– చేవెళ్లలో ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో హౌంశాఖ మంత్రి మహమ్మద్ అలీ
నవతెలంగాణ-చేవెళ్ల
ముస్లింల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారని హౌం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్ లో ముస్లిం సోదరుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మంత్రి మహమూద్ అలీ, చేవెళ్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య, చేవెళ్ల ఎన్నికల ఇన్‌చార్జి పట్లోల్ల కార్తీక్ రెడ్డిహాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .. ‘చేవెళ్ల అన్న కోసం వచ్చిన.. కాలా రహేతో.. క్యాహై.. దిల్ వాలే హయే..(నల్ల గుంటే ఏంది మనసున్న మనిషి యాదన్న)’ అని అన్నారు. దేశంలో ఎవరూ చేయని పనుల కు సీఎం కేసీఆర్ చేస్తున్నారన్నారు. మైనార్టీలకు కాంగ్రెస్ రూ.933 కోట్లు ఇస్తే.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2014లో రూ.12000 కోట్ల బడ్జెట్ కేటాయించిందన్నారు. మైనార్టీలకు స్కూల్స్, కాలేజీలు, గురుకులాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విదేశీ చదువుల కోసం వందల కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. షాదీ ముబారక్ కోసం రూ. 2300 కోట్లు ఇచ్చినట్టు వివరించారు. రాష్ట్రంలో 50 లక్షల మంది మైనార్టీలు ఉన్నారని గుర్తు చేశారు. కుల మతాలక తీతంగా మానవత్వం, సమన్వయంతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. తనను మరోసారి గెలిపించాలని కోరారు. చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పీటీసీ మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.