ఖమ్మం గుమ్మం మీద బాలసాహిత్య వికాసకారుడు కన్నెగంటి వెంకటయ్య

ఖమ్మం గుమ్మం మీద బాలసాహిత్య వికాసకారుడు
కన్నెగంటి వెంకటయ్యఖమ్మం గుమ్మం మీద ఉద్యమ జండాలకు సమానంగా ఇవ్వాళ్ళ తెలుగు సాహిత్యకారులు బాల సాహిత్య జండాను ఎగురేసి మేము సైతం అంటూ ముందు వరుసలో నిలుస్తున్నారు. బాలల రచనలతో పాటు బాల సాహితీవేత్తల స్వీయరచనలు కూడా అక్కడి నుండి విరివిగా వస్తున్నాయి. అలా కవిత్వం, వ్యాసం, గేయం, గజల్‌ రచనలతో పాటు బాల సాహిత్య సృజన, బాలల వికాస కార్యక్రమాలు చేస్తున్న ఖమ్మం సాహిత్యకారుల్లో మొదటి వరుసలో లెక్కించదగిన వాళ్ళలో కవి కన్నెగంటి వెంకటయ్య కూడా ఒకరు.
కన్నెగంటి కలం పేరుతో రచనలు చేస్తున్న ఈయన ఖమ్మం జిల్లా లాలాపురంలో 6 ఏప్రిల్‌, 1969న పుట్టాడు. అమ్మానాన్నలు శ్రీమతి ముత్యాలు, శ్రీ గోపయ్య. తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కన్నెగంటి కవి, రచయిత, గాయకుడు. బాల సాహిత్య వికాసకారుడుగా ఖమ్మం నుండి తొలి బాలల సంకలనాన్ని తెచ్చాడు. వృత్తిరీత్యా ఎస్‌.సి.ఆర్‌.టి తెలంగాణ స్టేట్‌ రిసోర్స్‌ గ్రూప్‌ సభ్యులుగా ఉన్నారు. ఖమ్మం జిల్లా బాల సాహిత్య వేదిక కో కన్వీనర్‌గా ఉన్నారు. కవిత్వం, వ్యాసాలు, కథలు రాసిన కన్నెగంటి ‘నాన్న కిచ్చిన మాట’గా 2009లో తొలి రచనగా కథా సంపుటి ప్రచురించాడు. కవిగా కన్నెగంటి తొలి గేయ సంకలనం ‘జీవన రాగంలో’ పేరుతో 2011లో అచ్చయ్యింది. తెలుగు గజళ్ళు రాస్తున్న ఆధునికుల్లో కన్నెగంటి ఒకరు. 2018లో ఎంపిక చేసిన గజళ్ళతో ‘మమతల హృదయాలు’ గజల్‌ గుచ్చం తెచ్చాడు. ఇప్పుడు విరివిగా రుబాయీలు రాయడమే కాక వాటిని త్వరలో అమ్మా నాన్నల పేరు స్ఫురించేట్టు ‘గోప్యముత్యాలు’గా తేనున్నాడు.
తొంభయ్యవ దశకంలో వి.ఆర్‌.శర్మ, గరిపెల్లి అశోక్‌ వంటివారు ఉద్యమంగా తెలంగాణలో బాలల రచనా శిల్పశాలలు పెట్టి పుస్తకాల ప్రచురణ ప్రారంభించారు. ఇవ్వాళ్ల తెలంగాణలో నాలుగువందలకు పైగా పిల్లల పుస్తకాలు వచ్చాయి. ఈ నెలలోనే మరో పదకొండు రానున్నాయి. ఖమ్మంలో వికాస కార్యక్రమాన్ని ప్రారంభించి పుస్తకం తెచ్చింది వెంకటయ్య. అశ్వారావుపేట బడి పిల్లలు 2003లో చేసిన ‘చిగురాకుల సవ్వడి’ ఇప్పుడు ఖమ్మంలో ఘంటారవంగా నినదిస్తోంది. తరువాత తాను పనిచేసిన మరో పాఠశాల నుండి ‘ముదిగొండ ముత్యాలు’ పేరుతో తీసుకువచ్చాడు. తొలిసారిగా అన్ని గేయాలతో బాలల సంకలనాన్ని ‘కోయిలా.. కోయిలా’ అంటూ చెరువు మాధారం పాఠశాల నుండి ప్రచురించాడు. వెంకటయ్య వద్ద పద్యం నేర్చుకున్న బాల కవయిత్రి షేక్‌ రిజ్వానా ‘రిజ్జు శతకం’ రాసి ఖ్యాతికెక్కడమే కాక పలు పురస్కారాలు పొందింది. బాలల మిత్రుడుగా కార్యక్రమాలు చేసే కన్నెగంటిని ‘సాహితీ మిత్రుడు’గా పిలిచింది అశ్వారావుపేట భానోదయసాహితీ. కటకం నటరాజ్‌ అవార్డ్‌, విద్యాసేవారత్న, జనరంకజ కవి ప్రతిభా పురస్కారం, డా||గజల్‌ శ్రీనివాస్‌ ట్రస్ట్‌ పురస్కారం, విశ్వపుత్రిక పురస్కారం, ఖమ్మం రోటరీ క్లబ్‌ ఉపాద్యాయ సత్కారాలతో పాటు బాల సాహిత్య వికాసంలో బండారుబాలానంద సంఘం జవహర్‌లాల్‌ నెహ్రూ పురస్కారం, డా|| చింతోజు బ్రహ్మయ్య బాల సాహిత్య వికాస పురస్కారం రెండుసార్లు గెలుచుకున్నాడు.
బాల సాహిత్యకారుడుగా కార్యక్రమాలు, కార్యశాలలతో పాటు తాను పిల్లల కోసం రాసిన రచనలను ‘చిటికెలు’గా తెచ్చాడు వెంకటయ్య. చిటికెలు వెంకటయ్య బాలల గేయాలు. వృత్తిరీత్యా కన్నెగంటి ఉపాధ్యాయుడు, అందులోనూ భాషోపాద్యాయుడు. పాఠమైనా, పాటైనా అది ఆయనలో ప్రతిబింభిస్తుంది… ‘సీతాకోక చిలుకమ్మా…’ గేయం అటువంటిదే. ‘సీతాకోక చిలుకమ్మా/ ప్రకృతి వరప్రసాదమా..’ అంటూ ఆరంభించి గొంగళి పురుగు రంగురంగుల గాలిజండా అయిన సీతాకోక చిలుకగా మారడాన్ని వివరిస్తూనే, ప్రకృతిలోని మార్పులవల్ల ప్లాస్టిక్‌ సీతాకోక చిలుకల్ని చూడాల్సివస్తుందని ఆవేదన చెందుతాడు. అచ్చంగా తరగతి గదిలో పాఠం చెప్పినట్టే ఈ గేయం సాగుతుంది. ఇందులో గేయ కథల్ని కూడా కూర్చాడు కవి. అటువంటిదే ‘చెట్టుతల్లి’. నేను పైన చెప్పినట్టు ఉపాధ్యాయుడు కదా! పద్యలక్షణాలను గేయంలో పిల్లలకు చేరేలా రాశాడు ఒక గేయంలో. ‘చంపకమాల పద్యంలోన/ నాలుగు పాదాలుంటాయి’ అంటూ సాగుతుందా గేయం. యిలా వృత్తపద్యాలన్నింటిని అత్యంత సరళంగా పిల్లలకు గేయంగా పరిచయం చేస్తాడు. నిజానికి బాల సాహిత్యం ప్రధాన ఉద్దేశ్యం అనందం, అనుభూతి అయినప్పటికీ విజ్ఞానాంశాలు తొలినాళ్ళ నుండి బాల సాహిత్యంలో మనం చదువుకుంటూనే ఉన్నాం. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ను బాలలకు పరిచయం చేస్తూ ‘పీడిత తాడిత నరాన/ ప్రవహించే జవజీవం’, ‘మనిషిని మనిషిగ చూడని/ ఈ వ్యవస్థ మారాలనే/ సామాజిక న్యాయానికి/ సమరశీల సిద్ధాంతం… మానవతా వాదానికి/ నిలువెత్తు నిదర్శనం/ మునుముందుకు నడిపించే/ మహోన్నత ఆశయం’ అంటాడు. ‘దేశం కోసం ఊపిరులూదిన/ వీరులే గమన దేవుళ్ళు’, ‘కాళోజి నిజం కవి/ ఉదయించే సూర్యుడివి’ వంటివి చక్కని గేయాలు. ‘ఆకాశంలో చుక్కలు/ అడవిలోన నక్కలు/ ఊరినిండా కుక్కలు/అరటిపండు తొక్కలు’ వంటి గేయాలు సరదాగా అంత్యప్రాసలతో పిల్లలు పాడుకునేందుకు కూర్చారు కవి. బాల వికాసోద్యమంతోపాటు, బాల సాహిత్య సృజన చేపట్టిన కన్నెగంటికి అభినందనలు.
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548