తగ్గేదేలే అంటున్న కసిరెడ్డి..!

Kasireddy says it will decrease..!– ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ బుజ్జగించే ప్రయత్నం
– నాన్నతో మాట్లాడతానన్న మంత్రి
– కార్యకర్తల ఒత్తిడి ఉందన్న ఎమ్మెల్సీ
– 29న కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు
నవతెలంగాణ -కల్వకుర్తి
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కారు దిగి చెయ్యి అందుకునేందుకు సిద్ధమైనట్టు ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ వైఖరితోపాటు, పార్టీలో కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై అధిష్టానానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్ల విసిగి వేసారి పోయిన ఆయన చివరకు బీఆర్‌ఎస్‌ను వీడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయన పార్టీ మారుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రగతిభవన్‌ వర్గాలు స్పందించాయి. స్వయంగా మంత్రి కేటీఆర్‌ కసిరెడ్డి నారాయణరెడ్డికి ఫోన్‌ చేసి పిలిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో చర్చలు జరిపారు. ”మూడ్రోజుల సమయం ఇవ్వండి.. అభ్యర్థి మార్పు విషయంలో నాన్నగారి(సీఎం కేసీఆర్‌)తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం.. పార్టీ మారొద్దు.. మీకు భవిష్యత్తు ఉంటుంది” అని ఎమ్మెల్సీకి మంత్రి నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. తనపై కార్యకర్తల ఒత్తిడి తీవ్రంగా ఉందని, గతంలో పార్టీ టికెట్‌ ఇస్తామన్న హామీ విషయాన్ని ఈ సందర్భంగా కసిరెడ్డి గుర్తుచేసినట్టు సమాచారం. సర్వే ఆధారంగా టికెట్లు కేటాయిస్తామని చెప్పి.. ఇప్పుడు సర్వేలో అట్టడుగున ఉన్న వ్యక్తికి పార్టీ టికెట్‌ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించినట్టు సమాచారం. నియోజకవర్గంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను ఒకసారి తెలుసుకోవాలని మంత్రిని కోరారు. పార్టీలో సముచిత స్థానం లేదని, అలాంటప్పుడు ఎలా కొనసాగాలి అంటూ మంత్రికి వివరించే ప్రయత్నం చేశారు.
ఐదు సంవత్సరాలుగా ఎంతో ఓపికతో ఉన్నానని, తన మద్దతుదారులకు, కార్యకర్తలకు పార్టీలో ఎమ్మెల్యే తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారని తెలిసింది. నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు దళిత బంధు, గృహలక్ష్మి, బీసీ బందు తదితర పథకాలలో ఎమ్మెల్యే చెప్పిన వ్యక్తులకే అందజేస్తున్నారని అలాంటప్పుడు తాను పార్టీలో ఉండి ఏమి ఉపయోగం లేదని మంత్రితో అన్నట్టు సమాచారం. కార్యకర్తల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్టు వినిపిప్తోంది. ‘అన్నా తొందర పడొద్దు.. కూర్చొని మాట్లాడదాం” అంటూ మంత్రి కేటీఆర్‌ సర్దిజెప్పే ప్రయత్నం చేయగా.. ఎమ్మెల్సీ మాత్రం తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్టు ప్రచారం సాగుతోంది.
ఈనెల 29న కాంగ్రెస్‌లోకి..
బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇప్పటికే పార్టీ అధినేత రాహుల్‌ గాంధీతో చర్చించిన ఆయన ఈనెల 29న కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. రాబోయే ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీంతో ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక కాంగ్రెస్‌ నాయకులు నారాయణరెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. ఆయన పార్టీలోకి వస్తే కల్వకుర్తి గడ్డపై కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమన్న ధీమాతో ఉన్నారు.