భువనేశ్వరికి కాసాని సంఘీభావం

Kasani's solidarity with Bhubaneswar– రాజమండ్రిలో భేటి
నవతెలంగాణ-హైదరాబాద్‌
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని రాజ మండ్రిలో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ కలిసి సంఘీభావం ప్రకటించారు. సెప్టెంబర్‌ 10న చంద్రబాబును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్‌ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌లో రిమాండ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ రాజమండ్రిలో ఆపార్టీ సీనియర్‌ నేతలు, కార్య కర్తలతో భువనేశ్వరితో భేటి అయ్యారు. చంద్రబాబు అరెస్ట్‌, తదనంతర పరిస్థితులు, తెలంగాణ చేపట్టిన కార్యక్రమాల గురించి చర్చించారు.
కాసాని వెంట టీడీపీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్‌, బిసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి సతీష్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు పొలంపల్లి అశోక్‌, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మేకల భిక్షపతి, నల్లగొండ పార్లమెంటు అధ్యక్షులు కసిరెడ్డి శేఖర్‌రెడ్డి తది తరులు ఉన్నారు. ప్రపంచం వ్యాప్తంగా చంద్ర బాబుకు మద్దతు లభించిందనీ, ఆయన కడిగిన ముత్యంలా త్వరలో బయటకు వస్తారని కాసాని వ్యాఖ్యానించారు. జగన్‌ ప్రభుత్వం ఆయనపై అక్రమ కేసులు బనాయించిందని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల అభివద్ధి ప్రధాతగా, ఐటీ వైభవ మూల విరాట్‌గా, రాష్ట్ర ఆర్థిక సంపత్తిని రూ. 10 వేల కోట్ల నుంచి 60 వేల కోట్లకు తీసుకెళ్లిన విజనరీ లీడర్‌గా ఆయన్ను తెలుగు ప్రజలే కాకుండా ప్రపంచం మొత్తం గుర్తించి గర్విస్తున్నదని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడం తథ్యమని అభిప్రాయపడ్డారు.