మసిపూసి మారేడుకాయ చేయడంలో మోడీకి మించిన వారు లేరని పదేండ్ల నుండి రుజువవుతూనే ఉంది. ఇందుకు మరో తాజా ఉదాహరణే సోమనాథన్ కమిటీ సిఫార్సు చేసిన యూనిఫైడ్ పెన్షన్ స్కీం(యూపీఎస్). చూడటానికి నున్నగా కనిపిస్తున్నా కరిమింగిన వెలగపండు చందమే ఈ స్కీమ్. ముప్పై ఏండ్లు వివిధ ప్రభుత్వ విభాగాల్లో సేవలందించి, పదవీ విరమణ తర్వాత వారి జీవితానికి, కుటుంబానికి ఓ భరోసానే పెన్షన్. ఈ పెన్షన్ పొందడం వారి హక్కే కానీ, భిక్ష కాదని సుప్రీంకోర్టు ఏనాడో తేల్చి చెప్పింది. అన్నీ ఇస్తామంటూనే ఉద్యోగి నుండి వాటా అడుగుతున్నారు. అందుకే ఈ ఏకీకృత ెన్షన్ పథకాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ విధానంలోని అనేక అంశాల్లో అసలు స్పష్టతే లేదు. ఉద్యోగుల భాగస్వామ్య వాటా ఎందుకు? ఈ స్కీం భవిష్యత్‌లో మరిన్ని సమస్యలు సృష్టించడం ఖాయం.
వాస్తవానికి 2004 ముందు వరకు ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీం) అమల్లో ఉండేది. దీన్ని త్రిబుల్ బెన్‌ఫిట్స్ సిస్టమ్ అనేవారు. అంటే కచ్చితమైన పెన్షన్, పీఎఫ్, గ్రాడ్యూటీ.. ఈ మూడూ పదవీ విరమణ పొందిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి వర్తించేవి. ఉద్యోగుల నుండి ఒక్క రూపాయి కూడా తీసుకునేవారు కాదు. అయితే ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు వాజ్‌పేయి నాయకత్వంలోని అప్పటి ఎన్డీయే ప్రభుత్వం జవనరి, 2004 నుంచి జాతీయ పెన్షన్ విధానం తీసుకొచ్చింది. ఈ విధానం తర్వాత సర్వీస్‌లో ఉన్నప్పుడే పెన్షన్ ఫండ్ కోసం ఉద్యోగి నుండి పది శాతం, యాజమాన్యం నుండి పది శాతం తీసుకొని షేర్‌మార్కెట్లో పెట్టడం మొదలుపెట్టారు. మార్కెట్ హెచ్చు తగ్గులను బట్టి ఉద్యోగి రిటైర్ అయినపుడు, చనిపోయినపుడు ఎంత అయితే అతని అకౌంట్లో ఉంటుందో అందులో అరవై శాతం చేతికిస్తారు. మిగిలింది మ్యూచ్‌వల్ ఫండ్స్ వలె కొనుక్కోవాలి. అయితే ఇందులో పెన్షన్ ఎంత వస్తుందో స్పష్టత ఉండదు. మార్కెట్‌ను బట్టి మారిపోతూ ఉంటుంది. 2004 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారందరికీ ఈ విధానం అమల్లో ఉంది.
ఈ విధానానికి వ్యతిరేకంగా ఓపీఎస్ అమలు చేయాలని ఏండ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి తలొగ్గి 2023, మార్చిలో బీజేపీ ప్రభుత్వం సోమనాథన్ కమిటీని నియమిం చింది. ఏడాది తర్వాత దీని సిఫారసుల మేరకు యూనిఫైడ్ పెన్షన్స్ స్కీంను 2024 ఆగస్టు 24న కేంద్ర క్యాబినెట్ ఆమోదిం చింది. దీని ప్రకారం పెన్షన్ కమ్యూటేషన్, కనీసం ఐదేండ్లకు ఓసారి పెన్షన్ సవరణ, టాక్స్ బెనిఫిట్స్, 70 ఏండ్ల పైబడిన వారికి అదనపు పెన్షన్ అంటూ అనేక అంశాలు వివరించారు. షేర్‌మార్కెట్‌పై ఆధారపడ కుండా ఫిక్స్‌డ్‌గా కొంత పెన్షన్ కూడా ఇస్తామంటున్నారు.
ఇవన్నీ ినడానికి పాత పెన్షన్ వలె పైకి కనబడుతున్నా ఉద్యోగి భాగస్వామ్యం మాత్రం అలాగే కొనసాగుతుంది. అలాగే ఓపీఎస్ కింద ఇరవైయేండ్ల సర్వీసుంటే పూర్తి పెన్షన్ వచ్చేది. యూపీఎస్‌లో దాన్ని పాతికేండ్లు చేశారు. దీనివల్ల పెన్షన్‌కు అర్హత పొందే వారి సంఖ్యే తగ్గిపోయే అవకాముంది. పైగా ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నన్ని రోజులు పెన్షన్ ఫండ్ మొత్తం షేర్‌మార్కెట్లోనే పెడతారు. అంటే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం షేర్ మార్కెట్‌కు నిధులు సమకూర్చటమే. ఈ పథ కంలో భాగంగా ప్రభుత్వం తన వాటాను మరో నాలుగున్నర శాతం పెంచింది. జూలై 31 నాటికి ఎన్‌పీఎస్ కింద ఉన్న 99,77,165 మంది ఉద్యోగులకు చెందిన రూ.10,53,850 కోట్ల పెన్షన్ నిధులను షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందనేది స్పష్టం. ప్రభుత్వానికి ఉద్యోగుల బాగుకన్నా కార్పొరేట్ల అవసరాలే ముఖ్యమని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఈ విధానంలో చెప్పిన పదవీ విరమణ సమయంలో చెల్లించే మొత్తం, అదనపు పెన్షన్, ఆరోగ్య కార్డులు, భవిష్యత్తులో సవరణలు, పన్ను ప్రయోజనలు వంటి అంశాలపై అసలు స్పష్టతే లేదు.
త్వరలో జమ్మూకాశ్మీర్, హర్యానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత కీలకమైన మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్‌లలో వరుసగా ఎన్నికలున్నాయి. ఎన్నికల్లో ప్రధాన అంశంగా పాత పెన్షన్ పునరుద్ధరణను కాంగ్రెస్ ఎంచుకున్నది. అందుకే బీజేపీ ఈ స్కీమును హడావిడిగా ఆమోదించింది. ఈ స్కీమును జాతీయ ట్రేడ్ యూనియన్లలో బిఎంఎస్ తప్ప మిగిలిన అన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం యూపీఎస్‌ను తెరపైకి తెచ్చి ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల సంస్థ ‘ది నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్’ ఈ పాటికే ప్రకటించింది. ఏది ఏమైనా ఈ పెన్షన్ పథకం ఉద్యోగులను ఏమారుస్తోందనేది స్పష్టం. ఇలాంటి మసిపూసి మారేడుకాయ చేసే పనులకు కేంద్రం పూనుకోవడం మానాలి. ఉద్యోగులు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు పాత పెన్షన్ విధానం కోసం తమ ఉద్యమాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు.