కేసీఆర్‌కు బీసీలు గుర్తుకొచ్చేది ఎన్నికలప్పుడే.. : వైఎస్‌ షర్మిల

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎన్నికలు సమీపిస్తుండటంతో కేసీఆర్‌కు బీసీలు గుర్తొచ్చారని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఓట్ల కోసం లక్ష రూపాయల సాయమంటూ ‘నయ’వంచనకు తెరలేపారని పేర్కొన్నారు. దళితబంధు పేరుతో ఇప్పటికే దళితులను దగా చేశారని గుర్తుచేశారు. గిరిజనబంధు అంటూ గిరిజనులను ఊరిస్తున్నారనీ, ఇప్పుడు బీసీలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. తొమ్మిదేండ్లుగా బీసీలకు కేటాయించిన నిధులెందుకు పక్కదారి పట్టించారో చెప్పాలని ప్రశ్నించారు. స్వయం ఉపాధి రుణాల కోసం 6 లక్షల మంది బీసీ యువత ఎదురుచూస్తున్నా.. ఒక్కరికి కూడా లోన్లు ఇవ్వలేదని తెలిపారు. ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.3 వేల కోట్లు కేటాయిస్తే రూ.3 కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. బీసీ సబ్‌ప్లాన్‌ ఏమైందని ప్రశ్నించారు.