పాపాల భైరవుడు కేసీఆర్‌

పాపాల భైరవుడు కేసీఆర్‌– కరువుకు, పంటలు ఎండిపోవడానికి కారణం ఆయనే
– పార్టీ ఫిరాయింపులను సమర్థించడం లేదు :సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పాపాల భైరవుడు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు, కృష్ణా బేసిన్‌ ఎండిపోవడానికి, పంటలు ఎండిపోవడానికి ఆయనే కారణమని అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేండ్లపాటు కేసీఆర్‌ చేసిన తప్పులే ఇప్పుడు ఆయన్ను ఊపిరాడకుండా చేస్తున్నాయని చెప్పారు. పంట నష్టానికి ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలంటున్న కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ హయాంలో ఎంత పరిహారమిచ్చారో, ఎంత మందికిచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ పాలనలో 2014 నుంచి 2018 వరకు పూర్తి స్థాయి కరువుందన్నారు. ఈ కాలంలో రూ.ఐదు వేల కోట్ల నుంచి రూ.ఆరు వేల కోట్ల వరకు పంట నష్టం జరిగిందని వివరించారు. 2017లో వరదలు, అధిక వర్షాలతో రూ.12 వేల కోట్ల పంట నష్టం జరిగిందన్నారు. గతేడాది ఖరీఫ్‌లో పది లక్షల ఎకరాల్లో రైతులు పంటనష్టపోయారని చెప్పారు. పరిహారం ప్రకటించినా పది శాతం కూడా రైతులకివ్వలేదని విమర్శించారు. 2014 నుంచి కేంద్రం నుంచి రూ.2,483 కోట్లు రావాల్సి ఉందనీ, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంటు కింద రూ.817 కోట్లు ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులు ఇవ్వకపోవడం వల్ల రైతాంగానికి నష్టం జరిగిందని చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం నిధులను ఉపయోగించు కునేలా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంటును చెల్లించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. ఎకరాకు రూ.10 వేల చొప్పన పరిహారం ఇవ్వాలని కోరారు. పంటల బీమా పథకం నుంచి కేసీఆర్‌ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం బయటకొచ్చిందనీ, మళ్లీ చేరుతామంటూ రేవంత్‌రెడ్డి ప్రకటించారని అన్నారు. నీటిని లెక్కలేసి సాగు, వ్యవసాయ రంగాలకు విడతల వారీగా పంపిణీ చేసేలా తైబందీ విధానాన్ని అమలు చేయాల్సి ఉన్నా కేసీఆర్‌ దాన్ని మర్చిపోయారని విమర్శించారు.
గతేడాది నవంబర్‌లో ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో ఉన్న నీటిని రైతులు వాడుకున్నారని వివరించారు. ఇప్పుడు ప్రాజెక్టుల్లో నీళ్లు లేవనీ, ఇది ఎవరి పాపమని కూనంనేని ప్రశ్నించారు. యాసంగి పంటల విధానాన్ని పట్టించుకోలేదనీ, ఆరు తడి పంటలను ప్రోత్సహించలేదని అన్నారు. నీరు ఎక్కువగా వాడే వరిని ప్రోత్సహించారని గుర్తు చేశారు. 30 లక్షల టన్నుల కూరగాయలు అవసరమైతే, 20 లక్షల టన్నులు మాత్రమే పంటలు పండుతున్నాయనీ, మిగిలినవి దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు. పార్టీ ఫిరాయింపులపై ఇప్పుడు కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సీపీఐ ఎమ్మెల్యేను బీఆర్‌ఎస్‌లో చేర్చుకోలేదా?అని ప్రశ్నించారు. డబ్బు, సెంటిమెంట్‌ ఇప్పుడు పనిచేయడం లేదని చెప్పారు. పార్టీ ఫిరాయింపులను తాము సమర్థించడం లేదని అన్నారు. ఫిరాయింపు చేసిన వారు తక్షణమే రాజీనామా చేయాలనే చట్టం ఉండాలని డిమాండ్‌ చేశారు. ఎంపీ సీట్లలో పోటీపై జాతీయ సమితికి నిర్ణయాధికారాన్ని అప్పగించామని చెప్పారు.
ఇండియా కూటమి మరింత బలోపేతం : అజీజ్‌ పాషా
ఇండియా కూటమి మరింత బలోపేతమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా అన్నారు. ఆ కూటమికి దేశవ్యాప్తంగా సానుకూల వాతావరణం వస్తోందన్నారు. 400కుపైగా స్థానాలు వస్తాయంటూ గొప్పలు చెప్తున్న ఎన్డీయే కూటమికి కనీసం 270 స్థానాలు కూడా రావడం కష్టమేనని చెప్పారు. ఇండియా కూటమి ఐక్యంగా వెళ్తే పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయన్నారు. కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరేన్‌ను జైల్లో పెట్టడంతో సానుభూతి పెరిగిందని చెప్పారు. పంటలు ఎండిపోతున్నాయంటూ మాజీ సీఎం కేసీఆర్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. రైతు ఆత్మహత్యలు జరిగితే కనీసం పరామర్శించలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, పశ్మపద్మ, బాలనర్సింహా తదితరులు పాల్గొన్నారు.