– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తడిబట్టలతో ప్రజల గొంతు కోసే రకం కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. 70 నుంచి 80 మంది దాకా తమ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారనీ, మిగతావారు శుక్రవారం వేస్తారని తెలిపారు. గురువారం సాయంత్రం హోటల్ కత్రియాలో పలువురు అభ్యర్థులకు బీ-ఫామ్లు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బీసీ సీఎం ప్రకటనకు మంచి స్పందన వస్తున్నదనీ, యువత మద్దతు తమకుందని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాఫియా మారి ప్రజలను వణికిస్తున్నారని ఆరోపించారు. డబ్బులతోనే ఎన్నికల్లో గెలుస్తామనే భ్రమల్లో కేసీఆర్ ఉన్నారనీ, ఆయనకు ప్రజలపై నమ్మకం లేదని చెప్పారు. తెలంగాణ ఆర్థిక మూలాలను దెబ్బతీసే పనిలో ఆయన ఉన్నారని విమర్శించారు. కర్నాటకలో ప్రజలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందన్నారు. రాష్ట్రాన్ని ఆదుకునే, ఆర్థిక స్థితిని గాడిన పెట్టే శక్తి బీజేపీకి మాత్రమే ఉందన్నారు. 11న మోడీ హైదరాబాద్కు వస్తున్నారనీ, ఆయన మరో రెండు, మూడు సభల్లో పాల్గొంటారని చెప్పారు. అమిత్షా రోడ్డు షో ఉంటుందనీ, నేతలే ప్రజల వద్దకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. దీపావళి రోజు బూత్ స్థాయిలో ప్రతి గడపకూ వెళ్తామన్నారు. కొన్ని సంస్థలు సెల్ఫోన్లలో సర్వేలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. తప్పుడు, దొంగ సర్వేలను నమ్మొద్దని పిలుపునిచ్చారు. ఐటీ అధికారులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారనీ, తమకేమీ సంబంధం లేని చెప్పారు. ఐటీ అధికారులు దాడి చేస్తారని పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముందే ఎలా తెలుసని ప్రశ్నించారు.