సీబీఐ విచారణపై కవిత సవాల్‌

Kavita challenges CBI investigation– రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్‌ జైలులో ఉన్న కవిత సీబీఐ విచారణను సవాల్‌ చేస్తూ ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఆమెను సీబీఐ విచారణకు అనుమతి ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ కవిత తరపు సీనియర్‌ న్యాయవాది నితీష్‌ రాణా శనివారం పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ విచారణకు అనుమతి ఇవ్వడంపై స్టేటస్‌ కో ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. సీబీఐ తమకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని వివరించారు. కవితను ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోరారు. ”మద్యం స్కాం కేసులో కవితను విచారించాల్సి ఉన్నదని, దీనికి అనుమతి కావాలని కోరుతూ శుక్రవారం సీబీఐ కోర్టును ఆశ్రయించింది. అయితే.. దీనిపై మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, కనీసం ఆ పిటిషన్‌ కాపీ కూడా మాకు చేరలేదు. అయినప్పటికీ దీనికి కోర్టు అనుమతి ఇచ్చింది. అందుకే.. దానిని మేం సవాల్‌ చేస్తున్నాం. కవితను సీబీఐ విచారణకు అనుమతి ఇవ్వడంపై స్టేటస్‌ కో ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరాం” అని కవిత తరఫు న్యాయవాది నితీష్‌ రాణా స్పష్టం చేశారు. అందుకు రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజా నిరాకరించారు. పిటిషన్‌ పై వాదనలు విన్న తర్వాతే ఏ ఉత్తర్వులైనా ఇస్తామని స్పష్టం చేశారు. అయితే.. ఎటువంటి వాదనలు వినకుండా స్టేటస్‌ కో ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని న్యాయమూర్తి కావేరి భవేజా స్పష్టం చేశారు. కవిత పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు సీబీఐ మూడు రోజులు వరకు సమయం కోరింది. తదుపరి విచారణను ఈనెల 10న చేపట్టనున్నామని, ఏ నిబంధనల ప్రకారం పిటిషన్‌ దాఖలు చేశారో స్పష్టంగా తెలియజేయాలని సీబీఐకి కోర్టు తెలిపింది. తదుపరి వాదనలు విన్న తర్వాతే, ఏ ఉత్తర్వులు అయినా ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది.