కేంద్ర బడ్జెట్‌పై నోరెత్తని కేసీఆర్‌ : సీతక్క

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణకు ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్‌పై కనీసం స్పందించని ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కే.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర బడ్జెట్‌పై మాట్లాడటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ (సీతక్క) కౌంటర్‌ ఇచ్చారు. గురువారం అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసేత కేసీఆర్‌ సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడని ఆయన రాష్ట్ర బడ్జెట్‌ను విమర్శించడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. బీజేపీ మెప్పు కోసమే రాష్ట్ర బడ్జెట్‌ను విమర్శిస్తున్నారనీ, ఆరు నెలల తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ఆయన రావడమే అందుకు నిదర్శనమని చెప్పారు. లోక్‌ సభ ఎన్నికల సమయం నుంచి బీజేపీతో అవగాహన కుదుర్చుకున్న కేసీఆర్‌ అసలు స్వరూపం త్వరలోనే బయట పడుతుందన్నారు.