ఆధునిక సాహితీ దిగ్గజం కాశీభట్ల

Kasibhatla is a giant of modern literatureతెలుగు సాహితీ వినీలాకాశంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆధునిక సాహితీదిగ్గజం కాశీభట్ల వేణుగోపాల్‌. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కర్నూలు నగరంలోని రెవెన్యూ కాలనీలోని స్వగృహంలో సోమవారం తుదిశ్వాస విడిచారు. 1974లో ఆంధ్రపత్రికలో ‘రంగనాయకి లేచిపోయింది’ అనే కథతో కాశీభట్ల తన సాహితీ ప్రస్థానం ప్రారంభించారు. ‘నేను-చీకటి’ అనే నవలతో వెలుగులోకి వచ్చిన ఆయన రచనలు ‘ఘోష’, ‘తపన’, ‘దిగంతం’, ‘మంచు-పువ్వు’, ‘తెరవని తలుపులు’, ‘అసత్యానికి ఆవల’, ‘సంగతం’ విమర్శకుల ప్రశంసలు పొందాయి. వినూత్న కథనాలు, కొత్తదనంతో కనిపించే పాత్రలు, ఆకట్టుకునే రచనా శైలి ఆయన స్వంతం. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆయన రచనలు నవ్య కెరటాల్లా ఉవ్వెత్తున ఎగిశాయి. వీరి రచనలు మానవ సంబంధాలను, మనుషుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న కోణాలను, మనుషుల మధ్య ఉన్న అంతరాలను సునిశితంగా పరిశీలించి రాసేవారు. సుమారు 12కు పైగా నవలలు, వందకు పైగా కథలు రాశారు.