భారత్ కల్చరల్ అకాడమీ, తెలుగు టెలివిజన్ రచయితల సంఘం ఆధ్వర్యంలో కళాప్రపూర్ణ కాంతారావు 101వ జయంతి వేడుక ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. భారత్ కల్చరల్ అకాడమీ అధ్యక్షులు నాగబాల సురేష్ కుమార్ సారధ్యంలో జరిగిన ఈ వేడుకలో రమణా చారి మాట్లాడుతూ, ‘ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో పాటు సినిమా రంగంలో రాణించిన కాంతారావుకు ప్రభుత్వం నుండి రావలసిన గుర్తింపు రాలేదు. ఈ విషయంలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు కూడా ఆలస్యంగా గుర్తింపు లభించింది. కాంతారావుకు ఇప్పటికైనా ప్రభుత్వం తరపున తగిన గుర్తింపు దక్కేలా కషి చేస్తే బాగుంటుంది. నటుడిగా ఆయన జీవిత ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం’ అని అన్నారు. ‘కాంతారావుతో చైల్డ్ ఆర్టిస్ట్ గానే కాకుండా హీరోయిన్‌గా కూడా నటించాను. అదొక గొప్ప మర్చి పోలేని అనుబంధం. ఆ రోజుల్లో కాంతారావుకి మంచి క్రేజ్ ఉంది. ఆయన నటన అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది ‘ అని రోజా రమణి చెప్పారు. నటి కవిత, రచయిత్రి డా.కె.వి.కష్ణ కుమారి, నిర్మాత రామ సత్య నారాయణ, కాంతారావు కుమార్తె సుశీల, కుమారుడు రాజా, రచ యితల సంఘం అధ్యక్షుడు ప్రేమ్ రాజ్, కోశాధికారి చిత్తరంజన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్‌డియస్ ప్రకాష్, అక్కినేని శ్రీధర్, కెవియల్ నరసింహ రావు, ప్రేమ్ కమల్, స్వప్న తదితరులు పాల్గొని కాంతారావు నట జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.