– జనచైతన్య యాత్ర
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కారుమబ్బులో కాంతిరేఖ సీపీఐ(ఎం) చేపట్టిన జనచైతన్య యాత్రకు దారిపోడవునా ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ఈ క్రమంలో ఏటూరు నాగారం అడవిలో ఎర్రజెండా రెపరెపలాడింది. బైక్ ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. సీపీఐ(ఎం) జన చైతన్య బస్సు యాత్ర ఆదివారం నాటికి మూడోరోజుకు చేరుకుంది. ఉదయం ములుగు జిల్లా పస్రాలో ప్రారంభమైన ఈ యాత్ర వాజేడు, వెంకటాపురం మండలాల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశించింది. ఉదయం వాజేడు, మధ్యాహ్నం వెంకటాపురం, సాయంత్రం చర్ల మండలాల్లో బహిరంగ సభలను నిర్వహించారు. బస్సుయాత్రలో వందలాది మంది నిర్వహించిన బైక్‌ర్యాలీ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. యాత్ర సందర్బంగా విడుదల చేసిన జనచైతన్య పాటలు ఆలోచింపచేస్తున్నాయి. ప్రజానాట్య మండలి కళాకారులు సభ ప్రారంబానికి ముందే వేదిక వద్దకు వెళ్లి ఆటా, పాటలతో అక్కడి ప్రజలను జాగతం చేస్తున్నారు. దేశానికి బీజేపీ ఎంత ప్రమాదకరంగా పరిణమించిందనే విషయాన్ని ప్రజలకు విడమరచి చెబుతున్నారు. మరికొందరు కార్యకర్తలు కరపత్రాలు పంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అప్రజాస్వామిక విధానాలను వివరిస్తున్నారు. దేశంలో ఆ పార్టీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ… కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేస్తూ…రాజకీయ లబ్దిపొందుతున్న వైనాన్ని వివరిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు.