– ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు ప్రత్యేక ఇంటెలిజెన్స్ బృందాల సంచారం
– వేగంగా మారుతున్న రాజకీయాలు
– ప్రత్యర్థితో పాటు సొంత పార్టీ నేతలపైనా అనుమానం
– కీలక నేతలు, ప్రధాన అనుచరుల ఫోన్‌లు, కదలికలపై నిఘా
– ఎప్పటికప్పుడూ సీఎంకు సమాచారం.. ఇద్దరు అభ్యర్థులను మార్చే చాన్స్
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
వేగంగా మారుతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ పరిణామాలు తెలంగాణ వ్యాప్తంగా ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో బీఆర్‌ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా హైదరాబాద్ నుంచి రెండు ప్రత్యేక ఇంటెలిజెన్స్ బృందాలను 10 నియోజకవర్గాల్లో తిప్పుతున్నట్టు సమాచారం. వీరు ప్రత్యర్థి పార్టీల కీలక నేతలు వారి ప్రధాన అనుచరులతో పాటు బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు, కీలక నేతలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంస్థల చైర్మెన్ల ఫోన్లు, కదలికలపై నిఘా పెడుతున్నట్టు తెలుస్తోంది.
ఫిరాయింపు నేతలపై దృష్టి
ఇంటెలిజెంట్స్ బృందాలు ఫిరాయింపు నేతలపై దష్టి సారించినట్టు సమాచారం. బీఆర్‌ఎస్ వీడుతున్న నేతలకు టచ్‌లో ఉంటున్నది ఎవరు? ఏ అంశాలపై చర్చిస్తున్నారు..? దానిలో కీలక అంశాలను ఎప్పటికప్పుడూ సీఎం దృష్టికి తీసుకెళ్తున్నారని వినికిడి. ముఖ్య నేతల కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. వారు ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎవరిని కలుస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నారు. రోజూ రెండుపూటలా ఈ సమాచారాన్ని హైదరాబాద్‌కు చేరవేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన అనుచరగణం కదలికలపై నిఘా ఉంచుతున్నట్టు సమాచారం. కొద్దిరోజులుగా తుమ్మల నాగేశ్వరరావు కార్యకలాపాలపై కూడా నిఘా అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన్ను ఎలా ఇబ్బంది పెట్టొచ్చనే అంశాలపై దృష్టి సారించినట్టు సమాచారం. ఈ ఏడాది ఆరంభం నుంచి బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిరసన గళం వినిపిస్తుండటంతో ఆయన్ను టార్గెట్‌గా చేసుకుని నిఘాను పటిష్ఠం చేశారు. జులై 2 జనగర్జన సభ సమయంలో పొంగులేటిని ఉక్కిరిబిక్కిరి చేసేలా ప్రభుత్వం వైపు నుంచి నిఘాను ముమ్మరం చేయడంతో ఆయన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన ప్రతి కదలికపై నిఘా ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు విషయంలోనూ అటువంటి జాగ్రత్తలే తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
సొంతపార్టీ నేతలపైనా అనుమానం..
కేసీఆర్‌కు మొదటి నుంచి సొంత పార్టీ నేతల పైనా అనుమానాలున్నాయి. ఇటీవల ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎప్పుడు ఎవరు పార్టీ వీడతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పార్టీ వీడే నేతలతో.. వీడిన నేతలతో ఎవరు టచ్‌లో ఉంటున్నారు అనే విషయాలపై నిఘా బృందాలు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టు సమాచారం. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్ల విషయంలో అయితే.. షాడో టీమ్‌లు వారి వెన్నంటే ఉంటున్నాయంటున్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు, ముఖ్య కార్యకర్తలు, సాధారణ ప్రజల విషయంలో వారు వ్యవహరిస్తున్న తీరును సైతం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ప్రత్యర్థులు, ప్రతిపక్షాలతో వ్యవహరిస్తున్న తీరు, ఇతర పార్టీల నాయకులతో వ్యాపార లావాదేవీలపై ఆరా తీస్తున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు ఇంటెలిజెన్స్‌కు చిక్కకుండా.. గన్‌మెన్లను, సెల్‌ఫోన్లను సైతం వదిలేసి వెళ్తున్న ఘటనల వివరాలు కూడా రాజధానికి చేరుతున్నాయి. ఈ నిఘా బృందాల సమాచారం జిల్లా స్థాయి ఇంటిలిజెన్స్ వ్యవస్థకు తెలుసా? తెలియదా? అనే సందేహాలున్నాయి.
ఇద్దరు అభ్యర్థులను మార్చే అవకాశం?
ఈ నిఘా వర్గాలు ఇస్తున్న సమాచారం ఆధారంగా అభ్యర్థుల వ్యవహార శైలిని ఎప్పటికప్పుడు నిశితంగా సీఎం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వేగులిచ్చే రిపోర్ట్టు ఆధారంగా ఎన్నికల నాటికి ఒకరిద్దరు అభ్యర్థులను సైతం మార్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఖమ్మం జిల్లాలో ఒకరు, భద్రాద్రి కొత్తగూడెంలో ఒకరిని మార్చవచ్చంటున్నారు.