– పరిపాలన ఎలా చేయకూడదో అలా చేశాడు
– అన్ని వ్యవస్థలకూ ఆగం చేశాడు : విశ్రాంత ఐఏఎస్ ఎ.మురళి
– టైటిల్ గ్యారంటీ తేవాలి..గ్రామంలోనే సమస్యలు పరిష్కారం కావాలి : భూమి సునీల్
– అధికారుల కోసం కాదు..పేదల కోసం పనిచేయండి : ప్రొఫెసర్ కోదండరామ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేసీఆర్ ఉద్యమకారుడు కాదనీ, ఆయన తెలంగాణ విధ్వంసకారుడని విశ్రాంత ఐఏఎస్ ఆకునూరి మురళి ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక, విద్యా, రెవెన్యూ, పంచాయతీరాజ్, టీఎస్‌పీఎస్‌సీ, ఇలా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. పరిపాలన ఎలా చేయకూడదో అలా చేసిచూపాడన్నారు. కలెక్టర్లను రియల్టర్లుగా మార్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని హోటల్ ప్లాజాలో తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ) ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ బలోపేతం అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ..అత్యధిక అవినీతికి పాల్పడే అధికారులను తీసుకొచ్చి హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో పోస్టింగులు ఇచ్చి దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు సైతం దొంగలుగా మారి దోచుకున్నారని విమర్శించారు. రెవెన్యూ ఉద్యోగులపై అవినీతి ముద్ర వేసి వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థలను రద్దు చేసి భూరికార్డులను ఆగం చేసి దోచుకోవాల్సినంత భూమిని గత పాలకులు దోచుకున్నారని ఆరోపించారు. అవినీతి, అక్రమాలతో సంపాధించిన డబ్బుతో దేశాన్నే కొనేయాలని కలలు కన్నారని విమర్శించారు. గ్రామ స్థాయిలోనే రైతుకు అన్ని రకాల సేవలను అందించాలన్నారు. ఇందుకోసం పటిష్టమైన గ్రామ పాలనా వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. మన రాష్ట్రాన్ని మనమే రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త దొంగలు తయారవ్వకుండా చూసుకోవాలని సూచించారు.
టీజేఎస్ అధ్యక్షులు, ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ..న్యాయాన్ని పక్కన పెట్టి, సొంత అవసరాల కోసం చట్టాలను తయారు చేస్తే ఎలా ఉంటుందనే దానికి ధరణి పోర్టలే మంచి ఉదహరణ అని చెప్పారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ తన సొంతానికే రెవెన్యూ చట్టంలో మార్పులు తెచ్చారని ఆరోపించారు. చివరకు భూ రికార్డులను సైతం విధ్వంసం చేశారన్నారు. కేవలం వారికి మాత్రమే కావాల్సినవి రాసుకున్నారని ఆరోపించారు. మిగతా జరిగిన తప్పులకు రెవెన్యూ వారికి శిక్షలు విధించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. వీఆర్‌ఏల నుంచి కనీసం అభిప్రాయం కూడా తీసుకోకుండా రెవెన్యూకు దూరం చేశారన్నారు. అధికారులు పాలకుల కోసం కాకుండా ప్రజల కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.
రెవెన్యూ నిపుణులు, న్యాయవాది భూమి సునీల్ రాష్ట్రంలో ప్రధానమైన భూ సమస్యకు పరిష్కారం చూపకుండా బంగారు తెలంగాణ, ఆకుపచ్చ తెలంగాణ..ఏ తెలంగాణా సాధ్యం కాదని నొక్కి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగానూ భూ సమస్య పరిష్కారమైన దేశాలే అభివృద్ధి చెందిన విషయాన్ని గుర్తుచేశారు. భూ పరిపాలన గ్రామ స్థాయిలో ఉండాలనీ, రైతు సమస్యలు అక్కడే పరిష్కారమయ్యేలా వ్యవస్థ ఉండాలని ఆకాంక్షించారు. భూమి హద్దులు స్పష్టంగా ఉండాలనీ, హక్కుల కల్పించే పత్రాలు పక్కాగా, హక్కుల మార్పిడి వెంటనే జరిగేలా ఉండాలని సూచించారు. భూమి హక్కులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వాలన్నారు. దస్తావేజుల రిజిస్ట్రేషన్ కాదు.. హక్కులకు రిజస్ట్రేషన్ కావాలన్నారు. లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 25వేల జూనియర్ అసిస్టెంట్ల నియామకంతో గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలు పెరిగినప్పటికీ ఉద్యోగుల సంఖ్య పెరగలేదన్నారు. ఇతర విభాగాలకు బదిలీ చేసిన వీఆర్‌ఓ, వీఆర్‌ఏలను అదే హౌదాలో రెవెన్యూ శాఖకు రప్పించి గ్రామ స్థాయిలో పాలనను పటిష్టం చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎ.జానయ్య, డిప్యూటీ కలెక్టర్ల సంఘం నేతలు రమేష్ రాథోడ్, కె.రామకృష్ణ, ఎన్‌ఆర్ సరిత, టీజీటీఏ అధ్యక్షుడు ఎస్.రాములు, ప్రధాన కార్యదర్శి ఎస్‌పీఆర్ మల్లేష్‌కుమార్, నేతలు ఉమాశంకర్, పూల్‌సింగ్, రమేష్ పాక, ఆరేటి రాజేశ్వర్, రాధ, వివిధ ఉద్యోగ సంఘాల నేతల ఉపేందర్‌రావు, సత్యనారాయణ, పద్మ, రెవెన్యూ ఉద్యోగ సంఘాల మాజీ నేతలు, విశ్రాంత అధికారులు లక్ష్మయ్య(ట్రెసా), రవీందర్‌బాబు, శ్రీనివాసరావు, మధుసూదన్, రాజారావు, ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి, తదితరులు మాట్లాడారు.