చదివింది కేవలం నాలుగో తరగతే… అయితేనేం? లోకాన్ని చదివిన అనుభవం ఉపాధ్యాయుడ్ని చేసింది. బతుకుదెరువుకు పాలేరుగా పనిచేస్తూ… స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి, వామపక్ష నేతల సాహచర్యంతో గొప్ప పోరాట యోధుడయ్యాడు. సమాజంలోని అసమా నతలకూ.. దోపిడీకీ మూలమేమిటో, దానికి ఊపిరి ఎక్కణ్నుంచి వస్తున్నదో క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. దోపిడీ పోవాలంటే పోరాటమే మార్గమని నమ్మారు. కనుకనే తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో నేను సైతం అంటూ పిడికిలి బిగించిన రైతునేత బోడేపూడి వెంకటేశ్వరరావు. 1924 ఏప్రిల్ 2న మధిర మండలం తొండల గోపవరంలో బోడే పూడి సీతయ్య, సుబ్బమ్మ దంపతులకు పుట్టిన బోడేపూడి వారికే కాదు, ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమానికే పెద్దకొడుకయ్యాడు. నిర్బంధాలను లెక్కచేయకుండా అనేక రహస్య కార్యకలాపాలు నిర్వహించిన నేత. క్యాంపులు, రాజకీయ తరగతులు నడు పుతూ అకుంఠిత దీక్షతో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిన కార్యదక్షత ఆయనది. వట్టికొండ నాగేశ్వరరావు స్ఫూర్తితో నల్గొండ, వరంగల్ జిల్లాల్లో కొరియర్‌గా పని చేశాడు. నైజాంకు వ్యతిరేకంగా భూమి, భుక్తి, బానిస విముక్తి కోసం సాగిన తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో ముఖ్య నాయకుడిగా ఎదగడానికి ఆయన మొక్కవోని దీక్షే కారణం.
ఆ రోజుల్లోనే బోడేపూడి ప్రజానాట్యమండలి శిక్షణా శిబిరంలో పద్యాలు, పాటలు లయబద్ధంగా పాడగల శిక్షణ పొందాడు. ఆంధ్ర మహాసభ చీలిన తరువాత ఖమ్మంలో జరిగిన మహాసభను విజయవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన స్వగ్రామమైన గండగల పాడులో తొలిసారి జాతీయజెండాను ఎగురవేసి తన దేశభక్తిని చాటు కున్నారు. తన 20 ఏండ్ల వయసులో గండగలపాడుకే చెందిన ధనమ్మను వివాహ మాడారు. కమ్యూనిస్టు ఉద్యమంపై అటు నైజాం పాలకులు, స్వాతం త్య్రానంతరం దేశ పాలకుల నిర్భంధంలో పార్టీ నిర్ణయం మేరకు కొంతకాలం గడిపిన అజ్ఞాత జీవితం ఆయనను ఒక పండితుడిగా, సాహితీవేత్తగా తీర్చిదిద్దింది. అభ్యు దయ గీతాలు రాసి వాటిని లయబద్ధంగా పాడేవారు. ఆ కాలంలోనే ఆయన రామాయణ, భార తాలను అవపోసన పట్టారు. అనంతరం ఉద్యమ పాఠాలు బోధించే క్రమంలో వాటిని కథలుగా మార్చి ఉద్యమానికి అన్వయించి చెప్పే వారు. ఆదర్శ వివాహాలకు ఆచార్యులుగా వ్యవహారించే వారు. 1945-46లో గండగలపాడులో లెవీ ధాన్యం నిర్బంధ వసూలు, పట్వారీల జులుం, జమీందార్ల ఆగ డాలకు వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్నాయి. పట్వారీల దస్త్రాలను తగులబెట్టడం, పన్నుకు వ్యతిరేకంగా తాటిచెట్లు నరకడం, ప్రభుత్వ కార్యాలయాలపై జెండాలు కట్టడం, జాగీర్దార్ల దౌర్జన్యాలను ప్రతిఘటించడం, రజా కార్లను ఎదుర్కోవడం వంటివి జరుగుతున్నాయి. వాటిలో ఆయన పాల్గొనటమేగాక, వైరా చుట్టుపక్కల వందలాది గ్రామాల్లో నిజాం వ్యతిరేక పోరాటంలోనూ, వెట్టి చాకిరీ వ్యతిరేక పోరాటంలోనూ కీలకపాత్ర నిర్వహించారు. జమీం దార్లనూ, జాగీర్దార్లనూ ప్రతిఘటించారు.
తెలంగాణా సాయుధ పోరాట విరమణా నంతరం కమ్యూనిస్టు పార్టీ పీడీఎఫ్ పక్షాన అభ్యర్థులను నిలబెట్టగా మధిర నుంచి కొండబోలు వెంకయ్యను గెలిపించడంలో బోడేపూడి ప్రధాన పాత్ర వహించారు. 1947లో కమ్యూనిస్టు పార్టీ మధిర తాలూకా కమిటీ సభ్యుడిగా ఎన్నికైన బోడేపూడి, ఆ తర్వాత తాలూకా కార్యదర్శిగానూ పనిచేశారు. 1958లో పార్టీ జిల్లా కమిటీ సభ్యునిగా 1960లో కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు. 1964లో పార్టీలో చీలిక అనంతరం ఆయన సీపీఐ(ఎం) వైపు నిలబడ్డారు. ఆయనపై చైనా ఏజెంటనే ముద్రవేసి అదే యేడు డిసెంబరు 29న జైల్లో పెట్టి 1966 మార్చిలోగానీ విడుదల చేయలేదు. ఈ నిర్భంధంలో ఉన్నప్పుడే ఆయన ఇద్దరు కుమార్తెల వివాహాలు చేయించారు. విడుదలా నంతరం 1968లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా 1979లో పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ఎన్నికై 1989 వరకూ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ కాలంలోనే (1985లో) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగానూ ఎన్నికైన బోడేపూడి.. 1985, 1989, 1994ల్లో మధిర శాసనసభ్యుడిగా వరుస విజయాలు సాధించారు. 1994లో ఆయన సీపీఐ (ఎం) శాసనసభాపక్ష నాయకుడిగానూ వ్యవహరించారు. పలు విషయాలపై పట్టున్న నేతగా అసెంబ్లీలో అనేక సమస్యలను లేవనెత్తి మధిర ఖ్యాతిని రాష్ట్రస్థాయిలో ఇను మడింపజేశారు. ఆ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చేందుకు బోడేపూడి పోరాడి సాధించిన మంచినీటి పథకానికి.. ఆయన మరణానంతరం ”బోడేపూడి సుజల స్రవంతి”గా ప్రభుత్వం ఆయన పేరునే నిర్ణయించడం ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం.ఆశయం ఆచరణ కలగలిసిన అరు దైన విప్లవకారుడు బోడేపూడి. ఆయన ఆశయాల రూపమే ‘బోడేపూడి విజ్ఞాన కేంద్రం’ ఖమ్మం నగర నడి బొడ్డునుండి భావితరాలకు విజ్ఞాన వీచికలు విర జిమ్ముతూ.. చైతన్య కాంతులను ప్రసరింపచేస్తోంది. ప్రజారోగ్య బాధ్యత గుర్తెరిగి ప్రతినెలా మొదటి శనివారం నిరుపేదలకు వైద్యసేవలందించే విధంగా మెడికల్ క్యాం పులను నిర్వహిస్తోంది. నేటినుంచి ఆ సేవలను మరింత విస్తతం చేయనుంది.
– అనంతోజు మోహన్ కృష్ణ, సెల్ : 8897765417