అద్దె ఇంటి కవితకు వేల కోట్ల ఆస్తులెలా వచ్చాయి

– ఆమెకడిగిన ముత్యం కాదు…రుజువైతే మళ్లీ జైలుకే
– కాంగ్రెస్‌ నేత గజ్జెల కాంతం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అద్దె ఇంట్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వేల కోట్ల రూపాయాలు ఆస్తులెలా వచ్చాయని కాంగ్రెస్‌ నేత గజ్జల కాంతం ప్రశ్నించారు. ఆమె కడిగిన ముత్యం కాదనీ, నేరం రుజువైతే మళ్లీ జైల్లో కటకటాలు లెక్కించక తప్పదని హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని లూఠీ చేసి లిక్కర్‌ కుంభకోణంలో జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. లిక్కర్‌ స్కామ్‌లో రూ.100 కోట్లు బయటపడిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కొత్త ఇంటి కోసం ఇతర దేశాల నుంచి రూ.50 కోట్ల పర్నిచర్‌ కొనుగోలు చేసిందని ఆరోపించారు. దుబారులో రూ.500 కోట్లతో ప్లాటు కొన్నది వాస్తవం కాదా? అక్కడ పదివేల కోట్ల పెట్టుబడులు పెట్టింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కవితకు పట్టిన గతే మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుకు పడుతుందని హెచ్చరించారు. మాజీ మంత్రి కేటీఆర్‌ రూ.500 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ ఇల్లు నిర్మించారనీ, ఆ అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. హైడ్రా దూకుడు పట్ల అణగారిన ప్రజల్లో హర్షాతిరేకలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు.