– తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
– ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తాం :కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్
– కేసీఆర్ పదివేల ఎకరాల కబ్జాకోర్
– కౌలు రైతులకు రైతుబీమా, రైతుబంధు ఏదీ? : రేవంత్ రెడ్డి
– తాండూర్, పరిగి, చేవెళ్లలో కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర
‘రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబాన్ని ఫామ్‌హౌస్‌కే పరిమితం చేయాలి. ప్రజల మీద ప్రేమతో సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. కాంగ్రెస్‌ను ఈ ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలి. అధికారంలోకి రాగానే మొదట ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తాం..’ అని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. శనివారం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని చేవెళ్ల, పరిగి, తాండూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర నిర్వహించారు. మొదట తాండూర్‌లో ప్రారంభమైన యాత్ర పరిగి మీదుగా చేవెళ్లకు చేరింది. ఈ యాత్రలో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే ప్రసంగించారు.
నవతెలంగాణ-తాండూరు
కర్నాటక రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక అన్ని హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు కరెంట్ ఇస్తున్నామన్నారు. గృహలక్ష్మి కింద మహిళలకు రూ.రెండు వేలు ఇస్తున్నామన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, పేదలకు పది కిలోల బియ్యం, మహిళలకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. బీఆర్‌ఎస్ నాయకులు కర్నాటక ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలన్నీ బూటకమన్నారు. తెలంగాణకు కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్నాటకకు సీఎం కేసీఆర్ వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. అసలు తెలంగాణలో సీఎం కేసీఆర్ ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అధికార అహంకారంతో అవినీతికి పాల్పడి మింగిన రూ.లక్ష కోట్లను తిరిగి కక్కిస్తామన్నారు. హైదరాబాద్‌లో పదివేల ఎకరాల్లో భూ కబ్జాలు చేశారని ఆరోపించారు. ఆ భూములను తిరిగి స్వాధీనం చేస్తామని చెప్పారు.
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌ను అభివృద్ధి చేసిందే కాంగ్రెస్ అన్నారు. మెట్రో రైలు, రింగ్ రోడ్డు వేసింది తమ పార్టీ అని చెప్పారు. రాష్ట్రంలో ఎనిమిది నుంచి పది గంటలు మాత్రమే కరెంటు వస్తోందన్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని మోసం చేశారన్నారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌దే అన్నారు. ‘గెలిస్తే పని చేస్తాం లేకుంటే ఫామ్‌హౌస్‌లో ఉంటాం’ అని కేసీఆర్ అనడంతోనే ఓటమిని ఒప్పుకున్నారన్నారు. తాండూరులో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కుమ్ములాడుకొని ఇప్పుడు ఒక్కటైన విషయాన్ని ప్రజలు గుర్తించారన్నారు. వారిద్దరూ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశారన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పుష్పలీల, కాంగ్రెస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, ఏఐసీసీ నాయకులు ఖాన్, తాండూరు నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, కల్వ సుజాత తదితరులు పాల్గొన్నారు.