తెరపై కాషాయం సినిమాలే ప్రచారాస్త్రాలు

Amber on the screen Movies are propaganda– బీజేపీ నాయకులు, సంబంధిత వ్యాపారుల ఫండింగ్‌
– విషం చిమ్ముతున్న ‘హిందూత్వ’ చిత్రాలు
– కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం యాక్టింగ్‌ కూడా వారే
– ప్రజల మెదళ్లలో విష బీజాలు నాటే ప్రయత్నాలు
– లోక్‌సభ ఎన్నికల్లో లబ్ది పొందే కుయుక్తులు
– వివాదాస్పద అంశాలే ముడిసరుకుగా సినిమాలు
– అలాంటి సినిమాలకు బీజేపీ ప్రభుత్వాల ప్రచారాలు.. రాయితీలు
కొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ.. ప్రజలకు ఏం చేసిందో, ఏమి చేయబోతుందో చెప్పి, మ్యానిఫెస్టోలో హామీల ఆధారంగా ప్రజల ఓట్లను పొందే ప్రయత్నం చేయాలి. కానీ బీజేపీ ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. విద్వేషాన్ని, విషాన్ని చిమ్మే చలనచిత్రాలపై ఆధారపడుతున్నది. తనకు ప్రధాన ఆయుధమైన ‘హిందూత్వ’ అంశానికి ‘జాతీయత’ అనే భావోద్వేగాన్ని ముడిపెట్టి, చరిత్రను, వాస్తవాలను వక్రీకరిస్తూ సినిమాలను నిర్మించి ప్రజల్లోకి ఒదులుతున్నది.
న్యూఢిల్లీ : బీజేపీ ప్రాయోజిత వివాదాస్పద చిత్రాలు గత 2019 లోక్‌సభ ఎన్నికల ముందు నుంచీ ఉన్నాయి. 2021 నుంచి ఈ ట్రెండ్‌ మరింత ఎక్కువైంది. ఈ చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, యాక్టింగ్‌తో పాటు నిధులను సమకూర్చి నిర్మాతలుగా మారుతున్నదీ బీజేపీ, దాని అనుకూల నాయకులే కావటం గమనార్హం. దేశంలోని అన్ని సమస్యలకు కాంగ్రెస్‌, లెఫ్ట్‌ వంటి పార్టీలు, వాటి అనుబంధ సంఘాలే కారకులుగా, విలన్లుగా చూపించి.. బీజేపీని పరోక్షంగా ‘హీరో’గా చిత్రీకరిస్తున్నాయి ఈ వివాదాస్పద చిత్రాలు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే హిందూత్వ, బీజేపీ అనుకూల కథనాలను ప్రోత్సహించే అనేక హిందీ సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ‘స్వతంత్ర వీర్‌ సావర్కర్‌’, ‘జేఎన్‌యూ : జహంగీర్‌ నేషనల్‌ యూనివర్శిటీ’, ‘ ఆర్టికల్‌ 370’, ‘మై అటల్‌ హూ’ వంటివి ఉన్నాయి. అలాగే, ఈ జాబితాలో గతంలోని స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్మించిన ‘బెంగాల్‌ 1947’, ‘రజాకార్‌’, ‘యాక్సిడెంట్‌ లేదా కాన్‌స్పిరసీ: గోద్రా’ వంటి విడుదలైన, విడుదల కానున్న చలనచిత్రాలూ ఉన్నాయి. ఇలాంటి బీజేపీ, హిందూత్వ అనుకూల చిత్రాల పరంపర 2019కి ముందు నుంచే ప్రారంభమై 2024 నాటికి అధికమైందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
‘జేఎన్‌యూ: జహంగీర్‌ నేషనల్‌ యూనివర్సిటీ’
ఈ చిత్రం లెఫ్ట్‌ వింగ్‌ స్టూడెంట్‌ పాలిటిక్స్‌ను విమర్శిస్తూ రూపొందించారు. టైటిల్‌ ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)ని పరోక్షంగా సూచిస్తుంది. ఈ చిత్రాన్ని మహాకాల్‌ మూవీస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ నిర్మించింది. ఈ కంపెనీ డైరెక్టర్లలో విష్ణు తాంతియా ఒకరు. ఆయన రాష్ట్రంలో బీజేపీతో పొత్తులో ఉన్న హర్యానా రాజకీయ నాయకుడు గోపాల్‌ కందాగా ప్రసిద్ధి చెందిన గోపాల్‌ గోయల్‌ వ్యాపార సహచరుడు. ‘భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన’ జేఎన్‌యూలో భారతదేశ సంస్కృతి, సమగ్రత కోసం నిలబడే కాషాయ అనుకూల రైట్‌-వింగ్‌ ‘ఏఐవీపీ’ (పరోక్షంగా ఏబీవీపీ), లెఫ్ట్‌ వింగ్‌ (ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌) ‘జాతీయ వ్యతిరేక’ అజెండా మధ్య పోరాటంగా ఈ చిత్రంలో చూపించారు. ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసినట్టు సమాచారం.
స్వతంత్ర వీర్‌ సావర్కర్‌
కరడుగట్టిన హిందుత్వ సిద్ధాంతకర్త వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌పై రూపొందిన ఈ బయోపిక్‌కి రణదీప్‌ హుడా దర్శకత్వం వహించారు. అతను టైటిల్‌ పాత్రను కూడా పోషించాడు. ఇది 22 మార్చి 2024న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు ఆనంద్‌ పండిట్‌. ఆయన 30 ఏండ్లకు పైగా బీజేపీ సభ్యుడిగా ఉన్నారు. ఒక ప్రముఖ వార్త కథనం ప్రకారం అతను మహారాష్ట్ర బీజేపీ కోశాధికారి.వివేక్‌ ఒబెరారు నటించిన ‘పీఎం నరేంద్ర మోడీ’ బయోపిక్‌కి కూడా పండిట్‌ నిర్మాత. ఆ చిత్రం కూడా 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే విడుదల కావటం గమనార్హం. పండిట్‌..మోడీకి సన్నిహితుడు అని కూడా తెలుస్తున్నది. 2013లో ఫెమా ఉల్లంఘన కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) పండిట్‌ను విచారిస్తున్నది. ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌ విడుదల చేసిన ఆఫ్‌షోర్‌ ఖాతాదారుల డేటాబేస్‌లో అతని పేరు కూడా ఉన్నది.
‘మై అటల్‌ హూ’
పండిట్‌తో పాటు ‘పీఎం మోడీ’, ‘సావర్కర్‌’ బయోపిక్‌లను నిర్మించిన వ్యక్తులలో ఒకరు సందీప్‌ సింగ్‌. పంకజ్‌ త్రిపాఠి నటించిన మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయిపై ఇటీవల నిర్మించిన ‘మై అటల్‌ హూ’ నిర్మాతలలో కూడా అతనొకడు. సందీప్‌ సింగ్‌కి బీజేపీతో సంబంధాలున్నాయని ఆప్‌ గతంలో ఆరోపించింది. 2020లో, సందీప్‌ సింగ్‌ మాదకద్రవ్యాల ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు, బీజేపీకి 53 కాల్స్‌ చేశారని కాంగ్రెస్‌ ఆరోపించింది.
రజాకార్‌
హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోకి డబ్‌ అయిన తెలుగు సినిమా ‘రజాకార్‌: ది సైలెంట్‌ జెనోసైడ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’. సమరవీర్‌ క్రియేషన్స్‌ పతాకంపై గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. నారాయణరెడ్డి తెలంగాణలో బీజేపీ కార్యనిర్వాహక కమిటీలో భాగం. అతను 2023 అసెంబ్లీ ఎన్నికలలో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పార్టీ అభ్యర్థి. కేవలం 9200 ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్‌ను కూడా కోల్పోయారు.
ప్రమాదం లేదా కుట్ర: గోద్రా
గుజరాత్‌లో 2002 గోద్రా రైలు మారణహౌమంపై రెండు సినిమాలు 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు విడుదల కావాల్సి ఉంది. విక్రాంత్‌ మాస్సే నటించిన ‘ది సబర్మతి రిపోర్ట్‌’ను ఏక్తా కపూర్‌ బాలాజీ ఫిల్మ్స్‌ నిర్మిస్తుండగా.. ఓం త్రినేత్ర ప్రొడక్షన్స్‌, ఆర్ట్‌వర్స్‌ స్టూడియోస్‌ నిర్మించిన చిత్రం ‘యాక్సిడెంట్‌ ఆర్‌ కాన్‌స్పిరసీ: గోద్రా’. ఇందులో రణ్‌వీర్‌ షోరే, మనోజ్‌ జోషి, హితు కనోడియా నటించారు. గుజరాతీ నటుడు కనోడియా 2017 నుంచి 2022 వరకు గుజరాత్‌లోని ఇదార్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అతని తండ్రి నరేష్‌ కనోడియా కూడా బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అతని మామ మహేష్‌ కనోడియా బీజేపీ ఎంపిగా ఉన్నారు. అనేక హిందీ, గుజరాతీ సినిమాలలో కూడా నటించిన మనోజ్‌ జోషి.. బీజేపీ ప్రచార ప్రకటనలలో కూడా కనిపించారు. గోద్రా సినిమా నిర్మాత బీజే పురోహిత్‌ కూడా బీజేపీ మద్దతుదారుడే కావటం గమనార్హం.
బెంగాల్‌ 1947 విభజన సమయంలో బెంగాల్‌లో జరిగిన హింసాకాండపై ఈ సినిమా తెరకెక్కింది. హింసాకాండ రెండు వైపులా జరిగినప్పటికీ, హిందువులపై ముస్లింల దురాగతాలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు ఈ సినిమాను నిర్మించారని విమర్శకులు అంటున్నారు. గతనెల 29న ఈ చిత్రం విడుదలైంది. ఆకాశాదిత్య లామా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కామ్‌ఫీడ్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించింది. లామా భారతీయ చిత్ర సాధన(బీసీఎస్‌) అనే సంస్థకు జాయింట్‌ సెక్రెటరీగా ఉన్నారు. 2016లో ఏర్పాటైన ఈ సంస్థ ఆరెస్సెస్‌కు అనుబంధంగా ఉన్నది. ప్రముఖ హిందూత్వ సిద్ధాంతకర్తగా పేరుగాంచిన బి.కె కుత్యాల ఈ సంస్థకు చైర్మెన్‌గా ఉన్నారు. బీసీఎస్‌ సలహా మండలిలో సుభాష్‌ ఘారు, హేమ మాలిని, మధుర్‌ భండార్కర్‌, వివేక్‌ అగ్నిహౌత్రి, ప్రియదర్శన్‌ వంటివారూ ఉన్నారు.
సినిమాలను ప్రమోట్‌ చేయటంలో బీజేపీ బిజీబిజీ
ఈ సినిమాలను ప్రమోట్‌ చేయడంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా చురుగ్గా పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వాల మద్దతుతో పన్ను మినహాయింపులు, ఉచిత స్క్రీనింగ్‌లు, సోషల్‌ మీడియా ప్రమోషన్‌లు వంటి ప్రమోషన్‌ స్ట్రాటజీని వీరు పాటించారు.
గతనెల 13న, ఏబీవీపీ అనుబంధ సంస్థ రాష్ట్రీయ కళా మంచ్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ కన్వెన్షన్‌ సెంటర్‌లో దర్శకుడు సుదీప్తో సేన్‌ ‘బస్తర్‌: ది నక్సల్‌ స్టోరీ’ ప్రదర్శనను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సేన్‌, నటి అదా శర్మ పాల్గొన్నారు. వీరిద్దరూ గతంలో ‘ది కేరళ స్టోరీ’ చిత్రంలో పని చేశారు. ఈ చిత్రం గతేడాది విడుదలైంది. కేరళ రాష్ట్రంలో ఇస్లామోఫోబియా టార్గెట్‌గా దీనిని రూపొందించారు. ఆ సమంయలో కేరళ స్టోరీ సినిమా చట్టపరమైన ఇబ్బందులనూ ఎదుర్కొన్నది. ఏబీవీపీ మార్చి 18న హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ క్యాంపస్‌లో కూడా ఈ సినిమా ప్రదర్శనను నిర్వహించింది.
‘ఆర్టికల్‌ 370’ : జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ ఇది. 2019లో మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన ఈ ఆర్టికల్‌ ఆధారంగా సినిమాను రూపొందించారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం తీసుకున్న మొదటి ప్రధాన నిర్ణయాల్లో ఇది ఒకటి. ఈ చిత్రాన్ని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా పలువురు రాజకీయ నాయకులు ప్రచారం చేశారు. వారు థియేటర్‌లలోకి వెళ్లి చూడాలని ప్రజలను కోరారు. బీజేపీ పాలిత ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లలో ఈ చిత్రం పన్ను రాయితీని పొందటం గమనార్హం. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఈ సినిమా ప్రదర్శనలకు బీజేపీకి చెందిన పలువురు నేతలు హాజరయ్యారు.
2019లో కూడా బీజేపీ కార్యకర్తలు ‘ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌’ సినిమా ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించారు. ఆ ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు ‘ఉరి’ విడుదలైంది. ఈ రెండు చిత్రాలకు ఆదిత్య ధర్‌ అనే వ్యక్తి నిర్మాత. 2024లో ‘మై అటల్‌ హూ’ మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీలో ప్రదర్శించబడింది. మహారాష్ట్ర బీజేపీ నేత నిరంజన్‌ వసంత్‌ దావ్‌ఖరే ఈ సినిమా ఉచిత ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
త్రిపురలో ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా సోదరుడు రటా సాహా అలాంటి స్క్రీనింగ్‌ను మరొకటి నిర్వహించారు. బీజేపీ కార్యకర్తలు భారీగా ప్రచారం చేసిన మరో చిత్రం ‘రజాకార్‌’. తెలంగాణలోని ప్రజలు సినిమాను చూడాలని కరీంనగర్‌ ఎంపీ బండి సంజరు కుమార్‌ విజ్ఞప్తి చేస్తూ.. వినోదపు పన్ను మినహాయించాలని రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డిని కోరారు. పలువురు బీజేపీ నేతలు ఈ సినిమా ప్రదర్శనలు నిర్వహించారు. ”
‘బెంగాల్‌ 1947’ చిత్రానికి బీజేపీ కంటే ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం ఉన్న వ్యక్తులే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త రతన్‌ శారదా, ఆర్‌ఎస్‌ఎస్‌ ఢిల్లీ మీడియా ఇన్‌ఛార్జ్‌ రాజీవ్‌ తులి ఇద్దరూ సినిమాను ప్రమోట్‌ చేస్తూ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. కాగా, పైన చర్చించిన చిత్రాలలో ‘బస్తర్‌’, ‘మై అటల్‌ హూ’, ‘సావర్కర్‌’లతో పాటు అత్యధిక చిత్రాలు ఘోరంగా విఫలమయ్యాయని సినీ విమర్శకులు అంటున్నారు.