అతడు తెలుగు సాహిత్యకారులను విసుగు పుట్టించే దాక ప్రేమించిన కన్నడ రచయిత. తెలుగు సాహిత్యానికి కన్నడ కస్తూరి అద్ది ఆ పరిమళాన్ని శాశ్వతం చేసి తాను మాత్రం అశాశ్వతమైపోయాడు. తెలుగు సాహిత్యాన్ని కన్నడనాట సుసంపన్నం చేసిన ఆర్వీఎస్. సుందరం, స.రఘునాథ్, చిదానందశాలై, ఆర్. రత్నయ్య, రోహిణీ సత్య, వీరభద్ర గౌడ్ వంటి వారి సరసన చిన్న వయసులోనే నిలిచాడు. 2013లో కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కారం అందుకున్న ఈ యువ రచయిత లక్కుర్ ఆనంద్ మే 13న హైదరాబాద్ వచ్చినప్పుడు నవతెలంగాణ జోష్‌తో మాటామంతి… ఇది జరిగి వారం గడవకుండానే మే 20వ తేదిన మరణించారు.
మీ కన్నడ రచనలు గురించి చెప్పండి?
నా పదిహేనవయేడునుంచే రచనలు చేస్తున్నాను. ఊరింద ఊరిగె, ఇప్పత్తర కళ్ళిన మేలే, ఇతీ నిన్న విధేయను, బటవాడ ఆగదు రసీదు, ఉరివ ఏకాంత దీప, కారంచేడు, యావనాళెయు నమ్మదల్ల, కాయబేకిత్తు నీను కారణ కేళలు… ఇలా ఎన్నో కవితా సంపుటాలు వెలువరించాను. అలాగే మాతంగ మాదిగ సంస్కృతి-ఒందు అధ్యయన, దక్షిణ భారతద అనుభావి సాహిత్య-ఒందు అధ్యయన, తెలుగిన దిగంబర సాహిత్య-ఒందు సంసోధన లాంటి పరిశోధనా గ్రంథాలెన్నో వెలువరించాను.
తెలుగులో ఏయే ప్రముఖ కవులు, రచయితల రచనలను కన్నడ భాషలోకి అనువదించారు?
చాలామంది కవితలు, కథలు, నవలలు అనువదించాను. కె.శివారెడ్డి ఆస్పత్రి గీతం, పక్కకు వొత్తిగిల్లితె, కొంచెం స్వేచ్ఛ కావాలి, మోహనా మోహనా మొదలైన కవితా సంపుటాలు అనువదించాను. శిఖామణి (దళిత సాహిత్యం), గోపి (కాలం నిదురపో నివ్వను) నగముని కథలు, గోరేటి వెంకన్న, మద్దూరి నగేష్ బాబు, పైడి తెరేష్ బాబు, ఆశారాజు, ముకుంద రామారావు, జూపాక సుభద్ర, కృపాకర్ మాదిగ, వై.వి. సత్యనారాయణ, మధురాంతకం నరేంద్ర కథలు, గోపీని కరుణాకర్ కథలు తెలుగు నుండి కన్నడంలోకి అనువదించాను.
మరి తెలుగు నుంచి కన్నడంలోకి చేసిన అనువాదాల గురించి..
చిలుకూరి దేవపుత్ర పంచమం నవల, బండి నారాయణ స్వామి గద్దలాడ్తాండాయి మొదలైన నవలలు కన్నడంలోకి అనువదించాను. ఇప్పటి వరకు యాభైకిపైగా తెలుగు నుండి కన్నడంలోకి అనువదించాను.
తెలుగు నుండి కన్నడంలోకి అనువదించే క్రమంలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
జ: అనువాదమంటేనే ఇబ్బందులుంటాయి. మూల రచయితల భావాలు, భాష తెలుసుకొని అనువదించాలి. నా అనుభవాలే తెలుగులో అక్షరరూపంలో ఉన్నాయని పిస్తాయి. తెలుగు భాషకు కన్నడ భాషకు అవినాభావ సంబంధాలున్నాయి. ఎందుకంటే ఈ రెండు భాషలు మూలద్రావిడం నుంచి ఉద్భవించాయి. రెండు భాషల్లో శబ్దాలు వేరే అయినా అర్థాలు ఒకటే… కన్నడంలో ‘క’ తెలుగులో ‘చ’ గా మారుతుంది. ఉదాహరణకు కన్నడంలో ‘కివి’ తెలుగులో ‘చెవి’గా మారుతుంది. అలాగే కెరె-చెరువు, కై-చేయి… తెలుగులో ప్రతి అక్షరాన్ని, పదాన్ని పాడవచ్చు. కన్నడంలో అర్ధం చేసుకోవచ్చు. అందుకే కృష్ణదేవరాయలు తెలుగు తేట, కన్నడ కస్తూరి అన్నారు.
తెలుగు పరిశోధనలు ఏవైనా కన్నడంలోకి అనువదించారా?
జ: జి.వి.రత్నాకర్ పరిశోధనలు, జి. కళ్యాణరావు పరిశోధనలను కన్నడంలోకి అనువదించాను. కత్తి పద్మారావు 15 గ్రంథాలను కన్నడ భాషలోకి అనువదించాను. అలాగే రావిపూడి వెంకటాద్రి మనుధర్మశాస్త్రం, ఆదిశంకరాచార్య, సుజాతా కరీంనగర్ జానపద సాహిత్యం, బాలసుధాకర్ మౌళి వచన కవిత్వం, ఎండ్లూరి మానస మిళింది కథలు, ఎండ్లూరి సుధాకర్ నజరానా కవిత్వం, మువ్వా శ్రీనివాసరావు (6th ఎలిమెంట్, సమాంతర ఛాయలు, కరోనా కావ్యం) కలేకూరి ప్రసాద్ దళిత సాహిత్యం, దుర్గం సుబ్బారావు అంబేద్కర్ పరిశోధనా గ్రంథాలు కన్నడ భాషలోకి అనువదించాను.
తెలుగు సాహిత్యం అనువాదాలకు కర్నాటకలో ఎలాంటి ఆదరణ ఉంది?
చాలా మంచి ఆదరణ ఉంది. ఇక్కడ పాఠకులు ఉన్నారు, రసాస్వాదకులు ఉన్నారు, జిజ్ఞాసువులు ఉన్నారు. అంతేకాదు… అనువాద గ్రంథాలను ప్రచురించడానికి ‘కువెంపు భాషా భారతి’లాంటి ప్రభుత్వ సంస్థలున్నాయి. సెంట్రల్ సాహిత్య అకాడమి, ప్రైవేట్ పబ్లికేషన్స్ కర్ణాటకలో ఎక్కువగా ఉన్నాయి. కన్నడ పాఠకులు తెలుగు సాహిత్యాన్ని బాగా ఆదరిస్తారు. వాటికి తగిన పురస్కారాలు కూడా ఇస్తున్నారు.
తెలుగులో వచ్చినంత వెల్లువలా కన్నడంలో వచన కవిత్వం వస్తోందా?
ఎందుకు రావడంలేదు… చాలా బాగా వస్తోంది. ఎక్కువగా రెండు భాషలు మాట్లాడే కోలార్, మైసూర్, చిత్రదుర్గ, బళ్ళారి, రాయచూర్ వంటి జిల్లాలలో అద్భుతమైన కవిత్వం వస్తోంది.
ఇంగ్లీష్ నుండి కన్నడ అనువాదాలు ?
Fremoleve, Gugi, Markwize, Deviprasad, Arundatirai మొదలైన వారి ఆంగ్ల రచనలను కన్నడ భాషలోకి అనువదించాను.
మీరు అందుకున్న పురస్కారాలు?
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, అరళుకావ్య ప్రశస్తి, కడంగోడ్లు కావ్యప్రశస్తి, డూ, నిం బెళగలి కావ్య పురస్కారం, తెర్లా అవార్డు, దళిత సాహిత్య అకాడమీ అవార్డు, విభా పురస్కారం, తిప్పేరుద్రస్వామి పురస్కారం మొదలైనవి.
మీ నేపథ్యం…
మా ఊరు కర్నాటకలోని కోలార్ జిల్లా మాలూర్ తాలూక లక్కూర్. మా తల్లిదండ్రులు చిన్నప్ప, మునియమ్మలు. నేను వారి మొదటి సంతానం. లక్కూర్ లోనే ప్రాథమిక, మాధ్యమిక విద్యనభ్యసించాను. ఉన్నతవిద్య బెంగళూర్‌లో పూర్తిచేశాను.
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417