యాభైయారక్షరాల్లో “అ”కార”మ”కారాలంటే నాకెంతో ఇష్టం- ఎంత పుణ్యం చేసుకున్నాయో కానీ- అమ్మ పదంలో ఒదిగి పవిత్రమయ్యాయి. అమ్మ ప్రేమను, అమ్మ భాష ఔన్నత్యాన్ని తన కవితల్లో మనకు అందించిన కవి కనపర్తి రామచంద్రా చార్యులు విశ్వభాషలందు తెలుగు వెలగాలని తపించిన మాతృ భాష ప్రేమికుడు రామచంద్రాచార్యులు. “వచన కవిత / నా ఉద్యమం /వచన కవిత / నా ఉద్యోగం” అని నినదిస్తు కవిత్వమే ధ్యాసగా- శ్వాసగా జీవించిన కవి కనపర్తి.
తెలంగాణ తల్లి ఒడిలో 1947 ఆగస్టు 8న భూలక్ష్మి- రంగన్న దంపతులకు జన్మించారు. ఆయనకు రెండేండ్ల ప్రాయంలోనే తెలంగాణ సాయుధ పోరాటంలో వీర మరణం పొందారు. తెలుగు భాషా పండితురాలైన తల్లి భూలక్ష్మి అన్ని తానై విద్యా బుద్ధులతో తీర్చిదిద్ది మంచి కవిని సమాజానికి అందించారు.
“బయోడేటా” అన్న కవితలో “నాన్న అగ్గిపుల్ల వెలిగించి వెళ్ళి పోయాడు/ అమ్మ చమురు లాంటిది ఇంకా నాకోసం లోపలే ఇగిరిపోతుంది” అని తన గురించి వ్రాసుకున్నారు. సిద్దిపేటలోని తోరణాల వీరి ప్రాథమిక విద్య పూర్తి అయ్యింది. నా కవితా ప్రస్థానానికి పచ్చతోరణం కట్టింది తోరణాల గ్రామం అంటారు. పదవ తరగతి చదువుతున్న రోజుల్లో ఆశువుగా చెప్పిన కనపర్తి తొలి కవిత.” మడిచింది నాలో అజ్ఞాన ప్లవంగం/ చెబుతావా సరస్వతీ/ నీ కవిత కీలకం”. ఆంధ్ర సారస్వత పరిషత్తులో బి. ఓ.ఎల్ చదివేటప్పుడు 1971 మార్చి 17న కమలను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు నాగరాజు, విద్యా ప్రకాశ్ ,శరత్.
జోగిపేటలో పశుసంవర్ధక శాఖలో కొంతకాలం ఉద్యోగం చేసినా, వృత్తికి ప్రవృత్తికి పొంతన కుదరక కొద్ది కాలానికే ఉద్యోగానికి రాజీనామా చేశారు. కడవరకు సాహిత్యానికే అంకితమయ్యారు. మధ్యతరగతి సామాన్యునికి ఉద్యోగం లేకపోతే ఎదురయ్యే కష్టాలన్నీ ఎదుర్కొన్నారు. తిక్కన, శ్రీనాథుడు, పోతన, ఆధునిక కవులైన శ్రీశ్రీ, దాశరథి, కుందుర్తి, కాళోజీ ప్రభావం కనపర్తి మీద ఎంత గానో ఉంది.
“శ్రీకారానికి ప్రతీకా ఓంకారానికి టీకా ఒక సిరా చుక్క-
నిద్రాముద్రిత జనచైతన్యానికి వేగుచుక్క- బీడు వారిన మెదడు భూముల్లో వాన చుక్క”- అంటూ “సిరా చుక్క” గురించి రాసు కున్నారు. ప్రక్రియ కన్నా వస్తువు ముఖ్యం. ఏ ఛందస్సులో నడిచిందన్నది కాదు ముఖ్యం. ఏ చందంగా సాగుతుందన్నదే ప్రధానం అంటారు. వీరి కవితల్లో భావలయ గలగలలు, పలుకు బడులు, పద బంధాలు కోకొల్లలుగా ఉంటాయి. “పలికేడిది వచన కవిత్వమట పలికెడు వాడు రామచంద్రుండట” అంటూ పోతనను గుర్తుచేసుకుంటారు. ప్రకృతి ప్రేమికుడు రవీంద్రుని గీతాంజలిని హృదయాంజలి పేరుతో స్వేచ్ఛానువాదం చేశారు.
కబీర్ – తులసీదాస్ దోహాలను వచన కవితలుగా, చిన్న- చిన్న కథలుగా మనకందించారు. అనేక అనువాదాలు చేసారు.
కనపర్తి కవనంలో చోటు చేసుకొని పువ్వులు లేవన్న అతిశయోక్తి కాదు. మల్లే,గులాబీ, తంగేడు, గునుగు, గడ్డి పువ్వు ఇట్లా పూల కవితలు అనేకం “పూజా పుష్పాలు” అనే కవితా సంపుటిని తన మాతృమూర్తి లక్ష్మమ్మకు అంకితం ఇచ్చారు. కావ్యాన్ని అంకితం తీసుకున్న తల్లి ఆనందానికి అవధులు లేవు “పట్టి ఇచ్చేది కాదురా కవిత్వం పుట్టుకొచ్చేది బిడ్డా దాని తత్వం” అంటూ కవికి జన్మనిచ్చినందుకు నా జన్మ ధన్యం అయ్యిందని పొంగి పోయారు.
అందులోని –ఓ కవిత “మల్లే నా చెల్లే /ప్రాస కోసం కాదీ పిలుపు/ ఎన్నెన్నో పూర్వ జన్మల వాసనల్ని/ త్రవ్వి పోస్తుంది/ నీ వలపు…/ దైవానికి నీ వంటే ఎంతో ప్రేమ / నిన్ను బురదలో దించలేదు…/ ముళ్ల మీద ఉంచ లేదు” అంటారు కవి.
వీరి కవిత్వంలో మనకు ప్రస్ఫుటంగా కనిపించేవి “భావ చిత్రాలు”. తను పొందిన అనుభూతి శ్రోతలకు తన రచనల్లో అందించడమే భావచిత్రం. పూలతో దైవాన్ని పూజించడం కాదు- పువ్వులనే దైవంగా పూజించడం తెలంగాణ విశిష్ట సంస్కృతి. ఇది ప్రకృతి ఆరాధన. బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల పండుగ. బతకమ్మలో తంగేడు పూలదే అగ్రతాంబులం.
“పండు ముత్తైదువలు పసుపు ముద్దలార పెట్టినట్లు/
ఎవరో పసుపు పారాణితో/ నవ వధువులు నడిచి వెళ్లినట్లు/ ఎవరో పచ్చి బాలింతరాలు తెలుగు ఆచారాన్ని పాటిస్తూ/
ఈ తోవలో పోయినట్లు- ఏ స్వర్ణకారుడో మంగళసూత్రాల కోసం పసిడి రేకులు కత్తిరించి పోసినట్లు ఎంత బాగున్నాయి / ఈ బంగారు పూలు పరకాయ ప్రవేశం నాకోస్తే ఒక్క గడియైనా చాలు /నేను తంగేడు పువ్వునై పోతాను” అంటూ కవి
పూల మీదున్న మమకారాన్ని చాటు కున్నారు. కవిత్వం అంటే ఉత్తమ సంస్కారాల సమ్మేళనం మానవీయకోణాల ఆవిష్కరణ అంతేకానీ అస్పష్టమైన వాక్య నిర్మాణం కాదు అంటారు కనపర్తి . కనపర్తి తన కవిత్వంలో అన్ని వృత్తుల వారిని పలకరించారు. సుప్రసిద్ధ చిత్రకారులు. కీ.శే కాపు రాజయ్య”రిస్క్ లైఫ్” చిత్రానికి కనపర్తి “ఆకాశానికి నిచ్చెన” పేరుతో చక్కని కవిత రాశారు.
“ఆకాశానికి నిచ్చెన వేస్తావు/ అమృత భాండా న్ని అవనికి దింపుతావు/ ఓ శ్రమైక జీవన సౌందర్యరాశి / ఈ చెట్టుకు నీకు ఏనాటిదో ఈ బంధం-/చెట్టు కొట్టకొనలో పిట్టలా నీవుంటే-
నీ ఇల్లాలి తాడు గట్టిదనం / నా కలానికి ధైర్యాన్ని నేర్పుతుంది-
ఓ గీత కార్మికుడా నేను గీతాల కార్మికున్ని అంటారు.
అనుభూతి వైవిధ్యం లేకపోతే అసలు జీవితంలో ఆనందమే ఉండదు. చూసే మనసు ఉండాలే కాని సమాజంలోని అన్ని అంశాలు కవితా వస్తువులే అంటారు కనపర్తి. మసిగుడ్డ, అలుకు పిడుస ,చెత్తబుట్ట గాజు పెంకు, గుండు సూది అన్నింటిలో మానవీయ కోణాన్ని దర్శిస్తారు ఈ కవి. కాలికి గాజు ముక్క కొచ్చుకొని రక్తసిక్తమైతే ఆ గాయాన్ని అందమైన గేయంగా మార్చు కున్నారు. “ఇది ఏ తల్లి కర కంకణమై మెరిసిందో / ఏ చెల్లి హస్త భూషణమై విరిసిందో / ఎప్పుడు ఏ ప్రణయ కలహంలో నలిగి/ ఏ ప్రళయ సమరంలో నేల రాలిందో-నారీమణుల సౌభాగ్య చిహ్నమైన తనను రోడ్డుపై పారేశారన్న కోపంతో నా కాలికి గుచ్చుకుంది. నా కలాన్ని రెచ్చగొట్టింది అంటారు.”వివాహమంటే నవ జీవన కావ్యా విష్కరణం / రెండు హృదయాల ఏకీకరణం”, “పరిణయం ఒక ప్రబంధం విడిపోని అక్షర బంధం భార్యాభర్తలే నాయికా నాయకులు సంసారం
ఓ శృంగార చంప కావ్యం
ఎన్ని యుగాలైనా అది నవ్యాతి నవ్యం .
భార్య పద్యమైతే భర్త గద్యం
సరసులకది హృద్యాతిహృద్యం. మనిషి అక్షరమైతే–?అనే కవితా ఖండికలో అక్షరం గొప్ప తనం వివరించారు.
అక్షరానికి మరో పేరు వర్ణం
వర్ణానికి “వర్ణభేదం లేదు
ఇంకో “వర్ణం”తో కలిసిపోతుంది అక్షరాల్లో వర్గాలు ఉన్నాయి
కానీ వర్గ విభేదాలు లేవు
అక్షరం ఏమీ లేని సున్నాని తన పక్కన చేర్చు కుంటుంది
“సంధి” కోసం తన రూపాన్ని త్యాగం చేస్తుంది.
అక్షరం- “అక్షరం”!! అక్షరాన్ని మనిషి సృష్టించాడు
తాను క్షరమై పోతున్నాడు
కాని -మనిషీ అక్షరమైతే–? అక్షరానికి కున్న నిస్వార్ధ గుణం, త్యాగనిరతి మనిషి కుంటే ఎంత బాగుండు అంటారు కవి.
కనపర్తికి వివిధ సాహితీ సంస్థలతో అనుబంధం ఉండేది వీరి అక్షర శిల్పాలు కావ్యానికి వేముగంటి పురస్కారం, వెలుతురు పూలు కావ్యానికి సాహిత్య పరిషత్తు అవార్డు ,1990 సంవత్సరంలో వచన కవితా ప్రవీణ బిరుదు పొందారు.
వీరి రచన “కోయిలా -ఓ కోయిల” అనే కవిత ఖండికను ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
వీరి రచనలపై డాక్టర్ బి.జయ రాములు మార్గ దర్శకత్వంలో(గైడ్) “కనపర్తి-కవిత్వం సమగ్ర పరిశీలన” అనే అంశాన్ని పరిశోధనకు తీసుకొని 2009లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ (డాక్టర్ దాసోజు పద్మావతి ) అందుకున్నాను. కనపర్తి 50 సంవత్సరాల కవితా ప్రస్థానంలో వారు స్పృశించని కవిత వస్తువు లేదు. వీరి రచనలపై బహు ముఖీనంగా పరిశోధన జరగవలసి ఉంది. కనపర్తి 2011 జూన్ 16న సిద్దిపేటలో ఇంటిలో కాలు జారిపడి కొద్ది కాలానికే కన్నుమూశారు. వీరు మొత్తం 45 పుస్తకాలు వెలువరించారు.
ఆముద్రిత రచనలు అనేకం. వీరి రచనలలో కొన్ని —
కవితా వ్యాసంగమే
ఉద్యోగంగా “ఆలోచన వీచిక”లతో మొదలుపెట్టి “గీతం నా సంకేతం” గా నిలిచి “అక్షర శిల్పాలు చెక్కి” “రాళ్లలో రాగాలు” పలికించి “వెలుతురు పూలు” పూయించి “రాళ్ళు ముళ్ళు” ఏరుకొని “పిట్టగూడు” కట్టి “నది సుందరి”ని పలకరించి “కళ్యాణ రాగాలు” పలికించి “మౌన కోకిల”ను పలకరించి “మనిషి అక్షరమైతే” బాగుండునని “హృదయం” “ఆవిష్కారం” గావించి “చినుకులు”లో తడిచి “నగరంలో వెన్నెల”లో “వృక్ష దీపం” వెలిగించి “సీతా కోకచిలు కలు” “శుభోదయం” పలుకగా “కర్పూర హారతి” వెలిగించి “దేవుడికి ఉత్తరం” రాసి “రసరేఖలు” మీటుతూ “వసంతగీతం” ఆలపిస్తూ “తెల్ల పావురం” తన “శాంతి సందేశం”గా ఎగురవేసి నింగికేగిన “అక్షర శిల్పి” అజరా మరుడు స్నేహశీలి కనపర్తి రామచంద్రాచార్యులు.
తెలుగు అధ్యాపకులు