గజ్వేల్‌లో ఓటమి భయంతోనే.. కామారెడ్డిలో కేసీఆర్‌ పోటీ

Revanth Reddy– ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ-భిక్కనూర్‌, రాజంపేట
రాష్ట్రంలో మార్పు రావాలంటే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి అన్నారు. నియంత, అవినీతి, కుటుంబ పాలనను బొంద పెడితేనే రాష్ట్రంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉంటారని అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లాలోని రాజంపేట్‌, భిక్కనూర్‌ మండల కేంద్రాల్లో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చిందని, గ్రామగ్రామాల్లో బెల్ట్‌ షాపులను ఏర్పాటు చేసి ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్‌ రూ.2016ను మద్యం దుకాణాల ద్వారా తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకు, కౌలు రైతుకు ఎకరానికి రూ.15000 అందజేస్తుం దని, భూమిలేని రైతులకు, ఉపాధి కూలీలకు సంవత్సరానికి రూ.12,000 చెల్లిస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌ కచరా పాలనలో వ్యవసాయ బావుల వద్ద ఉచిత కరెంటు అని చెప్పి గృహ నివాసాల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ను ఓడించి బీఆర్‌ఎస్‌ పార్టీని బొందపెట్టి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడానికి కేసీఆర్‌పై కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు. కేసీఆర్‌ గజ్వేల్‌లో ఓడిపోతాననే భయంతోనే కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడని విమర్శించారు. కేసీఆర్‌ 40 ఏండ్ల రాజకీయ జీవితంలో అమ్మమ్మ ఇల్లు గుర్తుకు రాలేదని.. ఎన్నికలు రాగానే కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్న అమ్మమ్మ గారి ఇల్లు గుర్తుకు వచ్చిందని ఎద్దేవా చేశారు.
గజ్వేల్‌లో 1000 ఎకరాల భూములు తమ బంధువులకు, స్థానికులకు ఇచ్చేశారని, కామారెడ్డి ప్రాంతం పచ్చగా కనిపించడంతో కామారెడ్డి జిల్లాలో ఉన్న పచ్చని పంట పొలాలను కబ్జా చేయడానికి మాత్రమే కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదని, మరోసారి అవకాశం ఇస్తే తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. పంజాబ్‌ రాష్ట్రంలో, మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న ప్రజలపై ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజలపై లేదని, తెలంగాణ ప్రజల సొమ్మును పక్క రాష్ట్రంలో పంచడానికి వెళ్తున్నాడు కానీ తెలంగాణ ప్రజల గోసను పట్టించుకోవడానికి ఒకనాడు కూడా వాళ్ల ఇంటికి వెళ్లలేదన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్న రెండు లక్షల ఓటర్లకు ఒక్కో ఓటుకు పదివేల రూపాయలు చెల్లించి, గెలిచిన తర్వాత రెండు వేల ఎకరాల భూములను లాక్కోవడం ఖాయమన్నారు. ప్రజలు గమనించి ఈనెల 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలలో హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరే విధంగా చూస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, నిజామాబాద్‌ అర్బన్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు చంద్రకాంత్‌ రెడ్డి, మండలాధ్యక్షులు భీమ్‌రెడ్డి, రాజంపేట్‌, భిక్కనూర్‌ మండలాల ఎన్నికల ప్రచార నిర్వహకురాలు శారద, కామారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ఇన్చార్జ్‌ నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.