రాకింగ్ రాకేష్ కథానాయకుడిగా నటిస్తున్న మూవీ ‘కేశవ చంద్ర రమావత్’ (కెసిఆర్). గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. అన్నన్య కష్ణన్ కథానాయిక. రాకింగ్ రాకేష్ స్వయంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 22న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు.
ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ, ‘కేసీఆర్ స్ఫూర్తితో రాకేష్ అద్భుతమైన సినిమా తీయడం చాలా సంతోషం. కేసీఆర్ అంటే ఒక చరిత్ర. రాష్ట్రం సాధించడమే కాదు రాష్ట్రాన్ని పదేళ్ళు అద్భుతమైన ప్రగతి పథంలో నడిపిన నాయకుడు. వారి కషిని, పోరాటాన్ని ప్రజలకు చూపించే ప్రయత్నం రాకేష్ చేశాడు’ అని అన్నారు.
ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ మంత్రి రోజా, డైరెక్టర్ ఎన్.శంకర్, నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు, గోరేటి వెంకన్న, జానీ మాస్టర్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ధనరాజ్, బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్, శివ బాలాజీ తదితరులు ఈ వేడుకలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
హీరో, ప్రొడ్యూసర్ రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ,’ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందంటే దానికి కారణమైన దీప ఆర్ట్స్ శ్రీనివాస్ గౌడ్‌కి ధన్యవాదాలు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ సినిమాకి ఒక ఉద్యమ నాయకుడు పేరు పెట్టుకున్నాం. నిజంగా నా జీవితంలో ఒక ఉద్యమమే జరిగింది. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్‌గా నిలిచిన నా భార్య సుజాత థ్యాంక్స్’ అని అన్నారు. ‘చాలా ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమాని ‘బలగం’ సినిమాతో కంపేర్ చేస్తున్నారు. అక్కడే మేము సక్సెస్ అయ్యాం’ అని డైరెక్టర్ అంజి చెప్పారు.