– కులమతాలకతీతంగా పనిచేసేది కాంగ్రెస్సే..
– కర్నాటక సీఎం సిద్ధరామయ్య
నవతెలంగాణ – ముషీరాబాద్/ఊట్కూర్
పదేండ్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. దేశంలో అన్ని వర్గాలు, కులమతాలకతీతంగా ప్రజల సంక్షేమం కోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు. ఆదివారం మక్తల్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో సిద్ధరామయ్య మాట్లాడారు.
పార్లమెంట్‌లో కేసీఆర్‌కు ఎంపీలు లేకపోయినా సోనియాగాంధీ ధైర్యం చేసి రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. నేడు రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తూ.. ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శించారు. అందువల్ల ఆయన్ను గద్దె దింపి.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, రైతులు, యువతకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని చెప్పారు. ఒక్కొక్కరిపై సుమారు రూ.95 వేల అప్పు చేశారని తెలిపారు.
పేద ప్రజల కోసం బీజేపీ ఏనాడూ ఏమీ చేయలేదని విమర్శించారు. రాజ్యాంగాన్ని 100 శాతం అమలు చేసేది కాంగ్రెస్ పార్టీ అయితే.. దాన్ని తుంగలో తొక్కిది బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలని, వాటిని ఎన్నికల్లో తరిమి కొట్టాలని ప్రజలను కోరారు. రాజ్యాంగం కారణంగానే అన్ని వర్గాలు, ప్రజలకు సమాన హక్కులు లభిస్తున్నాయని చెప్పారు. కానీ, బీజేపీ మన రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తోందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యులకు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తోందని.. అందుకే కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇచ్చామని చెప్పారు. నాలుగు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని, జనవరి నుంచి ఐదోది కూడా అమలు చేయబోతున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. కర్ణాటకలో గ్యారంటీ పథకాలు అమలు కావడం లేదని కేసీఆర్, కేటీఆర్ ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. వాళ్లకు ఛాలెంజ్ చేస్తున్నా.. కర్ణాటకకు వచ్చి చూడాలని.. కానీ ఆ ధైర్యం వారికి లేదని అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్‌కు అందరి ఆశీస్సులు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ఒకటే విధానాలు అనుసరిస్తున్నాయని మక్తల్‌లో సిద్ధరామయ్య అన్నారు. కర్ణాటకలో డీజిల్, పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నాయని.. అదే తెలంగాణలో డీజిల్ పెట్రోల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. మక్తల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి శ్రీహరిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.