– మెదక్ ఎంపీ సీటు గెలుపు కోసం కాంగ్రెస్ కసరత్తు
– సిద్దిపేటలో మకాం వేసిన మైనంపల్లి హనుమంతరావు
– బలమైన అభ్యర్థిని బరిలోకి దించే వ్యూహం
– కాంగ్రెస్ వైపు నీలం మధు, ఇతర నాయకులు
– మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు నియోజక వర్గాలపై స్పెషల్ ఫోకస్
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
కేసీఆర్ ఇలాకాపై హస్తం నేతల కన్ను పడింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌ను ఢ కొట్టి గెలిచి తీరాలనే పట్టుదలతో మెదక్ నియోజకవర్గంపై దృష్టి సారించారు. మరో పక్క తన ఇలాకాలో మరొకరికి చోటివ్వకుండా తమ పట్టు నిలుపుకోవాలన్న పట్టుదలతో గులాబీ బాస్ కేసీఆర్, ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం ఎలాగైనా బీఆర్‌ఎస్ కంచుకోటను బద్దలు కొట్టాలనే లక్ష్యంతో చాపకింద నీరులా పార్టీని విస్తరింప చేస్తున్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిచి రెండు లక్షల ఓట్ల మెజార్టీ ఉన్నప్పటికీ బలమైన అభ్యర్థి పోటీలో లేకపోతే ఫలితం అటు ఇటు అవ్వొచ్చనే లెక్కలేస్తున్న గులాబీ బాస్.. గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున మెదక్ ఎంపీ సీటు గెలిచి తీరాలనే పట్టుదలతో బలమైన అభ్యర్థిని బరిలో దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలా ఇరు పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం చుట్టూ ప్రధాన రాజకీయ పార్టీలు పరిభ్రమిస్తున్నాయి. మెదక్ మెర్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్, మెదక్, గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంపై కేంద్రీకరించాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి 3,16,427 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచారు. గతంలోనూ కేసీఆర్, విజయశాంతి, ఆలె నరేందర్ సైతం గులాబీ పార్టీ నుంచి మెదక్ ఎంపీగా గెలిచారు. మెదక్ ప్రాంతం గులాబీ పార్టీకి మొదటి నుంచి కంచుకోటగా ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమిపాలై అధికారం కోల్పోయింది. అయినా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను ఆరు చోట్ల బీఆర్‌ఎస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు.
మెదక్‌పై కేంద్రీకరించిన కాంగ్రెస్
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను ఆరు చోట్ల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గెలవగా, కాంగ్రెస్ కేవలం మెదక్ అసెంబ్లీ స్థానం దక్కించుకుంది. ఆ చేదు ఫలితాలను సమీక్షించుకున్న కాంగ్రెస్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తా చాటాలని చూస్తుంది. మామా అల్లుళ్ల ఎత్తుల్ని చిత్తు చేసేలా సీఎం రేవంత్‌రెడ్డి పై ఎత్తులు వేస్తున్నారు. మెదక్ ఎంపీ నియోకజవర్గంలో బలమైన అభ్యర్థిని పోటీ చేయించాలని చూస్తున్నారు. ఇటీవల ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తుల్ని స్వీకరించినప్పటికీ పార్టీ మాత్రం బీఆర్‌ఎస్‌ను ఓడించే శక్తి సామర్థ్యాలున్న నాయకుడ్ని బరిలో దించాలనుకుంటుంది. అందులో భాగంగానే మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును రంగంలోకి దించారు. హనుమంతరావు సిద్దిపేటలో మకాం వేసి భారీ సమావేశం నిర్వహించి కాంగ్రెస్ శ్రేణులకు బూస్టింగ్ ఇచ్చారు. కొడుకు మైనంపల్లి రోహిత్‌రావు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. హనుమంతరావు సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌లో పట్టు సాధించేలా ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన పాత వాళ్లందర్ని తిరిగి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. పటాన్‌చెరులో కాంగ్రెస్ ఓడిపోయినందున అక్కడ బలపడేందుకు ముదిరాజ్ సామాజిక తరగతిలో పట్టున్న నీలం మధును ఇటీవల కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే 40 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. నర్సాపూర్, పటాన్‌చెరు ఎమ్మెల్యే అక్రమ ఆస్తులపై దృష్టి పెట్టి వాళ్లు సైతం బేరసారాలకు వచ్చేలా చేస్తున్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఓడిపోయినా క్రీయాశీల రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఆయన సతీమణీ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేశారు. మైనంపల్లి హనుమంతరావును పోటీ చేయించడం ద్వారా కేసీఆర్, హరీశ్‌రావు ఎత్తుల్ని ఎదుర్కొగలడనే చర్చ నడుస్తుంది.
పట్టు సడలకుండా బీఆర్‌ఎస్ జాగ్రత్తలు
మెదక్ ఎంపీ సీటును వరుసగా గెలుస్తూ వస్తున్న బీఆర్‌ఎస్ తన పట్టు సడలకుండా జాగ్రత్త పడుతుంది. ఆరుగురు ఎమ్మెల్యేల్లో కేసీఆర్, హరీశ్‌రావుతో పాటు సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్, దుబ్బాక ఎమ్మెల్యేలు యాక్టీవ్‌గా కదులుతున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీల వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోకజవర్గాల్లో కలిపి బీఆర్‌ఎస్‌కు 2.16 లక్షల ఓట్లు ఆధిక్యం వచ్చింది. అదే బలాన్ని తిరిగి ప్రదర్శించడం ద్వారా మెదక్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని గులాబీ నేతలు బావిస్తున్నారు. కేసీఆర్ పుట్టిన రోజును మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పండుగ మాదిరి నిర్వహించి క్యాడర్‌లో జోష్ పెంచే ప్రయత్నం చేశారు. కార్యకర్తలు, నాయకులతో కేసీఆర్ ప్రత్యేకంగా మాట్లాడుతూ ధైర్యం నింపారు. ఎంపీ అభ్యర్థులుగా ఉద్యమకారులు ఆర్.సత్యనారాయణ, బీరయ్య యాదవ్ దరఖాస్తు చేశారు. వంటేరు ప్రతాపరెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. కాంగ్రెస్‌ను ఎదుర్కొని గెలిచేందుకు ఆర్థిక పరిపుష్టి ఉన్న ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది. వీళ్ల కంటే నేరుగా గులాబీ బాస్ కేసీఆర్ మెదక్ బరిలో దిగే అవకాశాల్లేకపోలేదనే చర్చా ఉంది. దేశ రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యేందుకు వీలుగా మెదక్ ఎంపీగా పోటీ చేస్తారంటున్నారు.