నవతెలంగాణ – హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. శంభీపూర్ రాజుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి జరగకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తాను ఆంధ్రా సెటిలర్స్‌ను దూషించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అరికెపూడి గాంధీనే తన పట్ల ఇష్టారీతిగా మాట్లాడారని, పైగా తన వ్యాఖ్యలను వక్రీకరించారని మండిపడ్డారు. తానేదో ఆంధ్రా వాళ్లను తిట్టినట్లుగా ప్రచారం చేయడం దారుణమన్నారు. తమ ఇద్దరి మధ్య జరుగుతోంది కేవలం వ్యక్తిగతమే అన్నారు. సెటిలర్స్ కాలికి ముల్లు గుచ్చుకుంటే నోటితో తీస్తానన్న నాయకుడు తమ అధినేత కేసీఆర్ అని గుర్తు చేశారు. చిల్లర రాజకీయం కోసం ఆంధ్రా, తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి హైదరాబాద్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారన్నారు.