కవిత కస్టడీ పొడిగింపు

–  విచారణ జులై 3కు వాయిదా 
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మరో నలుగురిపై ఈడీ దాఖలు చేసిన సప్లమెంటరీ చార్జిషీట్‌పై విచారణను రౌస్‌ అవెన్యూ కోర్టు జులై 3కు వాయిదా వేసింది. కవితతో పాటు మరో నలుగురు నిందితుల పాత్రపై మే 10న ఈడీ దాదాపు 8 వేల పేజీలతో 6వ సప్లమెంటరీ ప్రాసిక్యూషన్‌ ఫిర్యాదు (అనుబంధ చార్జిషీట్‌)ను ఈడీ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను గతనెల 29న ట్రయల్‌ కోర్టు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అలాగే నిందితులను కోర్టులో ప్రొడ్యూస్‌ చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం కవితను నేరుగా కోర్టులో ప్రొడ్యూస్‌ చేశారు. అలాగే మరో నలుగురిని ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న కవిత, చరణ్‌ ప్రీత్‌ సింగ్‌కు కస్టడీని పొడిగించారు. అలాగే అరెస్ట్‌ కానీ మరో ముగ్గురు నిందితులు దామోదర్‌ శర్మ, ప్రిన్స్‌కుమార్‌, ఇండియా హెడ్‌న్యూస్‌ ఛానల్‌ మాజీ ఉద్యోగి అరవింద్‌ సింగ్‌కు రూ. లక్ష పూచికత్తు విధించారు. పాస్‌పోర్ట్‌ జప్తు చేయాలని ఆదేశించారు. కేసు తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి కావేరి బవేజా వెల్లడిం చారు. అనంతరం కవితను కలిసేందుకు భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులకు అనుమతించింది. వారితో మాట్లాడిన అనంతరం పోలీసులు కవితను తీహార్‌ జైలుకు తరలించారు.
సీబీఐ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్‌ స్కాం, సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్‌ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. గతంలో విధించిన కస్టడీ ముగియడంతో… సోమవారం మధ్యాహ్నం వర్చువల్‌ మోడ్‌ ద్వారా ఆమెను కోర్టులో హాజరపరిచారు. ఈ సందర్భంగా దర్యాప్తు సజావుగా సాగాలంటే కవిత కస్టడీని పొడిగించాలని సీబీఐ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఆమె కస్టడీని ఈనెల 7 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది.