– ఔట్‌సోర్సింగ్ పేరుతో ఉద్యోగాలు ఊడగొడుతున్నారని మండిపాటు
– మోడీ ప్రభుత్వ విధానాలపై పోరాడాలని నిర్ణయం
కొల్‌కతా: మోడీ ప్రభుత్వ విధానాల కారణంగా బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల భవిష్యత్తు అంధకారంలో పడింది. ముఖ్యమైన ప్రయోజనాలను రద్దు చేయడం, ఉద్యోగ భద్రత కరువవడంతో వారి జీవితాలలో అనిశ్చితి నెలకొంది. ‘బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థలో గత 20-25 సంవత్సరాలుగా ఉద్యోగులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేయాల్సి రావడం దురదృష్టకరం. గతంలో వారికి కనీస వేతనాలు లభించేవి. పీఎఫ్, ఈఎస్‌ఐ, గ్రాట్యుటీ వంటి చట్టబద్ధమైన ప్రయోజనాలు చేకూరేవి. అయితే ఆ తర్వాత సర్వీస్ లెవల్ ఒప్పందం పేరుతో వాటన్నింటినీ ఉపసంహరించారు. కాంట్రాక్ట్ కార్మికులను వేధించేందుకు నూతన వేతన ఒప్పందాన్ని ఓ సాధనంగా వాడుకుంటున్నారు’ అని తపస్ రంజన్ ఘోష్ అనే కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశారు.
కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ ఈ ఒప్పందం పరిధిలో చేర్చలేదు. అప్పటి వరకూ వీరందరినీ బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థే నియమించేది. ఎప్పుడైతే ఒప్పందం అమలులోకి వచ్చిందో అప్పుడే ఈ బాధ్యత నుండి బీఎస్‌ఎన్‌ఎల్ వైదొలిగింది. దీంతో కాంట్రాక్ట్ కార్మికులకు లభిస్తున్న చట్టబద్ధమైన ప్రయోజనాలన్నీ పోయాయి. కొందరికి నెలకు ఐదు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల కొల్‌కతాలోని శ్రామిక్ భవన్‌లో జరిగిన సమావేశంలో ప్రభుత్వ నిర్వాకం బయటపడింది. ప్రభుత్వ రంగంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తున్న వైనంపై సమావేశంలో చర్చించారు. 4జీ, 5జీ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో పోటీ మార్కెట్‌లో ఇతర సర్వీసు ప్రొవైడర్ల నుండి సవాళ్లు ఎదుర్కొంటున్నామని పలువురు ప్రతినిధులు వాపోయారు. ప్రారంభంలో టెలికం శాఖ అధీనంలోనే టెలిఫోన్ మౌలిక సదుపాయాల వ్యవస్థ పని చేసేదని వారు గుర్తు చేశారు. ఇప్పుడు కొత్తగా చేపట్టిన ఔట్‌సోర్సింగ్ ప్రక్రియ కారణంగా సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
గతంలో ఐదారు వేల మంది సిబ్బంది ఉంటే ఇప్పుడు వారిలో ఆరేడు వందల మంది మాత్రమే పని చేస్తున్నారని ఘోష్ చెప్పారు. యాజమాన్య బాధ్యతను నిర్వహించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ సుముఖంగా లేదని తెలిపారు. ‘టెలికం శాఖ నుండి బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారేటప్పుడు కాంట్రాక్ట్ కార్మికులను క్రమేపీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత దీనిని తుంగలో తొక్కారు. 23 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేసినా అతనిని సర్వీస్ లెవల్ ఒప్పందం పేరుతో ఇంటికి సాగనంపారు’ అని ఆయన వివరించారు.
ఏడవ వేతన కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని 22 రాష్ట్రాల నుండి హాజరైన ప్రతినిధులు డిమాండ్ చేశారు. పైగా తమకు కాంట్రాక్టర్లు సకాలంలో జీతాలు కూడా ఇవ్వడం లేదని వారు తెలిపారు. దేశవ్యాప్తంగా యాభై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు లే-ఆఫ్ ఇవ్వాలని బీఎస్‌ఎన్‌ఎల్ యాజమాన్యం పథకం పన్నిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం ప్రారంభించాలని సమావేశానికి హాజరైన ప్రతినిధులు నిర్ణయించారు.