– డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్
– నల్లగొండలో కాంగ్రెస్ వినూత్న నిరసన
– ఖాళీ కుర్చీపై పింక్ టవల్, కేసీఆర్ ఫొటో
నవతెలంగాణ- నల్లగొండ కలెక్టరేట్
పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ప్రజలను మోసం చేసిందని డీసీసీి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ విమర్శించారు. నల్లగొండలో కేసీఆర్ బహిరంగ సభ నేపథ్యంలో నిరసిస్తూ మంగళవారం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో క్లాక్‌టవర్ సెంటర్‌లో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఖాళీ కుర్చీలో పింక్ టవల్ వేసి కేసీఆర్ ఫొటో పెట్టి.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను ఎండగడుతూ ఎల్‌ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. కేసీిఆర్ గోబ్యాక్ అంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ.. కేసీఆర్‌వన్నీ దొంగ హామీలని విమర్శించారు. బీఆర్‌ఎస్ పదేండ్లు అధికారంలో ఉండి శ్రీశైలం టన్నెల్‌ను కిలోమీటర్ కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. డిండి ఎత్తిపోతల, పాలమూరు- రంగారెడ్డి, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయని కేసీఆర్‌కు నల్లగొండలో అడుగుపెట్టే హక్కు లేదన్నారు. పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కుర్చీ వేసుకుని ప్రాజెక్టులు పూర్తి చేస్తానని, దత్తత తీసుకొని నల్లగొండలో అభివృద్ధి చేస్తానని చెప్పి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన విధంగా కేసీఆర్ ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మెన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్ గౌడ్, జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, ఎంపీపీ మనిమిద్దె సుమన్, కాంగ్రెస్ పార్టీ తిప్పర్తి మండల అధ్యక్షుడు జూకూరి రమేష్, ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు నాంపల్లి భాగ్య, నాయకులు నర్సింగ్ శ్రీనివాస్, రేఖల భద్రాద్రి, బషీర్, కరుణాకర్ రెడ్డి, కేసాని వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.