కంటి వెలుగు పథకం పేదలకు వరం

– ఎంపీపీ సుకన్య భాష
– నందివనపర్తిలో కంటి వెలుగు సెంటర్‌ ప్రారంభం
నవతెలంగాణ-యాచారం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకం పేదలకు వరం లాంటిదని ఎంపీపీ కొప్పు సుకన్య భాష అన్నారు. మంగళవారం యాచారం మండల పరిధిలోని నంది వనపర్తి లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని సర్పంచ్‌ కంబాళ్లపల్లి ఉదయశ్రీతో కలిసి ఎంపీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటి వెలుగు పథకం ద్వారా పేదలందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి కండ్ల అద్దాలను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కంటి వెలుగు పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించడం అభినందించాల్సిన విషయమని చెప్పారు. ఈ పథకం ద్వారా ఎంతోమంది వృద్ధులకు కంటి సమస్యను పరిష్కరించడం జరిగిందని వివరించారు. ఈ సదవకాశాన్ని గ్రామ ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ శ్యాంసుందర్‌ రెడ్డి, వార్డు సభ్యులు, డాక్టర్‌ ప్రియాంక, ఏఎన్‌ఎం లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.