నీట మునిగి కర్నాటక వాసి మృతి

నవతెలంగాణ -పాపన్నపేట
ఏడుపాయల వనదుర్గా భవానీ మాత సన్నిధిలోని చెక్‌ డ్యామ్‌లో పడి యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలంలో జరిగింది. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మహిపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటకలోని బీదర్‌ జిల్లా కర్కనల్లి గ్రామానికి చెందిన సంకు బసవరాజు(37) కుటుంబ సమేతంగా ఏడుపాయలకు దర్శనం కోసం ఈ నెల 17న రాత్రి వచ్చారు. మరుసటి రోజు ఉదయం స్నానం చేయడానికి కోసం అతను చెక్‌డ్యామ్‌లో దిగాడు. ప్రమాదవశాత్తు నీట మునిగి బసవరాజు మృతి చెందాడు. మృతుని భార్య సంకు సిద్ధమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వీరికి ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు.