అభివృద్ధికి కేరాఫ్‌ కేసీఆర్‌ మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌

నవతెలంగాణ-కారేపల్లి
అభివృద్ధి, సంక్షేమ పధకాలను ప్రజల దరిచేర్చిన కేసీఆర్‌ అభివృద్ధికి కేరాఫ్‌గా మారారని మాజీ ఎమ్మెల్యే వైరా నియోజవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి బానోత్‌ మదన్‌లాల్‌ అన్నారు. బుధవారం కారేపల్లి వైఎస్‌ఎన్‌ గార్డెన్‌లో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు పెద్దబోయిన ఉమాశంకర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మదన్‌లాల్‌ మాట్లాడుతూ వైరా నియోజకవర్గంలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఒకే కుటుంబ సభ్యులుగా బీఆర్‌ఎస్‌ను గెలిపించుకుం దామన్నారు. రాష్ట్రంలో రానున్నది బీఆర్‌ఎస్‌ సంక్షేమ ప్రభుత్వమని తెలిపారు. ఆర్ధిక మూలాలు ఉన్న వారు మూటకట్టలతో బీఆర్‌ఎస్‌లో విషబీజాలు నాటి చీల్చాలని వస్తున్నారని వారిని నమ్మవద్దని కోరారు. వైరా నియోజవర్గంలో బీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసిన ఓడినా కార్యకర్తలు, ప్రజలకు దూరం కాకుండా వారి వెన్నంటే నిలబడ్డానన్నారు. గెలిచిన ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని పని చేశారన్నారు. ఇద్దరు పని చేశాం కాబట్టి నియోజవర్గంలో పార్టీ గొప్పగా ఉందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వాంకుడోత్‌ జగన్‌, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, రైతు బంధు జిల్లా సభ్యులు ఉన్నం వీరేందర్‌, మాజీ రైతు బంధు మండల కన్వీనర్‌ హన్మకొండ రమేష్‌, ఉద్యమకారుడు జడల వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.