– నీచమైన భాషకు ఆద్యుడాయనే!
– రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కరీంనగర్ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. ఒక పన్ను పాడైతేె అన్ని పండ్లన్ని పీకేసుకుంటామా అంటూ ఆయన మాట్లాడాన్ని తప్పు పట్టారు. నీచమైన భాషకు ఈ రాష్ట్రంలో ఆద్యుడు కేసీఆరేనని గుర్తు చేశారు. పాడైంది పన్ను కాదనీ, కాళేశ్వరానికి వెన్నెముకలాంటి మేడిగడ్డ బ్యారేజ్ అని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నారం సుందిళ్ల కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. కేంద్ర జలవనరుల నిపుణులతో పాటు రాష్ట్రానికి చెందిన ఇంజినీర్లు సైతం కాళేశ్వరం నిర్మాణలోపాలను ఎత్తిచూపుతున్నా బీఆర్‌ఎస్ నేతలు సమస్యను చిన్నదిగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశాన్ని బాగుచేయడం పక్కన పెట్టి ముందు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను వెతుక్కోవాలని కేసీఆర్‌కు ఈ సందర్భంగా పొంగులేటి సూచించారు. గత సర్కార్ హయాంలో జరిగిన పాలనపరమైన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దేందుకు మాజీ సీఎం ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. కరువుకు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? అని అన్నారు. మా ప్రభుత్వం డిసెంబర్ 7న ఏర్పడిందని తెలిపారు. అప్పటికే వర్షాకాలం సీజన్ ముగిసిందనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.