నవతెలంగాణ- కాటారం: కర్ణాటక రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ నాయకులు తెలంగాణలో తప్పుడు ప్రచారం చేస్తుండటం తగదని కర్ణాటక ఎమ్మెల్సీ నాగరాజు యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సహకరించక పోయిన ఐదు గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు జరిపినందునే తెలంగాణలో కర్ణాటక ఫలితాలు పునరావృతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. మహిళలకు నిరుద్యోగులకు పెద్దపీట వేసి తమ చిత్తశుద్ధి చాటామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు పథకాలు అమలు చేసేలా ఒక సుదీర్ఘ ప్రణాళికను రూపొందించమన్నారు. సోనియా, రాహుల్, శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి పారదర్శకత పాటిస్తామని అన్నారు. తెలంగాణ కర్ణాటక భౌగోళిక పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఆయన అన్నారు. కర్ణాటక మాదిరిగా అందుబాటులో ఉండే ముఖ్యమంత్రిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. శ్రీధర్ బాబు కర్ణాటక రాష్ట్రం ఎన్నికల ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న ప్రాంతంలో అత్యధిక కాంగ్రెస్ సీట్లు దక్కాయని గుర్తు చేశారు. కెసిఆర్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టును ఒక ఏటీఎం లాగా వాడుకుందని అన్నారు. నాణ్యత ప్రమాణాలు లేకుండా కట్టడాలు నిర్మించి లక్షల కోట్లు అవినీతి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, మహిళ అధ్యక్షురాలు ఎంపిటిసి జాడి మహేశ్వరి రమేష్, డిసిసి ఉపాధ్యక్షులు గద్దె సమ్మిరెడ్డి, సర్పంచులు అంగజాల అశోక్ కుమార్, రఘురాం నాయక్, ఓ బి సి మండల అధ్యక్షులు కొట్టే ప్రభాకర్, కో ఆప్షన్ మెంబర్ అజీజ్, మొగిలి రాజ్ కుమార్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.