– దొంగలు పోయి గజదొంగలు అధికారంలోకి వచ్చారు : కిషన్‌రెడ్డి
– బీజేపీలో చేరిన నల్లగొండ, మెదక్ నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం స్వార్థం కోసం వాడుకున్నదనీ, బీఆర్‌ఎస్ నేతలు భూ, సాండ్, లిక్కర్ స్కామ్‌ల్లో చిక్కుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలను నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో జహీరాబాద్‌కు చెందిన మాజీ మంత్రి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే పండరి, జెడ్పీటీసీ రాజు రాథోడ్, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు నల్లగొండకు చెందిన రామరాజు యాదవ్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో దొంగలు పోయి గజదొంగలు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. రైతులకు చేస్తామన్న రూ.2 లక్షల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ డీఎన్‌ఏ ఒక్కటేనని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రాహుల్‌గాంధీ ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించారు. కేంద్రంలో మళ్లీ ఎన్‌డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందనీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీ ఇటలీకి వెళ్లిపోవడం ఖాయమని చెప్పారు.తెలంగాణలో 17 స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.