
– రైల్వే అధికారులను కోరిన డీసీసీ ఉపాధ్యక్షులు సంగ స్వామి యాదవ్..
నవతెలంగాణ – వేములవాడ
కరీంనగర్ లో ఉన్న మాదిరిగానే వేములవాడలోనూ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు సంగ స్వామి యాదవ్ రైల్వే అధికారులను కోరారు.ఆదివారం వేములవాడ విచ్చేసిన దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ బస్వరాజు కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంగ స్వామి యాదవ్ మాట్లాడుతూ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు కొలువై ఉన్న వేములవాడ పట్టణానికి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తారని, వీరితో పాటు వేములవాడ పరిసర ప్రాంతాల నుండి నిత్యం వేలాది మంది భక్తులు వారణాసి, తిరుపతి, షిర్డీ వంటి పుణ్యక్షేత్రాలకు, ముంబయి, భీవండీ, సూరత్, ఢిల్లీ వంటి మహా నగరాలకు ప్రయాణాలు చేస్తుంటారని తెలిపారు. వేములవాడ విచ్చేసిన దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ బస్వరాజు కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. వేములవాడ నుండి సుదూర ప్రాంతాలకు వెళ్లే భక్తులు, రైల్వే ప్రయాణికులు రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో లేక సమయానికి టిక్కెట్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొన్ని సందర్భాల్లో ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారని, అదే వేములవాడలో రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తే ఇక్కడి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నుండి నిత్యం వేలాది సంఖ్యలో వెంకన్న భక్తులు తిరుమల తిరుపతికి వెళ్తుంటారని, కరీంనగర్ నుండి వారానికి రెండుసార్లు మాత్రమే రైల్ సర్వీస్ అందుబాటులో ఉంటుందని, దీంతో బెర్త్ లు దొరక్క భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజూ తిరుపతికి రైల్ సర్వీస్ నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తన అభ్యర్థనపై రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారని, పై రెండు విషయాలను పరిశీలించి ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు స్వామి యాదవ్ తెలిపారు.