– ఉత్తమ ఫలితాలకు ప్రత్యేక తరగతులు
– పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత
– పౌష్టికాహారం.. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ
– పాఠశాలలు, కళాశాలల్లో లక్ష్యానికి మించి ప్రవేశాలు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
అనాథలు, నిరుపేదలు, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో బాలిక విద్యకు కస్తూరిబా పాఠశాలలు నిలయంగా మారాయి.విద్యార్థినులు చదువుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో కస్తూర్బా విద్యాలయాలను నిర్వహిస్తోంది. ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యా బోధనను ప్రభుత్వం పగడ్బంది గా నిర్వహిస్తోంది..ఈ విద్యాలయాలు నాణ్యమైన విద్యకు..,వినయనికి.. క్రమశిక్షణకు.. చిరునామాగా మారాయి. అధునాతన తరగతి గదులు, ఉచిత విద్య, భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. ఏటా పది, ఇంటర్మీడియట్లో మెరుగైన ఫలితాలు సాధిస్తుండటంతో పేద బాలికలను వీటిలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలలతో పోల్చితే వీటిలోనే ఉత్తమ బోధన అందుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చదువుతో పాటు వివిధ రకాల కార్యక్ర మాలు నిర్వహిస్తూ బాలికలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు. గత ఏడాది పదవ తరగతి లో 100 శాతం ఫలితాలు సాధించారు.ప్రస్తుత 2024-25 విద్యా సంవత్సరంలో కస్తూర్బా పాఠశాలలు, కళాశాలల్లో లక్ష్యానికి మించి ప్రవేశాలు ఉండటం గమనార్హం. నేటికీ ప్రవేశాల సంఖ్య 8100 పైనే జరిగింది. ఈ ప్రవేశాల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుందని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
విద్యతో పాటు క్రీడల్లో రాణింపు..
జిల్లాలో 27 కస్తూర్బా విద్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిలో 14 చోట్ల జూనియర్ కళాశాలలు నిర్వహిస్తున్నారు. కస్తూర్బాల్లో నిర్వహణకు ప్రత్యేకాధికారులు, బోధనకు సీఆర్టీలు(క్లస్టర్ రిసోర్స్ టీచర్స్) తాత్కాలిక పద్దతిన పనిచేస్తున్నారు. మెరుగైన విద్యతో పాటు ఉత్తమ ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో ఏటా అధికారులు లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. సీఆర్టీలు బాలికలకు అర్థమయేలా ప్రయోగాత్మక బోధనకు ప్రాధాన్యమిస్తున్నారు. బాలికలకు గుణాత్మక విద్య అందించడంతో పాటు వసతి సదుపాయం కల్పిస్తున్నారు. రెగ్యు లర్ తరగతులతో పాటు ఉపాధ్యాయినుల పర్యవేక్షణలో అధ్యయన తరగతులు నిర్వ హిస్తున్నారు. ఆరోగ్య రక్షణకు ప్రత్యేకంగా ఏఎన్ఎంలను నియమించారు. చదువుతో పాటు కరాటే, క్రీడలు, సాంస్కృ తిక కార్యక్రమాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. కస్తూర్భాల విద్యార్థినులు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో పతకాలు సాధిస్తూ… ప్రత్యేకతను చాటుతున్నారు. వార్షిక పరీక్షలు ముగిసిన అనం తరం ఇంటర్మీడియట్ విద్యార్థినులు ఇంజినీరింగ్, మెడిసిన్ సీట్లు సాధించేలా ఈఏపీ సెట్, నీట్ వంటి వాటిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వీటితో పాటు జీవన నైపుణ్యాలు పెంపొందించేలా అవగాహన కల్పిస్తున్నారు.
సీట్ల సంఖ్యను పెంచితే బాగుంటుంది: సరిత (జీసీడీఓ) జిల్లా బాలికల అభివృద్ధి అధికారిణి, నల్గొండ
కస్తూర్భాల్లో చదివే విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వీరికి చదువుతో పాటు జీవన నైపుణ్యాలు, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం తదితర వాటిపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఏడాది ఉత్తమ ఫలితాలు వస్తుండడంతో ఎక్కువ మంది చేరేందుకు ముందుకు వస్తున్నారు. ప్రతి తరగతిలో 40 మంది విద్యార్థులు ఉంటారు. సీట్ల సంఖ్యను పెంచి వాటి సంఖ్యకు అనుగుణంగా బిల్డింగ్ లను, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తే విద్యార్థినిలకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.