నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మేడారం జాతరను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధ్యక్షులు కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. రెండేండ్లకోసారి జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద అడవి బిడ్డల జాతరగా తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొనసాగిన ఆత్మగౌరవ పోరాటంలో, సమ్మక్క సారలమ్మ అందించిన స్ఫూర్తి ఇమిడివున్నదని తెలిపారు. సమైక్యపాలకుల ఏలుబడిలో కల్లోలిత ప్రాంతంగా అలజడులకు గురైన గోదావరీలోయ పరీవాహక ప్రాంతం నేడు సాగునీటి జీవజలంతో సస్యశ్యామలమై ప్రజల జీవితాల్లో సాంత్వన నింపిందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి, దేశవ్యాప్తంగా తల్లుల దర్శనార్థం కోట్లాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండేలా చూడాలని వన దేవతలను కేసీఆర్ ప్రార్థించారు.