ఈ కవిత రాసింది ఎవరో కాదు, ‘కవి రాజు’. అసలు పేరు పెన్మత్స సత్యనారాయణ రాజు. ‘కవిరాజు’ బిరుదం వారికి ఆప్యాయంగా ఒసగింది. కవిరాజు పదఅల్లికల్లోని అల్లసాని జిగిబిలకు, ప్రకృతి, భావుకతల సంగమానికి ముగ్ధుడై, రాజుగారి ‘సూర్య కఠారి’ (1994) కవితా సంపుటికి ముందు మాట కూడా రాశారు శేషేంద్రశర్మ. రాయటమే కాదు, సౌమ్యుడైన రాజు ‘సూర్య కఠారి’లో మార్క్సిజంను దర్శించాడు శేషేంద్రశర్మ. అంతేగాదు, సమాజంలోని ‘హింస’ను ప్రతిఘటించేందుకు మార్క్స్ ‘ప్రతిహింస’ అనివార్యం అన్నాడే కానీ, ‘మార్క్స్’ సౌమ్యుడని, అహింసావాది అని ప్రతిపాదించాడు శేషేంద్ర. సమాజ చలనగతుల్లో, పదార్థ గతితార్కికవాద రీతులలో ఇది ‘అనివార్య పరిణామం’ అని గూడా శేషేంద్ర వివరించాడు. వీరి కవితల్లో వాకాటిగారు రవీంద్రుడిని, దేవులపల్లి కృష్ణ శాస్త్రిని దర్శిస్తే, వాడ్రేవు చిన వీరభద్రుడు శ్రీశ్రీ ‘సర్రియలిజం’ దర్శించారు. ఆ ‘సర్రియలిజం’లో రెండు మార్గాలున్నాయని, ఒకటి ‘లక్ష్యం కల సర్రియలిజం’ అని, రెండవది ‘లక్ష్యం లేని సర్రియలిజం’ అని వివరిస్తూ, శ్రీశ్రీ లాగానే ‘కవిరాజు’ రెండు పద్ధతులను పాటించాడని వివరించారు వాడ్రేవు చిన వీరభద్రుడు. ఇలా బహుముఖీయమై, బహుకోణాల్లో అభివ్యక్తమయ్యేదే కవిరాజు కవితా ఝరి.
కవి రాజు ‘సూర్య’ శబ్దానికి తన కవితలలో విస్తారమైన నిర్వచనం కలిపించారు. వారు వెలువరించిన కవితా సంపుటాలలో ‘సూర్య రథం’ (1983), సూర్య ధ్వజం (1989), సూర్య కఠారి (1994), సూర్యాంశువులు (1996), సూర్య పుత్రి (2009), సూర్యోదయం (2011), సూర్య పర్వాలు (2013) వరకూ ఏడు సంపుటాలు ఒక్కొటి సూర్యుడు పూంచిన ఒక్కో రధంగా భావించవచ్చు. వీటిని సూర్యుడి ఏడు వర్ణాలుగా కూడా అనుకోవచ్చు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ‘కీర్తి పురస్కారం’ అందుకొన్న ‘కవిరాజు’కు పలు సాంస్కృతిక సాహిత్య సంస్థలు పలు బిరుదులు ఇచ్చాయి.
అనువాదశ్రీ రంగయ్య గారు హిందీలోకి వీరి ‘సూర్య పుత్రి’ (2009)ని, ‘సూర్య కఠారి’ (1994)ని, సూర్యోదయం (2011) ని అనువదించారు 2013 లో. వీరి ‘సూర్య కఠారి’ (1994) కవితా సంపుటిని వడలి మందేశ్వరరావు ఆంగ్లంలో అనువాదం చేశారు.
కవిరాజు మే 8, 1944 లో కాకరపర్రు గ్రామం (తణుకు)లో జన్మించారు. ప్రీ యూనివర్సిటీ కంటే ఎక్కువ చదువుకోను వీలు కాని కుటుంబ పరిస్థితుల్లో, పొట్టపట్టుకొని హైదరాబాద్ చేరారు ఉద్యోగం వేటలో. తొలుత బయోలాజికల్ ఇవాన్స్‌లో ఉద్యోగ జీవితం ఆరంభించిన రాజు, 1964 లో అప్పుడే కొత్తగా పెట్టిన సింథటిక్ డ్రగ్స్ ప్లాంట్‌లో (దీన్నే తరువాత కాలంలో ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ గా మార్చారు) చేరారు. దాదాపు 36 ఏళ్ళు అక్కడే పనిచేసి ఆయన హృది పలికించిన కవితా ఝురికి 2000 లలో రిటైర్ అయ్యారు. ఆయన చదివిన చదువుకు, చేసిన ఉద్యోగానికీ ఎంతమాత్రం సంబంధం లేదు.
అయినా ఆయన పలికిన భావ, రసవిస్ఫోటాలు అనితర సాధ్యం. ‘కొంపలు తగలబెడుతోంది/ కుటిల రాక్షస రూపం/ అంతం చేయి దాని ప్రతాపం/ ఇదిగో దీపం/ ఇది భావాగ్ని చాపం’ అంటారు కవిరాజు ‘సూర్య కఠారి’ లో. ‘ఆయన కవితా ప్రయాణంలో ‘బింబాల జల్లులు’ పడతాయి. ‘ప్రతీకల గాలులు’ వీస్తుంటాయి’ – అంటారు వాకాటి పాండురంగా రావుగారు. ఇంకో చోటు’నా నెత్తురునే తాగుతూ దప్పిక తీరక తపించి పోతున్నాను/ ఏ ఉదయకిరణం అంచు మీదగానో ఒక అమృతబిందువు నా గొంతులోకి జార్చు’ అని అంటారు (సూర్య కఠారిలో).
వారి కవితా వాక్యాలు ఎవరినో సంబోధిస్తున్నట్టు ఉంటాయి. ఆ ఎవరన్నది పాఠకుడి జన్మ ససంస్కారాన్ని బట్టి బహిర్గత మవుతుంది. ఒక్కోసారి ఆత్మాశ్రయమ్ అయినట్లు ద్యోతకమవుతుంది. కానీ, రూఢిగా ఇది ‘ఆత్మా శ్రయం’ అని చెప్పలేము. ఎందుకంటే అక్కడో మెలిక వేస్తారు. ఆ మెలికలో ఒక అభ్యుదయ వాదం, ఓ ఆశావాదం, ఒక ప్రకతి చైతన్యం, ఒక జీవన సత్యం తొంగిచూస్తుంది.
వాక్యాలలో పదాల పొదుగు రవీంద్రుడి ‘గీతాంజలి’ గేయాల్లా మదువుగా సాగిపోతాయి. అలలులేని నిశ్చల నదీ ప్రవాహంపై మృదువుగా సాగే పడవ ప్రయాణంలాగ ఉంటుంది. అలాంటి వాక్యాలు అలవోకగా వారి నుంచి జాలు వారుతాయి. ఆ విధమైన వాక్య నిర్మాణం కవిరాజు గారి ‘సంతకం’ లా, వారికే ప్రత్యేకమైన డి.ఎన్.ఏ గా మరొకరికి అసాధ్యంగా ఉంటుంది. ఠాగోర్ బెంగాలీ ‘గీతాంజలి’లోని గీతాలను తెలుగులోకి అనువదించిన బెల్లంకొండ రామదాసు అనువాదాలలోని పదభంగిమలను గమనిస్తే, వాటికంటే సహజమై భావోన్నతమై ఒప్పారుతాయి. ఈ రసోస్ఫోటనలు. ‘జన్మనిచ్చి అమ్మ నన్ను సూర్యుడికి ఒప్పగించి పోయింది/ ఆలనా పాలన చూస్తుండమని’ అని సూర్యుడిని తన తండ్రిగా భావించిన కర్ణుడు ‘కవిరాజు’. ఇక ఠాగోర్ ఈ భావశకలాన్ని ఇలా పలికాడు. ‘నీవు నన్ను అంతగా సృష్టించావు/ అది నీ విలాసం/ తాకితే చాలు పగిలిపోయే యీ పాత్రికను (గీతాంజలి 1, మొదటి పంక్తి). ఇలా సూక్ష్మంగా తులనాత్మక పరిశీలన చేస్తే ఠాగోర్ భావశ కాలాలు, కవిరాజు రసోస్ఫోటనాలు సమాంతరంగానే సాగినట్టు సులువుగా తెలుస్తుంది.
కవిరాజు తన కవితాలోకంలో ఎవ్వరూ గమనించనిదాన్ని ఇట్టే పట్టేశాడు. మన దేవుళ్ళు, మతం ఎదో కోల్పోయి వెతుక్కొంటూ అని. ఏమిటది? ‘కొల్లలుగా దేవుళ్ళని కానీ వీధి కొక్కరుగా విసిరిపొయిన ఆ ఋషులకేం తెలుసు?/ అమృతం ప్రవహించవలసిన గడ్డ మీద నెత్తుటేరులు పారుతున్నాయని ప్రకృతిని విస్మరించిన మనిషి/ వికృత రూపమెత్తి శిలలతో శివాలుతోక్కుతున్నాడని’ (సూర్య పర్వాలు 2013) అర్ధమయిందా? దేవుళ్ళ కోసం మనుషులు కొట్టుకోకుండా చూసే ధర్మాన్ని మన దేవుళ్ళు, మతం కోల్పోయినై! అని. ఎంత సున్నితంగా చెప్పారు దేవుళ్ళు, మతాలూ ఎలా దిగజారిపోయాయోనన్న విషయం
‘నిన్ను నేను తలచుకొన్నాను, నన్ను నీలా మార్చుకొన్నానుుఅన్న ‘థీమ్’ తో రాసిన పద్యాలు ‘నందనందనం’ లో కనిపిస్తాయి (2016). ఠాగోర్ ‘గీతాంజలి’ లో ఎక్కువగా ఈ ఛాయలున్న గేయాలు కనిపిస్తాయి. ఠాగోర్ ప్రకృతి కవే గాదు, కృషి వలుల స్వేదంలో కూడా ‘ఈశ్వరుడిని’ దర్శించిన విశ్వమానవుడు. అదే రీతిలో సాగుతాయి ‘నందనందనం’ (2016) కవితాసంపుటిలోని కవితలు. ‘విహారం పేరుతో వనమంతా కలియతిరిగి చక్కా వచ్చి/ ఈ గట్టుమీద విలాసంగా పాడుకొంటూ కూర్చొన్నావా నాన్నా!/ నిన్ను అనుసరిస్తూ వచ్చి భ్రమరాలు/, నీ చుట్టూ ముసురుకొని తిరిగి అటు చూడటం లేదని వనాలు బెంగ పెట్టుకున్నాయి తెలుసా-/ ఎక్కడ వక్షసంపద నిర్వీర్యం అయిపోతుందోనని/.
కవిరాజు కడపటి సంవత్సరంలో రెండు సంపుటాలను వెలువరించారు . ఒకటి ‘కలహారం’ (2022), రెండవది ‘నీ రూపం’ (2022). కలహారం వచ్చిన కలలలోని కవితలు. ఇటువంటి కవితానుభవం గతంలో ఏ కవులకు వచ్చినట్టు దాఖలాలు లేవు. కానీ, ‘సూర్య కఠారి’ సంపుటికి ముందు నుంచే కవిరాజు తన కవితలను తొలుత కలలలో గాంచి, వాటిని మెలుకువ వచ్చాక గ్రంధస్తం చేసేవాడినని చెబుతుండేవారు. ఎందరో గొప్ప గొప్ప విమర్శకులు కవిరాజు కవితాలపై వ్యాఖ్యానించినా ఎవ్వరూ ఈ విషయం పై దృష్టి సారించలేదు. అందుకేనేమో కవిరాజు ఈ నేపథ్యం ఉన్న కవితా సంపుటాలనే వెలుగులోకి తెచ్చారు. నిజానికి కలలో వచ్చినవైనా పుస్తకం రూపంలో చూసినప్పుడు చదువరులకు వీటిలో విషయమేమి వింతగా కనిపించదు. కానీ, ఇవి కొంత తాత్వికతతో, కొన్ని అభ్యుదయ వాదంతో ఉండటంతో పాఠకుడు తిరిగి తొలుత చెప్పినట్టే ‘ఆత్మాశ్రయవాదం’ కిదకు వస్తాయా, రావో తేల్చుకోలేని డోలాయమానంలో పడతాడు. భావశకలాలో గాని, రసోస్ఫోటనంలో గాని ‘సూర్య కఠారి’ కవితలకు, వీటికి మధ్య పెద్ద తేడా యేమి ఉండదు.
ఈ రకంగా ప్రాకృతికమైన మానవ హృదయం కలలో గాంచినది ‘నిజమై’ నిలవటం రసాయనశాస్త్ర పరిశోధనలలో జరిగింది. ‘బెంజీన్’ అనే సేంద్రియ రసాయనం నిర్మాణం కనుగొనటం 19వ శతాబ్దంలో చాలా క్లిష్టమైన సమస్యగా ఉండేది. అప్పట్లో ఆగస్టు కేకులీ (1829-1896) అనే జర్మనీ రసాయన శాస్త్రవేత్త ఈ ‘బెంజీన్’ రసాయన అణువు నిర్మాణంపై విస్తృతంగా పరిశోధన చేస్తుండేవారు. ఎన్ని రకాలుగా ఒక నిర్మాణం ప్రతిపాదించి దాని రసాయన ధర్మాలు వివరించాలని చూసినా సంతృప్తి కరంగా దాని నిర్మాణం ఉండేది కాదు. ఈ పరిస్థితుల్లో ఒకసారి ప్రయోగ శాలలోనే నిద్రపోయిన కేకులీ కి ఆ ‘బెంజీన్’ నిర్మాణం ‘తల, తోక ఒకదానితో ఒకటి కలిసి వలయంలా చుట్టుకుపోయిన సర్పం’ లా కనిపించింది. వెంటనే మెలుకువ వచ్చిన కేకులి ‘బెంజీన్’ నిర్మాణం తాను కనుక్కోగలిగినట్టు ప్రకటించి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాడు. ఇలాంటిదే డి.ఎన్.ఏ నిర్మాణ వివరణ విషయంలోనూ జరిగింది వాట్సన్ (1928), క్రీక్ (1916-2004) లకు. అయితే కల వచ్చింది జేమ్స్ డి వాట్సన్ కే. కానీ, ఆ కల ఫలితంగా నోబెల్ బహుమతి విరిరువురికే గాక మొత్తం అయిదు గురికి వచ్చింది. పొతే ‘డ్రీమ్ ఎనాలిసిస్’ చేస్తూ ఫ్రాయిడ్ మానవ చేతన, ఉపచేతన మధ్య జరిగే అంతర్గత కల్లోలం నుంచీ కలలు వస్తాయని భావించాడు. అలా వచ్చిన కలలో కొన్ని వాస్తవాలు, వ్యక్తిత్వ సమస్యలు, జీవిత ప్రేరణలు ఉండవచ్చని కూడా భావించాడు. ఈ నేపథ్యంలో వాడ్రేవు చిన వీరభద్రుడు గారి విశ్లేషణ, రాజుగారి కవితల్లో ‘సర్రియలిజం’ కొంత వాస్తవం అనిపిస్తుంది. రాజు గారి ‘కలహారం’ (2022) చదివితే ఈ వాస్తవ, అధివాస్తవ చిత్రాలు అర్ధం చేసికోవటం కష్టం కాదు సరి కదా రసాస్వాదన కూడా హాయిగా చేయవచ్చు.
నిజానికి కవి రాజు గారి కవితలు ‘గీతాంజలి’కి ఎందునా తీసిపోవు. కానీ, తెలుగు వారికి ఠాగోర్‌కి వున్న ప్రచార ప్రజ్ఞ లేదు. ఠాగోర్‌కు ‘బెంగాలీ ‘గీతాంజలి’ని ఆంగ్లంలో అనువదించే ఒక ‘ఐరిష్’ దేశస్థుడు, యువకుడు అయిన డబ్ల్యూ.బి.యేట్స్ దొరికాడు. అతనికి అప్పటికే నోబెల్ బహుమతి రావటం వలన, అతని అనువాదానికి, సిఫార్సుకు గౌరవం లభించింది. ఠాగోర్కు నోబెల్ బహుమతి లభించింది. మరి ‘కవిరాజు’ కు తాళ్లు లాగటం తెలియదు. అందుకే అవార్డులు, గుర్తింపులూ ఇంకా రావలసి ఉన్నా రావలసినంత రాలేదు. అందుకేనేమో కవిరాజు ఇలా అంటారు ు’ఎప్పటిదో నాకీ వరం /దురూసులకు దురాశలకు దూరం చేసి/కంటకాల సంకటాలు దరిచేరకుండా చేశావు/ అడగకనే అన్నీ ఇచ్చి అక్షయసంపదతో అక్షరాన్ని చేశావు. నిస్సందేహంగా కవిరాజు ఒక నూతన కవితా ఒరవడికి ‘వైతాళికుడు’ అనడానికి ఏ సందేహం అవసరం లేదు.
– డా||కొప్పరపు నారాయణ మూర్తి, 7671909759