నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో విచారణను రౌస్ ఎవెన్యూ కోర్టు వాయిదా వేసింది. ఈ స్కాంలో పెద్ద ఎత్తున డబ్బులు హవాల రూపంలో చేతులు మారాయని, పలువురు ముఖ్యమైన రాజకీయ వేత్తలు ఇందులో కింగ్ పిన్ గా ఉన్నారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అభియోగాలు మోపింది. ఇందుకు సంబంధించి దాఖలు చేసిన కేసులో సోమవారం సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జ్ కావేరి భవేజా విచారణ నిర్వహించారు. ఈ సందర్బంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢల్లీీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహా ఇతర నిందితులు వర్చువల్ మోడ్ లో కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో ఈ ఏడాది మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. అనంతరం ట్రయల్ కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించగా… దాదాపు 5 నెలల తర్వాత ఆగస్టు 27న సుప్రీంకోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ తో జైల్ నుంచి రిలీజ్ అయిన కవిత… అప్పటి నుంచి దర్యాప్తు సంస్థలు తనపై దాఖలు చేసిన కేసుల్లో వర్చువల్ మోడ్ లో విచారణకు హాజరవుతున్నారు. కవిత తరఫున అడ్వొకేట్ మోహిత్ రావు వర్చువల్ గా హాజరై వాదనలు వినిపించారు. విచారణ, అరెస్ట్, కవితపై దాఖలు చేసిన చార్జిషీట్లపై వాదనలు వినిపించారు. అలాగే మిగిలిన నిందితుల తరపు అడ్వకేట్లు దర్యాప్తుల తీరును తప్పుబట్టారు. అన్ని వైపుల వాదనలపై తర్వాత… తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి కావేరి భవేజా స్పష్టం చేశారు. మరోవైపు ఇదే కేసులో సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పై అక్టోబర్ 4న ట్రయల్ కోర్టు విచారణ జరపనుంది.