ఎన్నికల కోసమే కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ విడిచారు

ఎన్నికల కోసమే కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ విడిచారు– మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ-వరంగల్‌
పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చాయి కాబట్టే కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ విడిచి వచ్చారని మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం వరంగల్‌ ఓసీటీలోని కాంగ్రెస్‌ పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్‌ కొత్త డ్రామాకు తెర తీశారని, గతంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు ఎలాంటి ఆర్థిక సాయం చేయని కేసీఆర్‌.. ఇప్పుడు వారి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఅర్‌ పాలనలో ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెలిపారు. కవిత మద్యం కేసులో జైలులో ఉందన్నారు. కేటీఆర్‌ ఫోన్‌ టాంపరింగ్‌లో సినీ హిరోయిన్‌లను బెదిరింపులకు గురిచేశారని విమర్శించారు. రైతులకు రాయితీలను ఎత్తి వేసి, రైతు బీమా ఇచ్చిన కేసీఆర్‌కు.. కాంగ్రెస్‌ పార్టీని విమర్శించే హక్కు లేదన్నారు. ఎక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేసి విద్యుత్‌ సంస్థలు అప్పులపాలవ్వడానికి కారణమయ్యారని కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎస్‌ పాలనలోనే దెబ్బతిన్నదని, ఆయా ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన ఇంజినీర్‌ కేసీఆర్‌ కాదా అని ప్రశ్నించారు. నిర్మాణ లోపంతోనే కాళేశ్వరం దెబ్బతిన్నదని, అధికారం కోల్పోవడంతో కేసీఆర్‌, కేటీఆర్‌ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ మాట తీరు మార్చుకోవాలని సూచించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌ రావు, కాంగ్రెస్‌ నాయకులు కడియం కావ్య తదితరులు పాల్గొన్నారు.