాలను చూసిన బీజేపీ నేతలు కంగన మాటలతో తమ పని అయిపోయినట్లే భావించారు. నష్ట నివారణ చర్య తీసుకున్నప్పటికీ కంగన మాటలు రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారటం అనివార్యం. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఒక తీర్మానం కూడా చేసింది. రెండవసారి శంభు సరిహద్దులో ఆందోళన ప్రారంభించి రెండు వందల రోజుల సందర్భంగా జరిగే నిరసనకు రెజ్లర్ వినేష్ ఫోగట్ రానున్నట్లు వార్తలు.
రైతులపై నోరు పారవేసుకున్న కంగనా మాటలు ఇంకా చెవుల్లో గింగురు మంటుండగా తగ్గేదేలే అంటూ కులగణన జరగదు అని మరొక ప్రకటన వదిలారు. వెంటనే అది మా వైఖరి కాదంటూ దానికి కూడా జనానికి బీజేపీ సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది. ‘న్యూస్ 24’ అనే టీవీతో మాట్లాడుతూ కులగణన తప్పకుండా చేయాలా అన్న ప్రశ్నకు అవసరమే లేదు అంటూ కంగన చెప్పేశారు. కులగణన మీద యోగి ఆదిత్యనాథ్ వైఖరే తనదని, అందరం కలసి ఉంటేనే మంచిదని, విడిపోతే నాశనం అవుతామన్నారు. ”కులగణన జరపకూడదు. నటుల కులమేమిటో మనకు తెలియదు. ఎవరికీ ఏమీ తెలియదు. నా చుట్టూ ఉన్నవారు కులం గురించి పట్టించుకోరు. దాన్ని ఎందుకు ఇప్పుడు తేల్చాలి. గతంలో మనం చేయలేదు, ఇప్పుడూ అవసరం లేదు” అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కావాలంటే రాష్ట్రాలు కుల గణన చేసుకోవచ్చు తప్ప కేంద్ర ప్రభుత్వం చేపట్టదని, ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని బీజేపీ నేతలు పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఎన్నికలకు ముందు మరోసారి ఎన్డీయే కూటమిలో చేరిన జెడియు నితీష్‌కుమార్ బీహార్‌లో కులగణన చేశారు. అనేక రాష్ట్రాలలో అలాంటి డిమాండ్ ముందుకు వచ్చింది. కేంద్రమే జనాభా లెక్కలతో పాటు జరపాలని ప్రతిపక్ష పార్టీలు కోరాయి. ఎన్నికలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు, మిత్రపక్షాల మీద ఆధార పడాల్సి వచ్చింది. దాంతో వాటి ఒత్తిడికి లొంగిపోయింది. కంగన ప్రకటన మరోసారి బీజేపీని ఇరుకున పెట్టింది. ”అవసరం తలెత్తితే తాము కులగణన చేస్తామని హోంమంత్రి చెప్పారని, కనుక కంగన చెప్పిన మాటలు పార్టీ వైఖరిని ప్రతిబింబించవు” అని బీజేపీ జాతీయ ప్రతినిధి గురు ప్రకాష్ పాశ్వాన్ ప్రకటించాల్సి వచ్చింది. అయితే ఇంతవరకు కుల గణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
తోటకూర నాడే మందలించి ఉంటే అనే సామెత తెలిసిందే. గతంలో కంగనా రనౌత్ చేసిన అనేక వివాదాస్పద ప్రకటనలు, ప్రత్యర్థులపై ఎదురు దాడికి దిగినపుడు బీజేపీ నోరు మెదపలేదు. దాడి జరపటాన్ని ఆస్వాదించింది. పరిస్థితి మారిన తరువాత ఇప్పుడు ప్రతి మాట వల్లా పార్టీకి ఎదురు దెబ్బ తగులుతోంది. అయినా సరే. ఆమె ఎక్కడా తగ్గటం లేదు. తన సినిమా గురించి ప్రచారం చేసుకుంటూ చౌకబారు, తెలివి తక్కువ ప్రకటనలు, వివాదాస్పద వ్యాఖ్యలతో ఉచిత ప్రచారం పొందాలని చూస్తున్నట్లు కనిపిస్తున్నది. నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన 2014లోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని 2021లో చెప్పారు. స్వీయ అనుభవంతో తానీ మాటలు చెబుతున్నట్లు, తన అతి మంచితనం కారణంగా వ్యవస్థ తనను దేశం విడిచి అమెరికా వెళ్లేట్లు చేసిందని, మోడీ అధికారానికి వచ్చాక తాను తిరిగి వచ్చానని అందుకే అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లు భావిస్తున్నట్లు చెప్పుకున్నారు. అదే విధంగా కత్రీనా కైఫ్ వంటి విదేశీ హీరోయిన్లు ఎంతో రాణించారని కానీ 2014 తరువాత స్వదేశీ నటీనటులు, కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, విదేశీయుల నృత్యాలు ఆపాలని జనం చెప్పారని, ఇటాలియన్ ప్రభుత్వాన్ని తొలగించి ఒక చారువాలాను ప్రధానిని చేశారని కూడా సెలవిచ్చారు. సుభాస్ చంద్రబోస్‌ను భారత తొలి ప్రధాని అని చెప్పటమే కాదు, ఆయన అజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పరచిన కారణంగా బోసే ప్రథమ ప్రధాని అని సమర్ధించుకున్నారు. తనను విమర్శించిన వారికి రెండు రకాల మెదడు కణాలు ఉంటాయని వారికి ఇది అర్ధం కాదని కూడా ఎదురు దాడి చేశారు. రామనాధ్ కోవింద్‌ను ‘కోవిడ్’గా పలకటమేగాక, ప్రథమ దళిత రాష్ట్రపతిగా వర్ణించి తరువాత నాలుక కరుచుకున్నారు. అలాంటి కంగనా సినిమా ఎమ ర్జన్సీ గురించి సెన్సార్ బోర్డు ఏం చేస్తుందో, బీజేపీ ఏం చెబుతుందో వాటి మీద స్పందనలు ఎలా ఉంటాయో వేచిచూడాల్సిందే!
– సత్య